ఈ కవిత ప్రస్తుతం అన్ని సమాజంఅలలోనూ ఉన్న విద్యావ్యవస్థలమీద నిశితమైన వ్యాఖ్యగా నేను భావిస్తున్నాను. విద్యాలయాలలో బోధిస్తున్న విషయాలు మనిషినీ- మృగాన్నీ; వెలుగునీ-చీకటినీ, ప్రేమనీ- ద్వేషాన్నీ, వేరుచేసి చూడలేని అశక్తతను కలిగిస్తున్నాయి. మన ఆలోచనలకు రూపాన్నిచ్చే పదాలు, వాటి భావచిత్రాలు, కేవలం శుష్కమైన పర్యాయపదాల్లో ఇమిడిపోతున్నాయి తప్ప, సారూప్యంగా ఉన్న విరుద్ధవిషయాలను విశ్లేషించి వేరుచేయగల సమర్థతను అందించలేకున్నాయి. ఈ చదువు ఒకరకంగా గొర్రెపిల్లను వేటకు తీసుకెళుతున్న చందాన ఉంది. ఆ ఉరికంబంనుండి ఏ కొద్దిమందో మాత్రమే బయటపడగలుగుతున్నారు.
***
నా వయసు ఇరవై నాలుగు
నన్ను వధ్యశిలకు తీసుకుపోయినా
ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను.
ఈ క్రింది శుష్కపదాలన్నీ సమానార్థకాలు:
మనిషీ- మృగమూ
ప్రేమా- ద్వేషం
మిత్రుడూ- శత్రువూ
చీకటీ – వెలుగూ
మనిషినీ మృగాన్నీ చంపే తీరు ఒక్కటే
నేను కళ్ళారా చూసేను:
లారీలనిండా ముక్కలుగా నరికిన
దిక్కులేని మనుషుల శవాల్ని.
ఆలోచనలకేముంది, అవి వట్టి మాటలు:
సద్వర్తన – నేరప్రవృత్తి
నిజాలు- అబద్ధాలు
రూపం – కురూపం
సాహసం- పిరికిదనం.
సద్గుణానికీ నేరప్రవృత్తికీ ఇచ్చే విలువ ఒక్కటే:
నేను కళ్ళారా చూసేను:
ఒకమనిషి ఎంత సుగుణాలపుట్టో
అతనంత నేరప్రవృత్తిగలవాడు.
నేను ఒక దేశికునికోసం, గురువుకోసం వెతుకుతున్నాను
అతను నా దృశ్య, శబ్ద, వాక్ శక్తులని పునరుద్ధరించగలడనీ
అతను తిరిగి వస్తువులకీ, ఆలోచనలకీ సరియైన పేర్లివ్వగలడనీ
స్పందించండి