జైలులో ఒక సాయంత్రం… ఫైజ్ అహ్మద్ ఫైజ్, పాకిస్థానీ కవి
సర్పిలాకారపు సాయంత్రమనే నిచ్చెన మీంచి
ఒక్కొక్క నక్షత్రపు మెట్టూనీ దిగుతూ
రాత్రి భూమిమీదకు దిగుతుంది.
పిల్లగాలి చెవులకి ఎంతదగ్గరనుండి పోతుందంటే
చెవిలో ఎవరో రహస్యప్రేమభాషణ చేసినట్టనిపిస్తుంది.
జైలు ముందరి ఆవరణలోని చెట్లు
ఆకాశపు పటం మీద ఇంటికి తప్పించుకు పారిపోయే దారిని
అల్లుకుంటున్న కాందిశీకులు.
డాబామీద చంద్రుడు
ప్రేమతో, ఔదార్యంతో
నక్షత్రాలనన్నిటినీ
తళుకులీనే పొడులుగా మారుస్తున్నాడు.
అన్ని దిక్కులనుండీ, దట్టమైన ఆకుపచ్చని నీడలు
తెరలు తెరలుగా నా వైపు కమ్ముకొస్తున్నాయి.
నా ప్రేమిక నుండి ఏడబాటు గుర్తుచేసుకున్నప్పుడల్లా
నన్ను ఎదను ముంచెత్తే బాధా తరంగాల్లా,
అవి ఏ క్షణంలోనైనా నన్ను ముంచెత్తవచ్చు.
అయితే, ఇప్పటికీ ఈ ఒక్క ఆలోచనే నన్ను రక్షిస్తోంది:
ప్రేమికులు రహస్యంగా కలుసుకుందికి ప్రణాళికలు వేసుకునే మందిరాల్లో
లాంతర్లనన్నిటినీ ఛిద్రం చెయ్యమని నిరంకుశపాలకులు ఆజ్ఞ జారీ చెయ్యవచ్చు,
కానీ, చంద్రుణ్ణి ఆపడం వాళ్ళ తరమా? ఈ రోజు కాదు,
రేపు కాదు, భవిష్యత్తులో ఎన్నడూ ఏ నిరంకుశుడూ ఆ పని చెయ్యలేడు.
ఏ చిత్రహింసల విషపానమైనా నన్ను పశ్చాత్తాపంలోకి నెట్టలేదు
భూమి మీద ఏ ప్రదేశంలోనైనా ఎంత హాయిగా గడపగలనో
అంత హాయిగానూ జైలులో ఒక్క సాయంత్రమైనా
మరపురానంత తీయగా గడపగలిగితే చాలు!
.

.
ఫైజ్ అహ్మద్ ఫైజ్
(February 13, 1911 – November 20, 1984)
Pakistani Poet
ఫైజ్ అహ్మద్ ఫైజ్, వామపక్ష మేధావి, ఉర్దూకవి, అభ్యుదయ కవితోద్యమంలో ప్రముఖపాత్రవహించినవాడూ. అతనికి ఉర్దూతోపాటు ఇంగ్లీషు, పార్శీ, అరబ్బీ భాషలపై మంచి పట్టు ఉంది. కొంతకాలం ఇంగ్లీషు లెక్చరర్ గానూ, ఎకనామిక్సు లెక్చరర్ గానూ పనిచేశాడు. సజ్జాద్ జహీర్, జలాలుద్దిన్ అబ్దుర్ రహీం లతో కలిసి 1947లో పాకిస్తాన్ కమ్యూనిస్టుపార్టీని స్థాపించేడు. అతను atheistగా ముద్ర పడినప్పటికీ, మతానికీ, ముఖ్యంగా ఇస్లాంకీ అతనికీ ఒక సంక్లిష్టమైన సంబంధం ఉంది. అతనిమీద సూఫీ తత్త్వవేత్తలప్రభావం చాలవరకు ఉంది. అతనికి లాహోరుకి చెందిన సూఫీ సన్యాసి Baba Malang Sahib తో పాటు, Wasif Ali Wasif, Ashfaq Ahmad, Syed Fakhruddin Balley మొదలైన ప్రఖ్యాతి వహించిన సూఫీ సన్యాసులతో అనుబంధాలున్నాయి.
పాకిస్తానీ కళలకు, నాటకరంగానికి అతను చేసిన సేవ అపారం. 1962 లో నొబెల్ పురస్కారానికి దీటైన Lenin Peace Prize అందుకున్న ఆసియాఖండపు తొలి కవి. 1984లో అతని పేరు నోబెలు పురస్కారానికి పరిగణించబడింది కూడా. రష్యను ప్రభుత్వం నుండి లెనిన్ శాంతి బహుమతి అందుకుంటున్నప్పుడు అతను చెప్పిన మాటలు అమూల్యమైనవి:
మానవ మేధస్సూ, నైపుణ్యం, శాస్త్ర విజ్ఞానమూ పరిశ్రమా మన అందరికీ అన్నీ అందుబాటులో ఉండేలా చేశాయి. కానీ, ఈ అంతులేని సంపదనంతటినీ ఏ కొద్దిమంది దురాశాపరుల స్వంత ఆస్థిగాకాక సమస్తమానవాళికీ ఉపయోగించాలి. అయితే ఇది మానవసమాజపు పునాదులు దురాశా, స్వంత ఆస్థి, దోపిడీతనం మీద గాక, న్యాయం సమానత్వం, స్వేచ్ఛ, సమిష్టి శ్రేయస్సు మీద నిలబడినపుడే సాధ్యపడుతుంది. ఇంతవరకు ఓటమి ఎరుగని మానవత్వం ఇకముందుకూడా ఓడిపోదని నాకు విశ్వాసం ఉంది. చివరకి యుద్ధాలూ, ద్వేషం, క్రూరత్వం మీద కాకుండా, పెర్షియను కవి హఫీజ్ షిరాజ్ చెప్పిన”మీరు ఎన్నిపునాదులు చూసినా ఏదో ఒకలోపం కనిపిస్తుంది ఒక్క ప్రేమ పునాది తప్ప” అన్న ప్రేమ సందేశం మీద నిలబడుతుందని ఆశిస్తున్నాను… అతని కవిత్వం అనేక భాషలలోకి అనువదింపబడడమేగాక, ఫైజ్ కూడా స్వయంగా చాలా కవుల అనువాదాలు చేశాడు.

.
A Prison Evening
.
Each star a rung,
night comes down the spiral
staircase of the evening.
The breeze passes by so very close
as if someone just happened to speak of love.
In the courtyard,
the trees are absorbed refugees
embroidering maps of return on the sky.
On the roof,
the moon – lovingly, generously –
is turning the stars
into a dust of sheen.
From every corner, dark-green shadows,
in ripples, come towards me.
At any moment they may break over me,
like the waves of pain each time I remember
this separation from my lover.
This thought keeps consoling me:
though tyrants may command that lamps be smashed
in rooms where lovers are destined to meet,
they cannot snuff out the moon, so today,
nor tomorrow, no tyranny will succeed,
no poison of torture make me bitter,
if just one evening in prison
can be so strangely sweet,
if just one moment anywhere on this earth.
.
Faiz Ahmed Faiz
(13 February 1911 – 20 November 1984)
Pakistani Poet
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి