ఊఁ , తలెత్తుకు నిటారుగా నిలబడు! నువ్వు నీ దేవునికి ప్రతిరూపానివి! అంతకంటే ఏంకావాలి? దైనందిన జీవన సంఘర్షణలో మొక్కవోకుండా నిలబడే గుండెధైర్యమూ, ఎవరికీ తీసిపోని నిర్మల, దయార్ద్రహృదయమూ నీకున్నాయి!
ఏం చెప్పను? ఈ మానవసమూహంలో తిరుగాడే అందరిలాగే నువ్వూ నిజాయితీ పరుడివే; ఏ మహత్తర ప్రణాళికతో సృష్టికి పొద్దుపొడిచిందో ఆ లక్ష్యసాధనలో ఈ ప్రాణికోటిలో ప్రతిఒక్కరిలా నువ్వూ అందులో భాగస్వామివే.
నీకు శత్రువు ఎవరు? ఉన్నత పదవిలో ఉన్నవాడా? ధనవంతులలో అగ్రగణ్యుడా? లేక నీ వంక కన్నెత్తైనా చూడకుండా గర్వంగా అడుగులేసుకుంటూ నిర్లక్ష్యంగా పోయే గొప్పమనిషా?
అయినా, నీకు నువ్వు నిజాయితీగా ఉన్నంతసేపూ ఆ గర్విష్ఠి నిర్లక్ష్యం నిన్నేం చేస్తుంది? నువ్వు దాన్నొక పక్షి ఈకలానో, పెనుగాలికి చెట్టునుండి రాలిపడే పండుటాకులానో ప్రక్కకి తీసిపారెయ్యవచ్చు.
వద్దు: అణచుకోలేని ఆవేశాలూ, నీచమైన కోరికలూ అమూల్యమైన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమూ వద్దు, వారి స్థాయిని అందుకోవాలని నిరంతరం గుండెని రగిల్చే కోరికలని నియంత్రించకపొతే ప్రమాదం.
ఇవి నీ శత్రువులన్నిటిలోకీ అధమాధమం: అవి నీ వ్యక్తిత్వాన్ని ఎదగనీకుండా బంధిస్తాయి; నీ శ్రమా, నీ జీవితం శాపగ్రస్తమౌతాయి. ఓ శ్రామికుడా! తలెత్తుకు నిలబడు. ఆ శృంఖలాలనుండి బయటపడు, ఆ బాధల్ని అధిగమించు.
నీకు నువ్వే పెద్ద శత్రువువి: ఎవరు గొప్పవాళ్ళు?! నీకంటే ఏ రకంగా మెరుగు? వారిలాగే నీకూ స్వతంత్య్రంగా ఆలోచించగల స్వేచ్ఛ లేదూ? భగవంతుడు తన ఆశీస్సులు అందించడంలో నీకు ఏమైనా తక్కువ చేశాడా?
నిజమే! నీకు డబ్బు లేదు— అది కేవలం మిత్తిక; అధికారమంటావా— గాలిలా దానికి నిలకడలేదు; కానీ, నీ దగ్గర ఆ రెండింటినీ మించి వాటిని మనఃస్ఫూర్తిగా తృణీకరించగల ఉదాత్తమైన మనసు ఉంది.
అటువంటి మనసూ, ఆవేశాలు అదుపుచేసుకుని భగవంతునిమీద నిజమైన నమ్మకం, విశ్వాసం కొనసాగిస్తే, నువ్వు ఏ ఒక్కరితోనైనా సమ ఉజ్జీవే. కాబట్టి, నీ చిన్ని జీవితం సాఫీగా కొనసాగేలా ధైర్యంగా తలెత్తుకో! .