Stephen Duck “Threshers’ Labour అని 1730లో ఒక కవిత రాసేడు. అందులో అతను గ్రామీణ స్త్రీలు ఎలా పనిలేకుండా కూచుంటారో చెబుతూ, పని తాలూకు ఔన్నత్యాన్ని ప్రబోధిస్తూ రాసేడు. ఈ రకమైన బోధనాత్మకమైన ప్రక్రియకి Georgic అని పేరు. ఈ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా Hesiod (750 BC) తన Works and Days అన్నకవిత వ్రాసేడు. దానిని అతని తర్వాత Virgil ప్రచారంలోకి తీసుకువచ్చేడు. ప్రకృతివర్ణనలు ఉండడం వలన పైకి ఈ కవితలు గ్రామీణ చిత్రాల్లా కనిపించినా, కవితా వస్తువునుబట్టి అందులో పురాణగాథల ప్రతీకలూ, కథలతో బాటు తత్త్వచింతన నిండి ఉంటుంది. ఈ ప్రక్రియ మౌలిక లక్ష్యం ఒక విషయం (నైపుణ్యంగాని, కళగాని, విద్యగురించిగాని) బోధించడం, సూచనలివ్వడం.
Mary Collier (1688 – 1762) ఒక సామాన్య శ్రామికురాలు. తక్కిన కూలిపనులతోపాటు ధనికుల ఇళ్ళలో చాకలిపని చేసేది. చదవనూ రాయనూ ఆమెకు ఇంటిదగ్గర తల్లిదండ్రులు మప్పేరుతప్ప ఆమె ఏ బడిలోనూ చదువుకోలేదు. యుక్తవయసురాలైనా, ఆమె తన ఆనందం కోసమే చదువుకునేది.
“The Woman’s Labour – An Epistle to Mr. Stephen Duck”, Stephen Duck కు అతని ప్రక్రియలోనే, ఉత్తరం రూపంలో ఇచ్చిన తిరుగులేని జవాబు. ఆ ప్రక్రియని ధ్వంసంచేస్తూ (ఒక విషయాన్ని పొగుడుతూ రాయడానికి బదులు) స్త్రీల శ్రమ ఎంతదారుణంగా ఉంటుందో చిత్రిస్తుంది. శ్రామిక వర్గానికి సంబంధించినంతవరకు స్త్రీలైనా, పురుషులైనా ఉన్నతవర్గాలకి ఊడిగం చేసేవాళ్ళేననీ, లింగ వివక్షతో శ్రమని వర్గీకరించడానికి బదులుగా స్త్రీల శ్రమని పురుషులు అర్థం చేసుకోవాలని ఆమె తాత్పర్యం. అంతే కాదు, శ్రమ విషయానికి వస్తే, స్త్రీలు పడే శ్రమతో పోలిస్తే పురుషుల శ్రమ శ్రమకాదని చూపిస్తుంది.
(అంకితం: శ్రీ స్టీఫెన్ డక్ కి.)
ఓ అమరకవీ! నవకళాధిదేవతల ముద్దుబిడ్డడా!
సహకవులమన్నలూ, కేరొలీన్ అనుగ్రహం కలిగినవాడా!
మొన్నమొన్నటిదాకా నువ్వు ఈ స్థితిలో ఉండేవాడివని గుర్తుంచుకుని
నావంటి బీద, దీనురాలిపై నీ కరుణార్ద్ర దృక్కులు ప్రసరించు!
ఈ క్రింది పంక్తులు స్వీకరించు. అయినా ఇప్పటికీ బానిస అయిన
ఈ దీనురాలు, ఎవరైతేనేమిలే, నీకేమి ఇవ్వగలదు?
నే నెన్నడూ చదువుకున్న పాపాన పోలేదు,
నా జీవితమంతా గొడ్డుచాకిరీలోనే గడిచిపోయింది:
ప్చ్! నా ఒక్కతెదే కాదు; నా దుఃఖంలో ఎటుచూసినా
మా ఆడజాతి మొత్తమంతా అదేమాదిరి ఉంది.
ఆ రోజు చాకిరీనుండి విముక్తి లభించి
పక్కమీదకి వాలినపుడు చాలా సార్లు అనుకున్నాను
నాగరికత పెరిగిన తొలిరోజుల్లో చాకిరీకే పుట్టినట్టు
మా స్థితి ఇలా ఉండేది కాదేమోనని;
కాలం గడిచి సంప్రదాయం క్రమంగా నశించేవరకూ
మా స్త్రీజాతి మంచిరోజులు చవిచూసింది.
మగవాళ్ళు మాకోసం ఎంతో శ్రమించి, మాపై శ్రద్ధచూపేవారు
ప్రతిఫలంగా కేవలం ఒక్క మా చిరునవ్వు కోసం;
వాళ్ళు కళలలో, యుద్ధాలలో గెలిచివచ్చినపుడు
ఆ విజయచిహ్నాల్ని స్త్రీల పాదాలముందు ఉంచేవారు;
వాళ్ళు, ఆ రోజుల్లో, తమంత తాముగా స్త్రీల ముందు
తమ హృదయాలనీ, సర్వస్వాన్నీ సమర్పించేవారు;
మా పొందులో వాళ్ళ ప్రతిబింబాలను పొంది
ప్రతిగా యోగ్యమైన సమ్మానం చేస్తుండేవారు.
ఒకసారి ‘జోవ్ (Zeus)’ మేఘాలనుండి క్రిందలి దిగుతూ
అందమైన ‘డేనై (Danae)’ ఒడిలో బంగారపు జల్లు కురిపించాడట.
కమ్మని కవితలల్లే కవులు కొందరు ఆ ఉదారమైన రోజుల్లో
మా హృదయ దేవళాలకి తమగీతాలు అంకితం ఇచ్చేవారు!
కానీ ఇప్పుడు? హుఁ! ఆ స్వర్ణయుగం అంతరించింది,
చివరకి, మీ వెటకారాలకీ కేంద్రబిందువులైనాము.
కానీ, కవితా కన్యక మీ శిరసును పూలమాలతో
అలంకరించిన మాననీయ డక్ గారూ,
మీరు ఈ మధ్యనే రాసిన కవితలో గొప్పప్రకటన చేశారు:
హెర్క్యులిస్ చేసిన సాహసాలుకూడా మీశ్రమకు సాటి రావని.
ఉదాహరణగా ఏడాదిపొడుగునా మీరు చేసే చాలా శ్రమని …
పంటకొయ్యడం, పోకపెట్టడం, గింజలు రాల్చడం, కుప్పపెట్టడం,
మీరోజువారీ శ్రమ ఏకరువు పెట్టి, మీ కలలన్నీ చెప్పినా
అప్పటికీ మీ జాబితా సంతృప్తిగా ముగియలేదు,
నిస్సహాయులమైన మా స్త్రీజాతి ఉనికిని మరిచి,
మౌన ప్రేక్షకులుగా నిలబెట్టి, ప్రస్తావనేలేకుండా సమాధిచేశారు.
కానీ మేముచేసే తప్పులతో మీ కవితని అలంకరిస్తూ,
మా దీనావస్థని గర్హించడం మాత్రం మరిచిపోలేదు.
కుప్పవెయ్యడం గురించి చెప్పినపుడు ఒకటిరెండు మాటలు చెప్పేరు
ఆకాటికి మా స్త్రీలకు అంతకిమించి పనిరాదన్నట్టు.
ఏ నిజాయితీగల రైతన్నా మనఃస్ఫూర్తిగా చెబుతాడు .
కుప్పవెయ్యడానికి దొరికినంతకాలం ఆడవారినే కుదుర్చుకుంటానని.
ఎందుకంటే, అతనికి తెలుసు, తను చూపు మరల్చినా,
ఆడవారు మగవారిలాగే, తమపనితాము చేసుకుపోతారని.
నా మట్టుకు నేను ప్రతి వేసవిలో చాలరోజులు నూర్పులపుడు
కట్టలు వెదజల్లడం, తిరగెయ్యడం, మేటువెయ్యడంలోనే గడిపాను.
కానీ ఎన్నడూ మీ కవితలో కొత్తగా కనిపెట్టినట్టు
ఊరికే నేలమీద కూచున్నందుకు కూలి ఇచ్చిన దాఖలాలు లేవు.
