వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం అతనికి నచ్చదు. ఈ భౌతిక సుఖాలవేటలో పడిన మనిషి దృశ్యమాన జగత్తులోని అందాలకి పరవశించి తన హృదయాన్ని ఉన్నతంగా చేసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతున్నాడని అతని ఆరోపణ.
ఈ కవితలో “మనిషి తన తెలివితేటలని, జీవితాన్ని డబ్బుసంపాదనకి పణం పెట్టి, తను భాగమైన ఈ అనంతప్రకృతిని నాశనం చేస్తూ, కనీసం దాన్ని చూసి ఆనందించే అవకాశం కోల్పోతున్నాడు,” అని చెబుతున్నాడు. జ్ఞానవంతుడై ప్రకృతిని నాశనం చేసే నేటి ఈ స్థితికంటే, ఏ అనాగరిక జాతిలోపుట్టి,అజ్ఞానంలో మగ్గినా, ఈ ప్రకృతిని చూసి పరవశించే అవకాశం కోల్పోకపోవడమే ఉత్తమమని అతని భావన. మనం చేజేతులా వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాం అని అతని వేదన.
ప్రగతి పేరుతో, భావితరాలపట్ల మన బాధ్యత కించిత్తుకూడా పట్టించుకోకుండా, ఉన్న ప్రకృతి వనరులన్నీ ఇప్పుడే దోచుకుందికి తాపత్రయపడుతున్న (ప్రపంచవ్యాప్తంగా) ప్రభుత్వాలూ, పారిశ్రామికవేత్తలూ ఉన్న ఈ రోజులు మనం గమనించినపుడు 200 సంవత్సరాల క్రిందట అతను రాసిన ఈ హృదయవేదన ఎంత సమంజసమైనదో మనం గ్రహించవచ్చు.
.
ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం, నాడూ నేడూ,
సంపాదనకీ, ఖర్చుపెట్టడానికే మన శక్తుల్ని వృధాచేసుకుంటున్నాం;
ప్రకృతిలో మనదంటూ ఏదీ గుర్తించలేకున్నాం;
మనహృదయాల్ని పణంపెట్టుకుని, క్షుద్రవరాల్ని ఇచ్చుకుంటున్నాం!
వెన్నెలకి తన హృదయాన్ని అర్పించుకుంటున్న ఈ సముద్రమూ
ఎల్లవేళలా తెరలుతెరలుగా వీచే ఈ చల్లగాలీ,
మనం ఇప్పుడు రాలిన పువ్వుల్లా ఏరుకుంటున్నాం.
దీనికి, ఆమాటకొస్తే ప్రతివిషయంలోనూ మనం గాడితప్పాం,
భగవంతుడా! మనల్ని ఏదీ కదిలించదు. నేను
అంతరించిన ఏ అనాగరికజాతిలో పుట్టినా విచారించను;
అప్పుడు నేను ఈ ఆహ్లాదకరమైన పచ్చికబీడులో నిలబడి
కనిపించే దృశ్యాలు నేను ఏకాకినన్న అనుభూతి కలిగించవు;
సముద్రంలోంచి ‘ప్రాటియస్ ‘అనేకరూపాల్లో ఉద్భవించడమూ చూస్తాను;
పురాణపురుషుడు ట్రైటన్ ఊదే శంఖనాదాన్నీ వినగలను.
.
విలియమ్ వర్డ్స్ వర్త్,
(7 April 1770 – 23 April 1850)
ఇంగ్లీషు కవి
స్పందించండి