అన్నా! ఈ రోజు మనింట్లో ఇటుకబెంచీ మీద కూర్చున్నాను.
అక్కడ నువ్వొక లోతెరుగని శూన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు.
నాకు బాగా గుర్తు, మనం ఈ సమయంలో దొంగాట ఆడుకునే వాళ్లం.
అమ్మ “ఒరే పిల్లలూ” అంటూ జాగ్రత్తలు చెబుతుండేది.
నేను ఎప్పటిలాగే ఇప్పుడూ
దాక్కుంటునాను సాయంత్రపు నీతిబోధలనుండి.
ఎక్కడున్నానో నువ్వెవరికీ చెప్పవని నా నమ్మకం.
చావడిలోనో,వాకిలి సందులోనో, వసారాలోనో, ముందు నేను;
తర్వాత నువ్వు దాక్కుంటే, ఎక్కడున్నావో నెవరికీ చెప్పేవాణ్ణి కాదు.
అన్నా! నాకు ఇంకా గుర్తే, మనం ఎంతలా
పడి పడీ నవ్వుకునేవాళ్ళమంటే కళ్ళవెంట నీళ్ళొచ్చేవి.
ఒకానొక ఆగష్టు రాత్రి తెల్లతెలవారుతుంటే
మిగెల్, నువ్వు ఎక్కడో దాక్కుందికి పోయావు.
కానీ, నవ్వుకి బదులు, నీ ముఖంలో విచారం దాగుంది.
నువ్వెక్కడున్నావో తెలుసుకోలేకపోయినందుకు
నాకు ఈ వట్టి సాయంత్రాలపట్ల కోపం వస్తోంది.
నా మనసుమీద చీకటిచాయలు కమ్ముకున్నాయి.
అన్నా! నా మాట విను. దాక్కుంటే దాక్కున్నావు గానీ
బయటపడడం ఆలస్యం చెయ్యకు. ఏం? అమ్మ బెంగెట్టుకోగలదు.
.
సిజార్ వలేహో
(March 16, 1892 – April 15, 1938)
పెరూ కవి
César Valejo
స్పందించండి