.
మామూలు కలమూ కాగితమూ తీసుకో. రాయి.
నే చెప్పినట్టు రాయి: “వాళ్ళకి తిండి పెట్టలేదు.
వాళ్ళందరూ ఆకలి తాళలేక చనిపోయారు”. “అందరూనా?
అంటే ఎంత మంది? అదొక పెద్ద మైదానం. వాళ్ళందరినీ
సమాధిచెయ్యడానికి ఎంత నేల కావలసి వచ్చుంటుంది?”
ప్రశ్నలడక్కు. నే చెబుతున్నట్టు రాయి: అది నాకు తెలీదు.
చరిత్ర అస్థిపంజరాలని వేలల్లోనూ, లక్షల్లోనూ చెబుతుంది
ఉదాహరణకి వెయ్యిన్నొకటిని వెయ్యిగా చెబుతుంది
అక్కడికి ఆ వెయ్యిన్నొక్క వ్యక్తి ఎన్నడూ భూమ్మీద పుట్టనట్టు:
ఆ పిండం ఒక కల్పన, అది ఊగిన ఊయల శూన్యం,
అది ఓనమాలుకూడా దిద్దకుండానే మరణించింది.
అది నవ్విననవ్వులూ, దాని ఏడుపులూ, పెరుగుదలా,
తోటలోకి మెట్లమీంచిపెరిగెత్తిన పరుగూ … అంతా శూన్యమే.
ఆ అనామిక సరళరేఖమీద గుర్తింపులేని ఒక బిందువు.
అది రక్తమాంసాలతో నడిచిన మైదానం మీద మేము నిలుచున్నాం.
దొంగ సాక్షిలా మైదానం మౌనంగా మిన్నకుంది.
చక్కని ఎండ. ఎటుచూసినా పచ్చదనం. దగ్గరలోనే
దట్టంగా పెరిగిన చెట్లతో అడివి. తినడానికీ కావలసినంత ఎరువు.
చెట్టు బెరడులో ప్రవహిస్తున్న నీరూ అదే. మనిషికి దృష్టిదోషం
వచ్చేదాకా ఎదుటనే ప్రతిరోజూ కనువిందు చేసే సౌందర్యం.
జీవం ఉట్టిపడే ఎగురుతున్న పక్షి రెక్కల నీడ
వారి* పెదాలను తాకింది. దాని దవడలు తెరుచుకున్నాయి.
దంతాలు ఒకదానిమీద ఒకటి ఒరుసుకున్నాయి.
కొడవలిలాంటి చంద్రుడు రాత్రి ఆకసంలో మెరిసి
వాటికి రొట్టెనివ్వడానికి గోధుమచేను కోతకోసాడు.
మసకబారిన బొమ్మల్లోంచి చేతులు తేలుతూ వచ్చాయి.
వేళ్ళసందున ఖాళీ కప్పులు పట్టుకుని.
ముళ్ళకంచెమీద కురిసిన వర్షపుచినుకుల్లో
ఒక మనిషి ఎవరో ఒత్తిగిలుతున్నాడు.
నిండా మట్టికొట్టుకుపోయిన నోళ్ళతో వాళ్ళు పాటలుపాడుతున్నారు:
“యుద్ధం సూటిగా ఎలా గుండెలలోంచి దూసుకుపోతుందో
చెప్పే అందమైన పాట.” అంతా నిశ్శబ్దం అని రాయి. రాసేవా?
“హాఁ ! రాసేను.”
.
జిష్వావా షింబోర్స్కా
2 July 1923 – 1 February 2012
పోలిష్ కవయిత్రి
* ఆకలికి తాళలేక యుద్ధంలో/ యుద్ధం వల్ల చనిపోయిన వ్యక్తుల శవాలు.
వారి రక్తమాంసాలిపుడు ప్రకృతికి ఎరువులు. శవాలైపోయినా తీరని వారి ఆకలిని తీర్చడానికి కొడవలిలా ఉన్న చంద్రుడు గోధుమపంట కొయ్యడం గొప్ప వ్యంగ్యంతో కూడిన ఉపమానం.
మరి, కవిత్వానికీ, యుద్ధానికీ, ఈ కవితకీ సంబంధం ఏమిటి? మంచి కవులుకూడా యుద్ధంలో పోరాడే సైకులలాటివాళ్ళే! ! వాళ్ళు ఎప్పుడూ లెక్కలోకి రారు. వాళ్ళూ అలమటించవలసిందే! యుద్ధంలో అనామకంగా మరణించిన సైనికుల్లా వారూ అనామకంగా మరణించవలసిందే! కానీ, వాళ్ళు రాసి వదిలేసిన కవితలే తక్కినవాళ్ళకి బలవర్ధకాలు.

స్పందించండి