ఒకటిమాత్రం నిజం. పగలు మా పనంతా అయిపోయిన తర్వాత,
గడ్డంతా ఎండలో పరవడం పూర్తయిన తర్వాత,
సూర్యుడిప్రతాపం ప్రతి పోచమీదా మెరుస్తున్నప్పుడు,
మీలాగే, మేమూ తినడానికి తీరికగా చతికిలబడేవాళ్లం.
మా తిండి మేము సంపాదించుకుందికి చెమటోడ్చే మాఖు
తినడానికి మీరు కొంత సమయం కేటాయించడం సబబు అనుకుంటాను.
తినడం పూర్తవగానే, వెంటనే పనిలోకి దిగి
చురుకుగా గడ్డిని తిరగ మరగ వేస్తుండేవాళ్లం.
అంతే కాదు, అరకొయ్యతో చాలుచేసి లాగేవాళ్ళం.
లేకపోతే అంత నజరుగా వరుసలో ఎలా వచ్చేవి?
కానీ, మీరు రాసింది నిజమని మీరు నమ్మితే, నా దృష్టిలో
మేము అలా మాటాడుకోవడమే మీ బాధకి కారణమనిపిస్తోంది.
ఈ విషయంలో మీరు మనసులో ఉన్నది చెప్పడంలేదేమో.
ఎందుకంటే, నాకు తెలిసినంతవరకు ఒక్క తురుష్కులే
పనిచేస్తున్నప్పుడు బానిసలని మాటాడకుండా శాసించేవారు.
వేరెవరూ బానిసలు నవ్వుతూ మాటాడుకోవడాన్ని నిరాకరించలేదు.
మీకు మీ మనసులో ఉన్నది చెప్పుకుందికి ఎంత స్వాతంత్య్రం ఉందో
మాటాడుకుందికి మాకూ అంతే స్వాతంత్య్రం ఉందనుకుంటాను.
మీరెందుకు దానికి చింతించాలి? ఎందుకంటే,
మీలాగే, మేముకూడా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామనా??
ఏమిటి? దానిలోకూడా మీ అజమాయిషీయేనా?
మే మనుభవించే ఆ ఒక్క హక్కుకూడా లాక్కుంటారా?
పొద్దువాలడమే తడవు, ఇంటిదిక్కు పరిగెడతాం,
ఇంటిదగ్గర గంపడు పనులు మాకోసం ఎదురుచూస్తుంటాయి.
మీరు ఇంటికి తిరిగి వచ్చేలోపు మా పనులన్ని
పూర్తిచేసుకుందికి సిద్ధపడాలి, ముందు ఇల్లు చక్కబెట్టాలి,
పొయ్యిమీద సంకటి, మాంసం ఉదకనివ్వాలి,
పక్కలు సర్దాలి, పందులకి మేతవెయ్యాలి,
మీ రాకకోసం గుమ్మం దగ్గర ఎదురుచూడాలి
మీరు రాగానే టేబిలుమీద అన్నీ సర్ది ఉంచాలి.
మరుసటి రోజు ఉదయాన్నే ముందు మీ అవసరాలు తీర్చాలి
పిల్లలకి బట్టలుతొడిగి, తినిపించి, బట్టల చిరుగులు కుట్టాలి.
ముసురుకున్న మంచుతెరలు సూర్యుడు తొలగించడమే ఆలస్యం
పొలాల్లో మా రోజువారీ చాకిరీ తిరిగి ప్రారంభం అవుతుంది.
కోతలసమయం రాగానే, చేలోకి దిగుతాం
మీ అందరిలాగే గోధుమలు కొయ్యడానికి సాయం చేస్తాం.
లేదంటే, పనలనుండి గింజలు ఏరడానికి వెళతాం.
ఎన్నడూ పనిని చిన్నచూపుచూడం, అదెంత అల్పమైనదైనా.
కానీ పనిలో స్వేచ్ఛగా భాగస్వాములవుతాం
మేము చెయ్యగలిగినదేదైనా, మనసుపెట్టి చేస్తాం.
