ఈ అద్భుత, భయానకమైన స్వాతంత్య్రం, ఈ స్వేచ్ఛ,
మనిషికి ప్రాణవాయువంత అవసరమైనదీ,
ఈ మట్టి అంత ఉపయోగించదగినదీ;
చివరకి అది మనకందరికీ స్వంతమైనపుడు;
ఎలాగైతేనేం అది మనకందరికీ చెందినపుడు,
అది నిజంగా మన బుద్ధీ, స్వభావంగా మారినపుడు,
లబ్ డుబ్ లబ్ డుబ్ మని మన గుండెచప్పుడైనపుడు,
మన జీవనంలో అంతర్భాగమైనపుడు,
కడకి దాన్ని మనం సాధించగలిగినప్పుడు;
అది రాజకీయనాయకులు వల్లించే అర్థంలేని అందమైన
అట్టహాసపు పదబంధాలకి అతీతంగా నిజమైనపుడు,
ఫ్రెడెరిక్ డగ్లస్ అనబడే ఈ వ్యక్తి, ఒకప్పటి బానిస,
ముణుకులమీద దెబ్బలుతిన్న ఈ నల్లవాడు, దేశబహిష్కృతుడు,
ఎవరూ పరాయి, ఏకాకి కాకూడదని, వేటాడబడకూడదని కలలుగన్నవాడు,
ప్రేమలోనూ, వివేకములోనూ సాటిలేనివాడు, అతను నిత్యం
స్మరింపబడతాడు. కానీ, ఉపన్యాసాలలోనూ, శిలావిగ్రహాలుగానూ కాదు;
కథలుగా, కవిత్వంగా, కంచు విగ్రహాలూ, వాటికి వేసిన దండలుగానూ కాదు:
అతని జీవితస్ఫూర్తితో పునర్జన్మించిన జీవితాలుగా, అంతటి అద్భుతమైన,
అవసరమైన, అతని ‘కల’కి రక్తమాంసాలద్దిన జీవితాలుగా.
.
రాబర్ట్ హేడెన్
(August 4, 1913 – February 25, 1980)
అమెరికను
Robert Hayden
Frederick Douglass
(Born Frederick Augustus Washington Bailey;. February 1818 – February 20, 1895 was an American social reformer, abolitionist, orator, writer, and statesman. After escaping from slavery in Maryland, he became a national leader of the abolitionist movement in Massachusetts and New York, gaining note for his oratory and incisive antislavery writings.)
స్పందించండి