లౌకిక అవసరాలకై వెంపర్లాట తప్ప మరొకటి తెలియని మనకి, దానికి అతీతమైన జీవితం ఉంటుందనీ, కొందరు దానికోసం తమ సర్వస్వం ధారపోస్తారనీ, ఈ లౌకిక విషయాలకి వాళ్ళు గుడ్డిగవ్వ విలువ ఇవ్వరనీ చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది.
***
కాన్సాస్ రాష్ట్రంలో అదొక చిన్న నగరం. అది శీతకాలం రాత్రి. ఆ ఊరిలోని కొందరు పౌరులు రైల్వే స్టేషనులో రైలింగుకి చేరబడి బండి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే అది రావడం 20 నిముషాలు ఆలస్యం అయింది. ప్రకృతిలోని అన్ని వస్తువులమీదా దట్టంగా మంచు పేరుకుంది. నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాల మసక వెలుగు నేపధ్యంలో ఊరికి దక్షిణంగా, విశాలమైన తెల్లని మైదానమంతటా పరుచుకున్న ఎత్తైన కొండశిఖరాలు, ఏదో తెల్లనిపొగ వ్యాపిస్తున్నట్టు వంపులుతిరిగి ఉన్నాయి. నిరీక్షిస్తున్న పౌరులు కాసేపు కుడికాలు మీదా, మరికాసేపు ఎడమకాలిమీదా తమ బరువు మార్చుకుంటూ, చలికి తమ భుజాలు దగ్గరగా ముడుచుకుని, జేబుల్లో చేతులు పెట్టుకుని, చెవులదాకా కోటు కాలర్లు లాక్కుని ఉన్నారు. ఆగ్నేయ దిక్కున నదిగట్టుతోపాటే వంపులు తిరిగిన రైలుమార్గం వైపు మాటిమాటికీ చూస్తున్నారు. వాళ్లలో వాళ్లు నెమ్మదిగా మాటాడుకుంటూ, ఏంచెయ్యాలో తెలియక అసహనంగా అటూ ఇటూ కదులుతున్నారు. వాళ్లందరిలో ఒక వ్యక్తిమాత్రం అతనక్కడికి ఎందుకొచ్చాడో తెలిసినట్టు, అందరికంటే ప్రత్యేకంగా దూరంగా ప్లాట్ ఫారానికి ఆ చివరనుండి ఈ చివరివరకూ, తిరిగి స్టేషను ముఖద్వారం వరకు నడిచి, మళ్ళీ రైలు పట్టాల వైపు నడుస్తున్నాడు. బలిష్ఠమైన అతని భుజాలు ముందుకు వంచి, బరువుగా కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాడు. వెలిసిన సైనిక దుస్తుల్లో సన్నగా, పొడవుగా ఉన్న తలనెరసిన వ్యక్తి ఒకరు జనాల్ని తప్పించుకుని అతని దగ్గరకి వచ్చి గౌరవపురస్సరంగా నిలుచున్నాడు.
“జాన్! ఈ రోజుకూడా ఈ రైలు ఆలస్యంగా వస్తున్నట్టుందే,” అన్నాడు మగవాళ్లకి అసహజమైన కీచుగొంతుకతో. “కారణం మంచుకురవడం కాదుగదా?”
“ఏమో, నాకు తెలీదు,” చిక్కగా పెరిగిన ఎర్రని గడ్దంలోంచి చెప్పాడతను. అతని గొంతుకలో కొద్దిపాటి విసుగు ధ్వనిస్తోంది.
ఆ సన్నని వ్యక్తి అంతవరకు తను నములుతున్న పళ్ళుకుట్టుకునే పుల్లని నోట్లో ఒకవైపు నుండి రెండోవైపుకి మార్చుకున్నాడు. తనలో తను అనుకుంటున్నట్టుగా, “ఆ శవంతో పాటు తూర్పునుండి ఎవరూ వస్తారని అనుకోను,” అన్నాడు.
“నాకు తెలియదు,” అన్నాడు ఆ రెండో వ్యక్తి మునపటికంటే మరింత కరకుగా.
అంతకీచు గొంతులోనూ కొంచెం మార్దవం తొణికిసలాడుతుంటే, ఆ సన్నపాటి వ్యక్తి “అతను ఏ మోతుబరుల కుటుంబానికీ చెందకపోవడం చాలా విచారకరం. నే నయితే అతనికి ఒక గౌరవప్రదమైన అంత్యక్రియలు ఏర్పాటు చేసి ఉండేవాడిని. కొంత పేరూ ప్రఖ్యాతీ ఉన్న వాళ్ళకి అలా చెయ్యడం సముచితం,” అన్నాడు. నోట్లోని పళ్ళుకుట్టుకునే పుల్లని బనీను జేబులో పెట్టుకున్నాడు. ఆ ఊర్లో జరిగే అన్ని పెద్దకుటుంబాల అంత్యక్రియల్లోనూ లాంఛనప్రాయమైన కుటుంబజండా పట్టుకోవడం అతని పని.
లావుపాటి వ్యక్తి సమాధానం చెప్పకుండా, వెనుతిరిగి రైలు మార్గాలు కలిసేచోటుకి వెళ్లిపోయాడు. సన్నపాటి వ్యక్తి తన గుంపులో కలిసి “ఎప్పటిలాగే జిమ్ చిరాగ్గా ఉన్నాడు,” అన్నాడు అతనివంక జాలిగా చూస్తూ.
సరిగ్గా అదే సమయంలో దూరంనుండి రైలుకూత వినిపించింది. ప్లాట్ ఫారం మీద అడుగుల కోలాహలం మొదలయింది. ఉరుము శబ్దానికి ఉలిక్కిపడ్దవాళ్లలా సన్నగా పొడవుగా ఉన్న అన్నివయసుల కుర్రవాళ్ళూ ఒక్కసారి ప్లాట్ ఫారం మీద గుమిగూడారు. అందులో కొందరు ఇంతసేపూ విశ్రాంతి గదుల్లో వెచ్చగా చలికాచుకుంటే, కొందరు సగం నిద్రలో పరిగెత్తుకుని వచ్చిన వారు; కొందరు సామాన్ల లారీల్లోంచి బద్ధకం వదిలించుకుని వస్తే, కొందరు ఎక్స్ ప్రెస్ రైళ్లలో వచ్చిన వారు. అక్కడి రైలింగుకి ఆన్చి నిలబెట్టిన శవవాహనంలోంచి డ్రైవరు సీటునుండి ఇద్దరు క్రిందకి దూకేరు. భుజాల్ని సరి చేసుకుని తలెత్తి నిలబడ్డారు. అంత చలిలో, అందరినీ హెచ్చరిస్తూ రైలు వేస్తున్న కూతకి లిప్తపాటు పాలిపోయిన వాళ్ళ కళ్ళల్లో ప్రాణం లేచివచ్చింది.
ఆ రాత్రి ఎక్స్ ప్రెస్, ఎర్రని రాకెట్టులా తూరుపుదిక్కునున్న చిత్తడినేలల మధ్యనుండి, నదివొంపులతోపాటు వొంపులు తిరుగుతూ వస్తోంది. చిత్తడినేలలకి పహరా కాస్తున్నట్టున్న వరుసల పోప్లార్ చెట్లు, చలికి వణుకుతున్నట్టున్నాయి. వాటి క్రిందనుండి దూకివస్తూ రైలు వదులుతున్న నీటిఆవిరి ఆకాశానికి ఎగబ్రాకి నీలి మేఘంగా ఘనీభవించి పాలపుంతని కనుమరుగుచేస్తోంది. అంతలోనే, కళ్ళుమిరుమిట్లుగొలిపే రైలుబండి ఎర్రని హెడ్ లైటు వెలుగు వేడికి రైలుపట్టాలని కప్పిన మంచు కరిగి, నల్లని రైలుపట్టాలు మెరుస్తున్నాయి. చెదిరిన తన పొడవాటి దట్టమైన గడ్డంతో ప్లాట్ లావుపాటి వ్యక్తి పారం వైపు గబగబా రైలు ఆగే వైపుకి నడుచుకు వస్తున్నాడు తలకిచుట్టుకున్న కప్పు తొలగించుకుంటూ. అతని వెనుకనున్న గుంపు కాసేపు తటపటాయించి, ఒకరి ముఖాలు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకుని, అతని వెనుకే నడవసాగేరు. రైలు ఆగింది. తలుపులు తెరుచుకోవడం ఆలస్యం అందరూ రైలువైపు పరిగెత్తారు. అంత్యక్రియల దుస్తుల్లో ఉన్న సన్నటి వ్యక్తి కుతూహలంగా బండిలోకి తొంగిచూడసాగేడు. ఆ కోచ్ నిర్వాహకుడు తలుపు దగ్గరకి పొడవైన గౌనూ, టోపీ ధరించిన మరొక యువకుణ్ణి అతనితోపాటే వెంటపెట్టుకుని వచ్చేడు.
ఆ యువకుడు, “మెరిక్ స్నేహితులు మీరేనా?” అంటూ అక్కడ చేరుకున్న గుంపుని ఉద్దేశించి అడిగేడు.
ప్లాట్ ఫారం మీద ఉన్న గుంపు పక్కకి అసౌకర్యంగా అటూ ఇటూ కదిలింది. ఇంతలో ఫిలిప్ ఫెల్ప్స్ అన్న బ్యాంకు ఉద్యోగి ముందుకి వచ్చి, హుందాగా ఇలా అన్నాడు:
“మెరిక్ తండ్రి చాలా నీరసంగా కదలలేని పరిస్థితిలో ఉండబట్టి శవాన్ని తీసుకుపోడానికి మేము వచ్చాము,” అని.
“అయితే అతన్ని లోనికి రానీండి,” అని కసురుకుంటూ కోచ్ నిర్వాహకుడు, “అతనికి సాయం చెయ్యమని ఆపరేటర్ కి చెప్పండి,” అన్నాడు.
మంచు కురుస్తున్న ఆ ప్లాట్ ఫారం మీదకి మొత్తానికి ఎలాగైతేనేం శవపేటిక దింపడం జరిగింది. ఆ ఊరి ప్రజలు దానికి తగినంత జాగా ఉండేలా వెనక్కి జరిగేరు. తర్వాత ఆ శవపేటిక చుట్టూ అర్థచంద్రాకారంలో గుమిగూడారు. ఆ శవపేటిక నల్లని పైకప్పుమీదనున్న తాటాకువంక వింతగా చూడసాగేరు. ఎవ్వరూ ఏమీ మాటాడలేదు. పెట్టెలు మోసేవాడొకడు ఒక రైలుపెట్టె పక్కన బేరంకోసం ఎదురుచూస్తూ నిలుచున్నాడు. ఇంజను ఒక్కసారి గట్టిగా నిట్టూర్పు విడిచింది. ఇంజనులో బొగ్గువేసేవ్యక్తి తన పసుపుపచ్చని టార్చిలైటూ, పొడవాటి ఆయిలు కేన్ తో క్రిందకి దిగి ఇరుసుల్లో కందెన వేస్తున్నాడు. మరణించిన శిల్పి శిష్యుడూ, శవంతోపాటే ప్రయాణించిన బోస్టనుకి చెందిన యువకుడు అతనివంక నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాడు. అక్కడి గుంపులో భుజాలు వేలేసుకుని, మాసినదుస్తుల్లో, అసహనంగా కదులుతున్న ఆ బ్యాంకరు ఒక్కడే మాటాడడానికి యోగ్యుడుగా కనిపించాడు. అతనివైపు తిరిగి:
“మెరిక్ అన్నదమ్ముల్లో ఒక్కరూ ఇక్కడలేరా?” అని అడిగేడు.
మొదటిసారిగా ఆ ఎర్రగడ్డం వ్యక్తి త్వరగా నడుచుకుంటూ గుంపుముందుకి వచ్చి “లేదు, వాళ్ళెవరూ రాలేదు. అందరూ తలో దిక్కూ ఉన్నారు. మేమే ఈ శవాన్ని అతని ఇంటికి తిన్నగా తీసుకుపోతాం,” అని అన్నాడు. అని ఒంగి శవపేటికకి ఉన్న చేతిపిడి ఒకటి అందుకున్నాడు.
అంత్యక్రియల నిర్వాహకుడు శవవాహిక తలుపు వేస్తుంటే, చోదకుడిని ఉద్దేశిస్తూ గ్రామ నౌకరు “థామ్సన్!దూరమైనా కొండరోడ్డు వెంబడే ఇంటికి పద. గుర్రాలకి సుళువుగా ఉంటుంది,” అన్నాడు.
ఎర్రగడ్దపు లాయరు, జిమ్ లైర్డ్, ఆ కొత్త వ్యక్తివంక చూస్తూ, “ఈ శవవాహిక వెనుక ఎవరు నడుస్తారో తెలియదు. చాలా దూరం ప్రయాణం, కాబట్టి మీరు అద్దెకు తెచ్చిన ఆ గుర్రం ఎక్కితే మంచిది,” అంటూ బాగా చిక్కిపోయిన గుర్రాన్ని చూపించాడు. ఆ యువకుడు వెంటనే, “కృతజ్ఞతలు. కానీ నేను శవ పేటికతోనే ప్రయాణిస్తాను.” అంటూ, అంత్యక్రియల నిర్వాహకుడివైపు తిరిగి, “మీకు అభ్యంతరం లేకపొతే, నేను మీ పక్కన కూర్చుంటాను,” అన్నాడు.
అంటూ, బండిచక్రాలమీంచి ఎక్కి కూచున్నాడు.
చుక్కల వెలుగులో, దూరమార్గంలో, తెల్లని కొండచుట్టూ ప్రదక్షిణం చేస్తూ వాళ్ళు ఊరికి ప్రయాణమయ్యారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊళ్ళో, ఇళ్ళ కప్పులమీద మంచు పేరుకుంది. బాగా క్రిందకివాలిన చూరులనుండి దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి; కనుచూపుమేర అన్నిదిక్కులా విశాలమైన మైదానం శూన్యంలోకి చొచ్చుకుపోయి, అనుభూతికి అందే స్వచ్ఛమైన నీరవంలో మునిగి ఆకాశమంత నునుపుగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.
కళావిహీనంగా, ఎండకి ఎండి వానకి తడిసి కేవలం ఆకారమాత్రంగా నిలిచి ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న కాలిబాటప్రక్కకి శవ వాహనం చేరుకోగానే, ఇంతకుముందు రైలుస్టేషనులో గుమిగూడిన ఇలా ఉంటారని చెప్పలేని సమూహమే, మరొకసారి గేటుదగ్గర గుమిగూడింది. మంచూ-బురద పేరుకున్న ముందరివాకిట్లో, గేటునుండి ఇంటి ముఖద్వారం వరకూ వెళ్ళడానికి వీలుగా వేసిన ఒకటి రెండు బల్లలు బాగా వొంగిపోయి, కూలడానికి సిద్ధంగా ఉన్న వంతెనలా ఉన్నాయి. ఉన్న రెండు బందుల్లో ఒకటి ఊడి, గేటు ఆ ఉన్న ఒక్క బందుకీ అతికష్టం మీద వేలాడుతోంది. శవంతోపాటే వచ్చిన యువకుడు స్టీవెన్స్, ముఖద్వారానికి ఉన్న గుబ్బకి ఒక నల్లటి గుడ్డ కప్పి ఉండడం గమనించాడు.
వాహనంనుండి దింపుతున్నప్పుడు శవపేటికచేసిన కిర్రుమన్న శబ్దానికి ఇంట్లోంచి ఒక్కసారిగా ఏడుపులు వినిపించాయి; ముందరి తలుపు కష్టపడి తెరుస్తూ, లావుగా, పొడవుగా ఉన్న ఒక స్త్రీ తలకి ఏ తొడుగూలేకుండా మంచులో పరిగెత్తుకుంటూ వచ్చి శవంమీదపడి రోదించసాగింది, “అయ్యో కొడుకా! ఇలా వచ్చావురా నా దగ్గరికి!” అంటూ.
చెప్పలేని వెగటుతో స్టీవెన్స్ ముఖం అటుతిప్పుకుని కళ్ళుమూసుకోగానే, పొడవుగా బక్క చిక్కిన మరొక స్త్రీ నల్లని దుస్తుల్లో బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి, తల్లి భుజాలుపట్టుకుని, ఏడుస్తూనే, “అమ్మా! లోపలికి పద! నువ్విలా బయటకి రాకూడదు!” అంటూ, వెంటనే బ్యాంకరు వైపు తిరిగి, గొంతుమార్చి, అతివినయంగా, “ఫెల్ప్స్! చావడి సిద్ధంగా ఉంది!” అంది.
అంత్యక్రియల నిర్వాహకుడు శవపేటిక ఉంచడానికి కావలసిన సామగ్రితో ముందు నడుస్తుంటే, శవవాహకులు ఆ సన్నని బల్లచెక్కలమీదనుండి శవపేటికని మోసుకుని లోనికి తెచ్చేరు.
శవాన్ని దించిన గది వాడుకలోలేక, చల్లగా, చెమ్మగా, అక్కడ పడేసిన కర్రసామాను ముక్కవాసన వాసన వేస్తూ ఉంది. శవపేటికకి పైన గలగలలాడుతున్న గాజుపట్టకాలతో అలంకరించిన దీపం ఉంది. అక్కడ జాన్ రోజర్స్ కర్రతో చెక్కిన జాన్ ఆల్డెన్, ప్రిసిలాల బొమ్మలకి కొండతామర (స్మిలాక్స్) దండలు వేలాడుతున్నాయి. హెన్రీ స్టీవెన్స్ తనేదో పెద్దపొరపాటు చేసినట్టూ, రాకూడనిచోటుకి వచ్చేనేమోనన్నట్టు ముఖంపెట్టాడు. అక్కడున్న ఆకుపచ్చని బ్రసెల్స్ నీ, కిటికీలు, ద్వారబంధాలూ అలంకరించుకునే లావుగా మెత్తగా ఉన్న మొఖమల్ అలంకరణలనీ, చేతితో రంగులువేసిన చైనా పాత్రలూ, పూల కలశలూ, బల్లచెక్కలనీ పరీక్షగా చూశాడు హార్వే మెరిక్ కి చెందిన వస్తువేదైనా పోల్చుకుందికి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. పియానోమీద వేలాడుతున్న వర్ణచిత్రంలో ఉంగరాలజుత్తుతో, మొలకి అంగవస్త్రం ఉన్న కుర్రవాడిలో తనమిత్రుడి పోలికలు కనిపించేదాకా ఎవరినీ శవం దరిదాపులకికూడా అనుమతించడానికి ఇష్టపడలేదు.
“థామ్సన్! మూత తెరూ! కుర్రాడి ముఖం చూడనీ,” అంది పెద్దామె ఒకప్రక్క వెక్కివెక్కి ఏడుస్తూనే. ఒత్తుగా నల్లగా మెరుస్తున్న ఆమె తలకట్టు క్రింద ఎర్రగా ఉబ్బిపోయిన ఆమె ముఖంలోకి ఈ సారి స్టీవెన్స్ భయపడుతూ భయపడుతూ చూస్తూ, ఏడుపు నిగ్రహించుకోమని అనునయిస్తున్న ధోరణిలో చూశాడు. అలా చూసినందుకు వెంటనే సిగ్గుపడిపోయి, మరొకసారి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో ఏదో చెప్పలేని శక్తి కనిపించింది… అది ఆటవిక సౌందర్యం వల్ల కావొచ్చు; కానీ, ఆ ముఖం హింసవల్ల ఏర్పడిన గాయాలమచ్చలతో, ముడతలుబడి, భయంకరమైన వీరావేశాలవల్ల కళమారి ఎంత కరకుగా తయారైందంటే, విషాదం ఆమె దరిదాపుల్లోకి రావడానికి జంకుతుందేమోనని అనిపించింది అతనికి. వాచిన ఆమె పొడవాటి ముక్కు చివర ఉబ్బి, దానికి అటూ ఇటూ లోతుగా చారలుఏర్పడ్డాయి; దట్టమైన నల్లని కనుబొమలు నుదిటికి అడ్దంగానూ, ఒకదానికీ మరొకదానికీ మధ్య బోలెడు ఖాళీతోనలుపలకలుగా ఉన్న ఆమె పెద్ద పలువరస చీరేసినట్టు ఉంది. ఆమె ఆ గదినంతా ఆక్రమించి ఉంది. ఆమె ముందు ఏమాత్రం ఆనక, ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిమీద కొట్టుకొచ్చే కర్రాకంపా లా మగవాళ్ళు ఉన్నారు. స్టీవెన్స్ కి, తను కూడా ఆ సుడిగుండంలో చిక్కుకున్నానేమోనన్న అనుమానం వచ్చింది.
నొక్కులజుత్తుతో, సన్నగా ఎముకలబోనులా ఉన్న కూతురు తలలో విషాదసూచనగా దువ్వెన ఉంది. అప్పటికే పొడుగ్గా ఉన్న ఆమె ముఖం ఇప్పుడు మరింత పొడవుగా కనిపిస్తోంది. ఆమె చేతివేళ్ళ కణుపులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. చేతుల్ని ఒళ్ళో మడిచిపెట్టుకుని, కళ్ళూ ముఖమూ క్రిందకి వాల్చి శవపేటిక ఎప్పుడు తెరుస్తారా అని ఆమె ఎదురుచూస్తోంది. చూడడానికి సేవకురాలిలా కనిపిసున్న ఒక సంకరజాతి స్త్రీ, తలుపు ప్రక్కన భయంతో ఒదిగి నిలబడింది. వాడిపోయిన ఆమె ముఖంలో విషాదం, మృతుడిపట్ల అభిమానం కనిపిస్తున్నాయి. ఆమె తను ధరించిన పైతొడుగుతో కళ్ళు ఒత్తుకుంటూ, అప్పుడప్పుడు గట్టిగా వచ్చే వెక్కిళ్ళను అతిప్రయత్నం మీద దిగమింగుకుంటూ మౌనంగా రోదిస్తోంది. స్టీవెన్స్ లేచి ఆమె ప్రక్కన నిలుచున్నాడు.
మెట్లమీద సన్నని అడుగుల చప్పుడు వినిపించింది. పొడుగ్గా, బలహీనంగా ఉన్న ఒక వయసుడిగిన వ్యక్తి మూతిమీద చారికలతో, పొగాకు కంపుకొడుతూ, మాసిన గడ్డం, చిదరవందర జుత్తుతో అడుగులు తడబడుతూ గదిలోకి ప్రవేశించాడు. చేతిలో రుమాలు నలుపుకుంటూ, శవపేటిక దగ్గరకి నెమ్మదిగా నడిచేడు. భార్య రోదనకి ఒక పక్క బాధపడుతూనే, మరొక ప్రక్క మరేదీ పట్టించుకోనందుకు సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తున్నాడు.
“ఏనీ! అదే వద్దంటున్నాను, కాస్త తెమ్మరిల్లు,” అన్నాడు, గొంతు కంపిస్తుంటే, వణుకుతున్న చేతిని ఆమెభుజం మీద నిలకడగా ఉంచడానికి అవస్థపడుతూ. ఆమె మరొకసారి ఏడుపులంకించుకుని ఒక్క ఉదుటున అతని భుజం మీదకి ఎలా వాలిందంటే, అతను తనని నిభాయించుకుందికి కష్టపడ్డాడు. అతను కనీసం శవం వంక కన్నెత్తయినా చూడలేదు. కొరడావంక చూస్తున్న కుక్కలా, ఆమె వంకే బెదురుతో, బ్రతిమాలుతూ చూడసాగేడు. సాగిపోయిన అతని బుగ్గలు భరించలేని సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆతని భార్య ఆ గదిలోంచి నిష్క్రమించగానే, లాయరు స్టీవెన్స్ నీ, తండ్రినీ వాళ్ల ఖర్మకి వాళ్లని వదిలేసి కూతురుకూడా ఆమె వెనుకే నడిచింది. సేవకురాలు శవపేటికదాకా నడిచి, క్షణం సేపు వొంగి చూసి వెంటనే వంటింట్లోకి నిష్క్రమించింది.
ఆ ముసలాయన చనిపోయిన కొడుకు ముఖంలోకి తలవాల్చి, కళవళముతో చూస్తున్నాడు. ఆ శిల్పి పెద్ద తల, బ్రతికున్నప్పటికంటే, కదలకుండా నిటారుగా ఉన్నప్పుడే ఇంకా గొప్పగా ఉన్నట్టు అనిపించింది అతనికి. విశాలమైన అతని నుదురుమీదకి నల్లని ముంగురులు వాలి ఉన్నాయి. చిత్రంగా అతని ముఖం కోలగా ఉన్నట్టు అనిపించింది. కానీ అందులో మృతుల ముఖాల్లో కనిపించే నిష్కల్మషమైన ప్రశాంతత లోపించింది. కనుబొమలు ఎంతగా చిట్లించినట్టు ఉన్నాయంటే, సూటిగా ఉన్న ముక్కుపైన, నుదిటిమీద అవి రెండు గీతలు గీశాయి. గడ్డం నిర్లక్ష్యంగా ముందుకి చొచ్చుకొచ్చింది. జీవితం ఎంత చేదుగా, పదునుగా ఉంటుందంటే మృత్యువుకూడా వెంటనే ఒత్తిడిని రూపుమాపి పరిపూర్ణమైన ప్రశాంతత చేకూర్చలేదేమోనని సూచిస్తున్నట్టు ఉంది. పవిత్రమైనదీ, విలువైనదేదో అతను భద్రంగా కాపుకాస్తున్నట్టూ, దాన్ని అతని దగ్గరనుండి లాక్కుంటారేమోనని బెంగపడుతున్నట్టూ ఉంది అతని ముఖం.
మాసిన గడ్డం మాటున ఆ వృద్ధుడి పెదాలు వణుకుతున్నాయి. అతను లాయరువంక తిరిగి భయం భయంగా అడిగేడు “జిమ్! నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. ఫెల్ప్స్, తక్కిన వాళ్ళు అందరూ హార్వేని ఖననం చెయ్యడానికి వస్తారు, కదూ?” అని. కొడుకు నుదిటిమీది ముంగురులు చేత్తో సవరిస్తూ, “జిమ్! వీడు చాలా మంచికుర్రాడు. అందరిలోనూ వీడే పసిపిల్లాడంత నెమ్మదస్తుడు. కానీ, మేమే వాడిని అర్థం చేసుకోలేకపోయాం.” అతని కన్నీళ్ళు గడ్డంమీంచి జారి శిల్పి తొడుక్కున కోటుమీద పడ్డాయి.
“మార్టిన్! మార్టిన్! ఓ మార్టిన్, ఇలా రా!” అతని భార్య మెట్లమీంచే గట్టిగా అరిచింది. ఆ వృద్ధుడు వెంటనే భయంగా లేస్తూ, “హాఁ! ఏనీ! ఇదిగో వస్తున్నా!” అతను వెనుదిరిగి, కాసేపు తటపటాయించి, ఎటూ తేల్చుకోలేని భయంకరమైన సందిగ్ధంలో కొట్టుమిట్టాడేడు; చివరకి, వెనక్కి వచ్చి మృతుడి జుత్తు మెత్తగా సవరించి, గదిలోంచి నిష్క్రమించాడు.
“పాపం, ముసలాయన! అతనికి కన్నీళ్ళు ఇంకా మిగిలి ఉంటాయని అనుకోను. ఆకళ్ళు ఏనాడో ఎండిపోయినట్టున్నాయి. ఈ వయసులో ఇంతకంటే బాధించేది మరోటి ఉండదు,” అన్నాడు లాయరు జాలిగా.