జీవిక సంపాదించుకుందికి అంత ఇష్టపడి పనిచేస్తాం
పాలుతాగే పసిబిడ్డలనికూడా మాతో పొలానికి తీసుకుపోతాం
వెచ్చగా ఉంచడానికి మా దుస్తుల్నే కప్పుతాం
చేనుకోసేటపుడు వాళ్ళకి కష్టం కలగకుండా చూసుకుంటాం.
తరచు మా దృష్టి వాళ్ళమీదకే మళ్లుతుంటుంది
క్షేమంగా ఉంచడానికీ, ఏ హానీ జరగకుండా చూడ్డానికీ
ఆ పాటి పనిచెయ్యగలిగిన పిల్లలు చేలో పరకలేరడంలో
మాకు సాయం చెస్తారు. అదే చేతనైన మా పొదుపైన పెంపకం.
చీకటి పడడం తోనే, ఇంతిముఖం పదతాం
మా గింజలు మేమే మోస్తాం, వాటితోపాటు బిడ్డల్ని కూడా.
అలసటంటారా? సరే. కానీ దానిగురించి ఒకసారైన ఫిర్యాదు చెయ్యడం
అడుగడుక్కీ విశ్రాంతి తీసుకోవడం మా అలవాటు కాదు;
మేము తొందరగా ఇంటికి పోవాలి; ఎందుకంటే
ఇంటికి వెళ్ళాకే అసలు పని మొదలవుతుంది.
చాలా పనులు మా కోసం ఎదురుచూస్తుంటాయి
మాకే పదిచేతులుంటే అన్ని వాడగలిగే వాళ్ళం.
పిల్లల్ని ఎంతో శ్రద్ధగా నిద్రపుచ్చడం,
మీ రాకకోసం అన్ని పనులూ సిద్ధంగా ఉంచడం.
మీరు ఇలా భోంచేస్తారు, అలా పక్కమీద వాలిపోతారు.
మళ్ళీ పొద్దుపొడిచేదాకా విశ్రాంతి తిసుకుంటారు.
మరి మా సంగతి ఏం చెప్పడం? కంటినిండా కునుకుండదు.
కొందరు పిల్లలు నిద్రలో ఏడ్చి పలవరిస్తుంటారు;
అయినా సరే, తెలతెలవరుతుండగానే, బద్ధకించకుండా
పొలం పనికి హాజరై మా పని చేసుకుంటాం
అక్కడ మా శక్తివంచనలేకుండా పనిచేసి
ఎండవేడికి మంచుతెరలు కరిగే సరికి
ఇంటికి పరిగెడతాం పిల్లలకి బట్టలు తొడిగి
తిండిపెట్టి, పొలానికి మళ్ళీ తీసుకువస్తాం.
ఇదే మీ సంగతి అయితే, మీరు తప్పకుండా ఫిర్యాదు చెయ్యండి
రాత్రయినా పగలయినా మా ఆడవాళ్ళు కష్టాలకి ఆమడ దూరమని.
మీ మనసుదొలిచి చిక్కుపెట్టే దొడ్డ సమస్యలు
(కోతలప్పుడు గుచ్చుకునే ముళ్ళు[1] ముందు, ఆడవాళ్ళు తర్వాత)
ఇటువంటి కష్టాలు మిమ్మల్ని చుట్టుముడితే
వెంటనే ఎగిరిపోతాయి; చప్పున మాయమైపోతాయి.
మీరు మానుండి ఏమిటికోరుకుంటారో మాకు తెలియదు.
మీరు నూర్చిన ధాన్యాన్ని మేము తలకెత్తుకుంటాం
బఠాణీలు తెంపుతాం, మీరు ఏ పనిచేసినా
మా వంతు పనిచెయ్యడానికి సిద్ధంగా ఉంటాం
కోతల సమయం మొదలైన దగ్గరనుండి
కుప్పనూర్చి ధాన్యం ఇంటికి తీసుకుపోయే వరకూ
మా శ్రమా కష్టమూ ఎంత విపరీతంగా ఉంటాయంటే
మాకు కలగనడనికికూడా తీరికచిక్కదు.
కోతలయిపోయిన తర్వాతకూడా, మాకేమీ విశ్రాంతి దొరకదు
అంతకంటే కష్టం మా వెనకే తరుముకొస్తుంటుంది;
ఎంత కష్టమైనపనినైనా మేము సంతోషంగా చేస్తాం.
ఇక బయటికివెళ్ళి మేం చెయ్యవలసిన పనులంటారా
వాటి గురించి నేను చాలా టూకీగా సెలవిస్తాను
వాటిని పూర్తిగా చెప్పగల నేర్పు నా శక్తికి మించింది.
ప్రతిరోజూ మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాం
నేను ధైర్యంగా చెప్పగలను, మీ కటువంటివి ఉంటాయని తెలియదు.
శీతకాలం రాత్రులలో, ఆకాశంలో మృగశిర నక్షత్రం
మెరుస్తున్నప్పుడు, తెల్లవారుతూనే లేవాలి. చలిగాలి కొడుతున్నా
వర్షం, మంచు కురుస్తూ వాతావరణం ఎంత బాగులేకపోయినా,
మా పని ఆగదు, మేము లేచి వెళ్ళాల్సిందే.
మీరు మాత్రం హాయిగా సుఖంగా పక్కమీద నిద్రపోతుంటారు
గది కిటికీల్లోంచి వెలుతురు వెచ్చగా ముఖం మీద పడేదాకా.
మేము వెళ్ళవలసిన ఇళ్ళకి పనికి తీరా వెళితే
లోపలికి వెళ్ళే దెలా? వాళ్ళు తలుపుతీస్తేగాని దారి లేదు.
ఇంట్లో పనిచేసే పనికత్తె ముందురోజు చాకిరీకి అలిసిపోతుందేమో
పాపం, మంచినిద్రలో ఉంటుంది. తలుపుదగ్గర నిలబడి
చలిలో గజగజ వణుకుతూ మేము ఎంత పిలిచినా ప్రయోజనం ఉండదు.
మాకు పనిచేసుకుందికి లోపలికి వెళ్ళడం గగనమైపోతుంది.
కడకి ఎలాగో చలీ, వాతావరణం తప్పించుకుని లోనకెళ్తాం.
మా పని ధైర్యంగా, చురుకుగా మొదలుపెడతాం.
మా కళ్ళముందు గుట్టలుపడి బట్టలుంటాయి
వాటిని ఎంతో నేర్పుగా, జాగ్రత్తతో ఉతికిపెట్టాలి.
అందులో హాలండు చొక్కాలు[2], కుచ్చె పట్టినవీ, సరిగంచువీ[3]
మా పూర్వీకులు ఎన్నడూ ఎరగని నాగరికపు దుస్తులుంటాయి.
బయట వెలుతురెలా ఉంటుందో తెలుసుకునే లోపు అక్కడ
కొన్ని గంటలపాటు కష్టపడి ఊడిగం చెయ్యాలి.
చివరకి సూర్యుడు బాగా వెలుగులు చిమ్మడం ప్రారంభించి
మనుషులందరినీ లేవండని మేలుకొలుపులు పాడినతర్వాత
మా యజమానురాలు ఖచ్చితంగా మా దగ్గరకి వస్తుంది
ఆమె చేతిలో, బహుశా, పెద్ద ముంతలో సారాయి (Ale) పట్టుకుని.
దానితో మా గుండెలు సేదదీరుతాయి. ఆమెకు అప్పటివరకు
ఆ పొద్దు ఏమి పని చేశామో నివేదిస్తాం.
ఆమె మాకు ఆజ్ఞలు జారీ చేస్తుంది: ఆమె బట్టల్ని
జాగ్రత్తగా ఎక్కడా మురికిలేకుండా ఉతకాలని.
అంతే కాదు. ఆమె తొడుక్కునే “కేంరేకు (Cambrics)”లనీ,
కుచ్చెలబట్టలనీ చిరిగిపోకుండా జాగ్రత్తగా ఉతకమని
ఇవన్నీ మేము అక్షరాలా పాటించి తీరాలి,
ఆమె సబ్బుఖర్చు తగ్గించడమే కాదు, పనిలోంచి తీసేకుండా.
