ఇక్కడ “చిన్ని పెట్టె” ఒక ప్రతీక. అది మనిషి జ్ఞాపకాలకీ, మెదడుకీ కూడా సంకేతం కావొచ్చు. ఇలా సున్నితంగా ప్రారంభమైన జీవితం, దృశ్య, శ్రవణాది ఇంద్రియాల అనుభూతుల్నీ, వాటి జ్ఞాపకాలను పోగుచేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇంత చిన్నదీ, ప్రపంచం గురించి అవగాహన చేసుకుంటూ, ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకోగలిగేలా ఎదిగిపోతుంది. ఈ జ్ఞాపకాలని ఇతరులతో పంచుకుంటుంది. వయసు మీరినపుడు అందులో కొన్ని పోగొట్టుకుంటుంది. నిజానికి ఎవరికైనా, జీవితమంతా అనుభూతుల, జ్ఞాపకాల భరిణ. అందుకే వాటిని పదిలంగా కాచుకోవాలని చెబుతున్నాడు కవి.
***
ఈ చిన్ని పెట్టెకు పాలపళ్ళు మొలిచి,
కొంత పొడుగు ఎదిగి
ఒళ్ళు చేసి, ఈ శూన్యావరణంలో
దానికి ఒక రూపం ఏర్పడుతుంది.
ఒకప్పుడు తను పట్టిన బీరువా
ఇపుడు తనలో ఇమడగలిగేలా
క్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ పోతుంది.
అదింకా పెద్దవుతూ పోతుంటే
ఇప్పుడు ఆ గది తనలో ఇమిడిపోతుంది,
తర్వాత ఈ ఇల్లూ, ఈ ఊరూ, ఈ భూమి
చివరకి ఈ విశ్వం అందులో ఇముడుతుంది.
ఈ చిన్నిపెట్టెకు తన బాల్యం గుర్తుంటుంది
అమితమైన కాంక్షతో
తిరిగి తనో చిన్న పెట్టె ఐపోతుంది.
ఇపుడా చిన్నిపెట్టెలో
ఈ విశ్వమంతా సూక్ష్మరూపంలో ఉంది.
ఇపుడు మీరు సులభంగా జేబులో పెట్టుకోవచ్చు,
ఎవరైనా దొంగిలించవచ్చు, మీరు పోగొట్టుకోవచ్చు.
కనుక ఆ చిన్నిపెట్టె జాగ్రత్త !
.
వాస్కో పోపా
June 29, 1922 – January 5, 1991
సెర్బియన్ కవి
స్పందించండి