జిమ్ అతని గడ్దమంత ఎర్రగా ఉన్నాడు. నీలిమంటతో మండుతున్న చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. తాగుడువల్ల అతని ముఖం ఉబ్బిపోయి ఉంది. అతికష్టం మీద తనని తాను నిగ్రహించుకుంటున్న బాధ అతని ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది; చెప్పలేని అసహనంతో మృతుడి గడ్డాన్ని సవరిస్తూనే ఉన్నాడు. కళ్ళలోకి ఇబ్బందిగా పడుతున్న దీపం వత్తిని జిమ్ తగ్గించడం, దానికి వేలాడుతున్న గాజు పట్టకాలు చేస్తున్న గలగలలకి చిరాకుతో అటు తీక్షణంగా చూడడం, కిటికీ ప్రక్క కూచున్న స్టీవెన్స్ గమనించాడు. తర్వాత అతను చేతులు వెనక్కి కట్టుకుని, అతని గురువు ముఖంలోకి తదేకంగా చూడడమూ గమనించాడు. స్టీవెన్స్ వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగేడు.
ఇంతలో వంటింట్లోంచి కేకలు వినిపించసాగేయి; భోజనాలగది తలుపు తెరవగానే, ఆ గోల వెనక కారణం అవగతమయింది. అతిథులకోసం చేసిన సాలడ్ మీద డ్రసింగ్ సరిగ్గా చేయనందుకు యజమానురాలు సేవకురాలిమీద గొంతు చించుకుంటోంది. స్టీవెన్స్ తన జీవితంలో ఇలాంటిది ఎన్నడూ విని ఉండలేదు. ఆ తిట్లు మానసికంగా హింసించడంతోబాటు, చాలా నాటకీయంగా, క్రౌర్యానికి పరాకాష్ఠగా ఉన్నాయి. కేవలం ఇరవై నిముషాల క్రితం ఆమె ప్రదర్శించిన ఆపుకోలేని దుఃఖానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ క్రూరత్వంచూసి ఒళ్ళు గగుర్పొడిచి, లాయరు వంటింట్లోకి తెరుచుకుంటున్న భోజనాలగది తలుపులు మూసేసేడు.
వెనక్కి తిరిగి వచ్చి, “పాపం, రాక్సీ! బలయిపోతోంది,” అన్నాడు. మెరిక్ కుటుంబం చాలా ఏళ్ళక్రితం ఆమెను “బీదగృహం”నుండి తెచ్చుకున్నారు. వారిపట్ల ఆమెకున్న కృతజ్ఞతాభావం తన అనుభవాలని బయటకు చెప్పనివ్వదు గాని, చెబితే మాత్రం, ఆ భయంకరమైన అనుభవాలు విని రక్తం గడ్డకట్టుకుపోతుంది. కొద్దిసేపటి క్రితం వరకు పైకొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ మౌనంగా నిలుచున్న ఫెరంగీ యువతి మరెవరో కాదు, రాక్సీనే! ఆ పెద్దావిడ కోపంతో రెచ్చిపోతోంది; పదిమందిలో జాలి ప్రదర్శిస్తూ, ఎవరూ లేనపుడు క్రూరత్వంలో కొత్తపోకడలు పోవడంలో ఆమెకు ఆమే సాటి; హార్వే ఇంట్లో ఉన్నంత కాలం అతని జీవితాన్ని నరకం చేసింది. అతను దానిని గుర్తుతెచ్చుకోవలసివచ్చినప్పుడల్లా సిగ్గుపడిపోయేవాడు. ఇంత క్రూరత్వం చవిచూచినప్పటికీ, అతను అంత చక్కని వ్యక్తిత్వాన్ని ఇంకా ఎలా నిలబెట్టుకున్నాడో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
“ఓహ్! ఇతనెంత అద్భుతమైన వ్యక్తి,” అన్నాడు స్టీవెన్స్ తనలో తను మాటాడుకుంటున్నట్టు నెమ్మదిగా, “పరమాద్భుతమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు; కానీ, ఈ రాత్రి వరకు అతనెంత అద్భుతమైన వ్యక్తో గ్రహించలేకపోయాను.”
“అదే ఎవరికీ అర్థకాని బ్రహ్మరహస్యం. అందులోనూ, ఇటువంటి పేడతట్టలోంచి రావడమే అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం,” అన్నాడు లాయరు చేతులు నాలుగుపక్కలాతిప్పి ఇల్లంతటినీ చూపిస్తూ. ఆ మాటల వెనుక తాము నిలుచున్న నాలుగుగోడల మధ్యప్రదేడ్శం కాక వేరేదో ధ్వని ఉంది.