అప్పటికీ ఆమె ఉక్కువ కూలి ఇస్తోందనీ, అంతేకాదు,
మునపటికంటే బట్టలు తక్కువేనని చెబుతుంటుంది.
మునపటికంటె మరింత జాగ్రత్తగా ఉండాలని మనసులో అనుకుని
మాకు చాతనైనంతవరకు మనసుపెట్టి పనిచేస్తాం.
అటువేడికీ, ఇటు చాకిరీకి, చాలా సమయాల్లో
చెమటే కాదు, మా మణికట్టులనుండీ, వేళ్ళనుండీ
రక్తం చుక్కలుచుక్కలుగా కారుతుంటుంది. అయినా అక్కడ
చేతులకి, ఎంతచేసినా తరగనంత పని ఉంటుంది.
చీకటి పడితేచాలు, మీకు శ్రమనుండి ఉపశమనం దొరుకుతుంది.
అయ్యో! మాకు అలాగకాదే. మా కష్టాలు రెట్టింపవుతాయి.
సూర్యుడు అస్తమిస్తూ ఉంటే దిగులుగా చూస్తుంటాం
మా పని పూర్తవకముందే ఎక్కడ గుంకెస్తాడో అని.
మేము ఎంత శ్రద్ధగా మా రోజువారీ పని పూర్తిచేసినా
అది పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా
వేసవిలో ఏ రోజైనా కొవ్వొత్తివెలుగులో ముగించవలసిందే.
మా ఖర్మ అలా ఉంది! అదెప్పుడు అంతమవుతుందో తెలీదు.
సాయంత్రం అవడంతోటే, మీరు ఇంటిదారి పడతారు.
మాకు అలా కాదు, పనిపూర్తయేదాకా, ఉండి తీరాలి.
అంత శ్రమపడి గొడ్డుచాకిరీ చేసిన తర్వాతకూడా
చివరకి మాకు ఇచ్చేది 6 పెన్నీలో, 8 పెన్నీలో.[4]
మేం పడే శ్రమకి భవిష్యత్తులో హామీ ఉండదు
పేదరికం, ముసలితనం మమ్మల్ని అంటి ఉంటాయి.
మేము బట్టలుతకడం ఒక్కటే కాదు చేసేది
మీలాగే, ఏపనిపడితే ఆ పనికి తయారవుతాం.
మా యజమానురాలు సత్తుగిన్నెలు బాగులేవంటుంది
వాటిని తళతళమెరిపించే బాధ్యత మాదే
ఆ పని చాలా కష్టమే కాదు, చాలా అలుపొస్తుంది.
నిస్సహాయులైన ఆడవారుచేసే కనికిష్టపు పనుల్లో ఇదొకటి.
చీకటి పడే వేళకి మేము బాగా అలసిపోయి ఉంటాము.
ఇక మాపాల ఏమిపడుతుందో ఊహించేస్థితిలో ఉండము.
గిన్నెలు, చెరవాలు[5], బాణల్లు[6],ఛట్టీలు[7] చిన్నా పెద్దా గరిటెలు,
కవ్వాలు,మొదలైన నాజూకు వస్తువులన్నీ
మా ముందుకొస్తాయి మా దాస్యాన్ని పూర్తిచెయ్యడానికి.
ఎప్పుడో తెల్లారకుండా ప్రారంభమైన మా చాకిరీ
హుఁ ! మా కష్టాలు ఎప్పుడు గట్టేక్కుతాయో తెలీదు.
అందాకా మా శక్తినంతా ఇనుమూ, ఇత్తడి మీదే వెచ్చించాలి.
మా లేతచేతులు గీరుకుపోయి, పగిలిపోతుంటాయి
కానీ, దీన్నంతటినీ మేము సహనంతో ఓర్చుకోవాలి.
అప్పుడు ఒంటినిండా మురికీ, మట్టీ పేరుకుని కనిపిస్తాం మేము
మాడిపోయిన బఠాణీలుకూడా మాకంటే మెరుగ్గా కనిపిస్తాయి.
స్త్రీలు గర్వంగా చెప్పుకునే ఒకప్పటి అందాలన్నీ
మరుగుపడిపోతాయి, పూర్తిగా నశిస్తాయి.
