.
“ఎవరక్కడ?” అని అతనడిగేడు
“మీ విధేయుడైన సేవకుడిని,” అన్నాను నేను.
“ఈక్కడ నీకేం పని?” అడిగేడతను.
“ప్రభూ! మిమ్మల్ని దర్శించుకోడానికి వచ్చేను,” అన్నాను నేను.
“ఎన్నాళ్లని ఇలా తిరుగుతూ ఉంటావు?” అని అడిగేడతను.
“స్వామీ! మీరు ఇక చాలు అనేదాకా,” అన్నాను నేను.
“ఎన్నాళ్లని ఇలా మంటలో సలసల్కాగుతావు?”
“నేను పరిశుద్ధుడను అయేదాకా!” అన్నాను నేను.
అని, “ప్రభూ! ప్రేమమీద ప్రమాణం చేసి
చెబుతున్నా, నేను ప్రేమ కోసం
నా హోదానీ, నా సంపదనీ వదులుకున్నాను,” అన్నాను.
“నీ వాదన సరిగానే వినిపించావు గానీ
దానికి సాక్షులెవరూ లేరే” అన్నాడతను.
దానికి నేను, “నా కన్నిళ్ళే దానికి సాక్షులు;
వివర్ణమైన ఈ వదనమే దానికి ఋజువు,” అన్నాను.
“నీ సాక్షులు అంత నమ్మదగ్గవి కావు.
నీ కన్నులు మరీ తడిగా ఉన్నాయి చూడగలగడానికి.”
“మీ ధర్మనిరతి యొక్క ప్రభ వల్ల
నా కన్నులు స్పష్టంగానూ, లోపరహితంగానూ ఉన్నాయి.”
“ఇంతకీ, నీకు ఏమి కావాలి?”
“మీరు సర్వకాలములందూ నా చెలికాడు కావాలి.”
“నేను నీకు చెయ్యగలిగినదేమిటి?”
“అపారమైన మీ కరుణ నాపై చూపించడమే.”
“నీ ప్రయాణంలో తోడుగా ఎవరున్నారు?”
“ఓ ప్రభూ! మీ గురించిన తలపులే.”
“నిన్ను ఇక్కడకు రప్పించిందెవరు?”
“సుగంధపరిమళము వెదజల్లే అమృతమే”
“నీకు మిక్కిలి సంతృప్తినిచ్చేది ఏది?”
“నా ప్రభువు సాన్నిధ్యము.”
“అక్కడ నీకెమిటి కనిపిస్తుంది?”
“కొన్ని వేల వేల అద్భుతదృశ్యాలు.”
“భవనమంతా చిన్నబోయిందేమి?”
“గొంగకు భయపడి అందరూ తప్పుకున్నారు.”
“ఇంతకీ, ఎవరా దొంగ?”
“ఇంకెవరు? నన్ను మీనుండి దూరంచేసేవారే!”
అతనన్నాడు, “అక్కడమాత్రం భద్రత ఎదీ?”
“సేవనలోనూ, పరిత్యాగంలోనూ ఉంది.”
“పరిత్యజించడానికేమున్నది అక్కడ?”
“ముక్తి లభిస్తుందన్న ఆశ.”
“మరి ఓపలేని దుఃఖం ఎక్కడుంది?”
“మీ సన్నిధిలో పొందే ప్రేమ తీపులో”
“ఈ జన్మవలన నువ్వెలా లాభపడ్డావు?”
“నాకు నేను నిజాయితీగా ఉంటూ.”
ఇక ఇప్పుడు నిశ్శబ్దం పాటించవలసిన సమయం.
నేను గనక మీకు అతని నిజమైన తత్త్వాన్ని చెప్పేనంటే
మిమ్మల్ని ఈ తలుపులూ, ద్వారబంధాలూ, పైకప్పులూ ఆపలేవు,
మిమ్మల్ని మీరు త్యజించుకుని రెక్కలతో ఎగిరిపోతారు.
.
రూమీ,
పెర్షియన్ కవి
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి