ఊగిసలాడుతున్న రోజు… ఆక్టేవియో పాజ్, మెక్సికను కవి
తన పారదర్శకతకి తానే మురిసిపోతూ
ఉండనా, మాననా అని రోజు ఊగిసలాడుతోంది.
గుండ్రంగా భూమిని కప్పిన మధ్యాహ్నపుటెండవేళ
మనుషులులేని సముద్రతీరంలా, ప్రశాంతంగా ప్రజలు జోగుతున్నారు.
అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏదీపట్టుదొరకదు,
అన్నీ సమీపంలోనే ఉన్నాయి ఏదీ చేతికందదు.
కాగితం, పుస్తకం, పెన్సిలు, అద్దం పేరుకే…
అవి ఏ పనీ లేక విశ్రాంతి తీసుకుంటున్నాయి.
‘లబ్ డబ్’ మంటూ నెత్తుటి భాషలో ఎప్పటిలాగే
నా కణతల దగ్గర కాలం కొట్టుకుంటోంది.
నిర్లిప్తంగా ఉన్న గోడమీద రకరకాల నీడలు వేసి
వెలుతురు దాన్నొక దయ్యాల రంగస్థలంగా మారుస్తోంది.
గుడ్లప్పగించి చూస్తున్న కనుపాపమధ్యలో
నా ప్రతిబింబం నాకే కనిపిస్తోంది.
కాలం విస్తరిస్తోంది. చలనరహితమై
నేను ఉండీ, లేను; నా అస్తిత్వమొక విరామం.
.
ఆక్టేవియో పాజ్
(March 31, 1914 – April 19, 1998)
మెక్సికను కవి
.