మరోసారి, మా యజమానురాలు కబురుపెడుతుంది
తనకేదో పనుందనో, బీరు నిండుకుంటోందనో:
అప్పుడు వెంటనే పరిగెడతాం, త్వరత్వరగా పాత్రల్ని
శుభ్రపరచడానికీ, సారా తయారు చెయ్యడానికీ
ఎంతో జాగ్రత్తగా దాన్ని మరిగించడానికీ.
తరచు అర్థరాత్రి, సగం నిద్రలోంచి లేచి పరిగెత్తాలి
ఒక్కోసారి ఆ పాటి నిద్రకూడా కరువైపోతుంది.
సాధారణంగా మా పని సాయంత్రంవేళ ప్రారంభిస్తాం.
ఇలా మొదలెడతామో లేదో అప్పుడే చీకటి ముసురుకుంటుంది.
మేము నీళ్ళుతోడాలి, రాగి గంగాళాలు తప్పనిసరిగా నింపాలి,
లేదా నిప్పురాజెయ్యాలి; నూర్పులపుడు మీరు నిలబడినట్టు
మేము ఖాళీగా క్షణం నిలబడడానికి వీల్లేదు; ఓ కన్నేసి ఉంచాలి.
పొరపాటున రెప్పవాలిందో, మరుగుతున్న సారా పొర్లిపోతుంది.
ఇప్పుడు మా కష్టాలన్నీ ఏకరువు పెట్టి ప్రయోజనం లేదు
వాటిగురించి ఎంతన్యాయంగా మేము ఫిర్యాదు చేసినా.
మాకు ఏమాత్రం విశ్రాంతి దొరకదని మీకీపాటికి అర్థమై ఉండాలి,
ఏళ్ళు గడుస్తున్నకొద్దీ మా శ్రమ పెరుగుతూనే ఉంటుంది.
మిమ్మల్ని మీరు సిసిఫస్ తో పోల్చుకోవచ్చు[8]
మేముమాత్రం డానీడ్స్ కుమార్తెలతో[9] పోల్చుకుంటాం
సిసిఫస్ కొండమీద కష్టపడితే పడ్డాడుగాని
వాళ్ళు అడుగులేని గంగాళాలని నింపుతూనే ఉండాలి.
కాబట్టి శ్రమజీవులైన తేనెటీగలు ప్రతిక్షణం
తేనెను గూటికి తేడానికి కష్టపడుతూనే ఉంటాయి.
స్వార్థపరులైన యజమానులు లాభం తీసుకుంటారుగాని
వాటి శ్రమకి తగిన ప్రతిఫలం మాత్రం ముట్టజెప్పరు.
.
Mary Collier
(1688 – 1762)
English Poetess
***
References:
- Eighteenth Century Poetry: An Annotated Anthology Ed. David Fairer, Christine Gerrard
- https://www.usask.ca/english/barbauld/related_texts/collier.html
[1] He that has good harvest must content with thistles … Spanish Proverb
[2] Linen
[3] Ornamented Frills
[4] Stephen Duck Received a weekly wage of “Four Shillings and sixpence’ which is ninepence a day.
[5] (Kettles)
[6] (Saucepans)
[7] (Skillets)
[8] (గ్రీకు పురాణగాథప్రకారం, సిసిఫస్ నరకంలో తనుచేసిన పాపాలకి ఒక కొండశిఖరంమీదకి బండరాయిని దొర్లించేలా శిక్షించబడతాడు. కొండశిఖరంచేరుకునే వేళకి ఆ బండరాయి క్రిందకి దొర్లిపోతుంది)
[9] (గ్రీకు పురాణగాథప్రకారం, ఆర్గోస్ రాజు డానీడ్స్ (Danaids)కి 50 మంది కుమార్తెలు. తమభర్తలని పెళ్ళినాటిరాత్రి చంపమని తండ్రి శాసిస్తాడు. 49 మంది ఆచరిస్తారు. వాళ్ళు నరకంలో చిల్లులున్న గంగాళాలు నింపవలసిందిగా శిక్షించబడతారు.)
Read the original here
స్పందించండి