ఈ భూమ్మీద అందరూ గతిస్తారు… నీ యవ్వనం, నీ తల్లిదండ్రులూ;
నీ భార్య నిన్ను వంచించవచ్చు, నీ ఆప్తమిత్రుడు నిన్ను విడిచిపోవచ్చు,
కానీ, ధృవందగ్గర అద్దంలాంటి ఈ నేలనీ చూస్తూ
ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడం ఎలాగో నేర్చుకో.
నీ దోనెలోకి నువ్వు ఎక్కు, మంచుగోడల మధ్యనుండి
దూరానకనిపిస్తున్న ధృవానికి సాగిపో; నీ వాళ్ళు నిన్నెలా ప్రేమించేరో,
ఎలా పోరాడేరో, ఏమి సాధించేరో, ఎలా మరణించేరో, ఒక్కొక్కటే మరిచిపో;
నిరంతరం నిన్ను బాధించే కష్టాల చిఠ్ఠా మరుగున పడనీ.
మెల్లమెల్లగా తెరలుతెరలుగా అడుగుపెట్టే శీతపవనాలకి
వణికుతున్నా, నీ శరీరం ఎలాగైతే అలవాటు పడిపోయిందో, అలాగే
ఒకసారి ఈ శరీరంనుండి మిరిమిట్లుగొలిపే జీవకళ తొలగిపోగానే,
ఇక్కడకుచెందిన దేనికోసమూ అది దేబిరించకుండా ఉండేట్టు అలవాటు చెయ్యి.
.
అలెగ్జాండర్ బ్లోక్
(28 November 1880 – 7 August 1921)
రష్యను కవి.