“కాస్త గాలాడుతుందేమో చూడాలి. నాకు ఊపిరాడక కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది,” అని గొణిగాడు స్టీవెన్స్, ఒక చేత్తో కిటికీ తలుపు తియ్యడానికి నానా తంటాలు పడుతూ. కిటికీ చట్రం బిగుసుకుపోయింది. తలుపు తెరుచుకోవడం లేదు. విసుగెత్తి వెనక్కి తిరిగివచ్చి కూచుని తన కాలరు పైకెత్తి విసురుకుంటున్నాడు కొంచెం గాలి తగులుతుందేమోనన్న ఆశతో. లాయరు వచ్చి ఎర్రని బలిష్టమైన అతని చేతితో ఒక పిడిగుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి తలుపు రెండు అంగుళాలు పైకిలేచి తెరుచుకుంది. స్టీవెన్స్ లాయరుకు కృతజ్ఞతలు చెప్పాడు. కాని అరగంట క్రిందటినుండి అతని గొంతులో కొట్టుమిట్టాడుతున్న వాంతి వస్తుందేమోనన్న భావన, హార్వే మెరిక్ కి చెందిన జ్ఞాపిక ఏది దొరికితే అది పట్టుకుని అక్కడనుండి పారిపోవాలన్న కోరిక రగిలిస్తోంది.
హాఁ! అతనికి ఇప్పుడర్థమైంది, తన గురువు పెదాలపై తరచు కనిపించే చిన్నపాటి విసుగుకి కారణం ఏమిటో!
అతనికి బాగా గుర్తు. ఒకసారి మెరిక్ వాళ్ల ఊరునుండి తిరిగి వచ్చినపుడు, తనతోపాటు సన్నగా, పోలికలు పట్టలేని ఒక వృద్ధురాలు కూచుని తన ముణుకుమీద ఏదో పెట్టుకునికుడుతున్న చిత్రాన్ని (Bas-relief) తీసుకుని వచ్చాడు. అందులో తాళ్ళనిక్కరు తొడుక్కున్న కుర్రాడొకడు, జీవం ఉట్టిపడుతూ, చక్కని పెదాలతో, ఒక తాడు భుజానికి వేలాడుతుంటే ఆమె ప్రక్కని నిలుచుని, తను పట్టుకున్న తుమ్మెదవైపు ఆమెదృష్టిని ఆకర్షించడానికి ఆమె గౌను అసహనంగా లాగుతూ ఉంటాడు. ఆ చిత్రంలో బక్కపలచగా ఉన్న స్త్రీని చిత్రించిన శ్రద్ధకీ, ఆమె ముఖంలో చూపించిన అలసటకీ స్టీవెన్స్ ముగ్ధుడై ‘ఆమె మీ అమ్మగారా?’ అని మెరిక్ ని అడగడం, అతని ముఖంలో ఒక్కసారి మెరిసి మాయమైన నిరుత్సాహం గుర్తొచ్చాయి.
లాయరు శవపేటిక ప్రక్కన తూగుకుర్చీలో శరీరాన్ని వెనక్కి వాల్చి, కళ్ళుమూసుకుని ఊగుతున్నాడు. స్టీవెన్స్ అతన్నీ, తీరుగా ఉన్న అతని చుబుకాన్నీ పరీక్షగా చూసి, అంత అందమైన చుబుకం మీద అందవికారంగా కనిపించే గడ్డాన్ని ఎందుకు పెంచాడో అర్థంకాక ఆశ్చర్యపోయాడు. ఆ యువ శిల్పి చూపులు తనకి గుచ్చుకున్నాయేమో నన్నట్టు లాయరు కళ్ళు తెరిచాడు.
“అతనెప్పుడూ మితభాషిగానే ఉండేవాడా?” అని అడిగేడు అకస్మాత్తుగా, “ఎందుకంటే, కుర్రాడిగా ఉన్నప్పుడు అతను బాగా సిగ్గరి.”
“ఆ మాట ఎలాగూ అడిగారు కాబట్టిచెప్పక తప్పదు; మీరన్నట్టు అతను మితభాషే,” అని మాటకలిపాడు స్టీవెన్స్, “అతనికి పదిమందితో ఉండడం సరదాయే గానీ, అతనెప్పుడూ ఒంటరివాడేనన్న భావన కలిగించేవాడు. అతనికి ఎవరైనా ఆవేశంగా మాటాడితే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఒక్క అతని కళమీద తప్ప, తనమీద తనకే నమ్మకం లేనట్టుండేవాడు. అతని కళలో మాత్రం ఏ సందేహాలూ ఉండేవి కావు అతనికి. పురుషుల్ని అసలు నమ్మేవాడు కాదు; స్త్రీలంటే మరీను. కానీ వాళ్ళ గురించి చెప్పే చెడుమాటలు ఎప్పుడూ నమ్మేవాడు కాదు. అతను ఎప్పుడూ ఉత్తమోత్తమమైన వాటినే నమ్మాలనుకునే వాడు, కానీ, వాటిని పరిశోధించడానికి మాత్రం జంకేవాడు.”
“ఒళ్ళుకాలిన కుక్క నిప్పంటే భయపడుతుంది,” అన్నాడు లాయరు కళ్ళుమూసుకుని నిష్ఠూరంగా.
దయనీయమైన శిల్పి బాల్యం గురించి స్టీవెన్స్ ఏదో ఊహించుకుంటూ పోతున్నాడు. అంత సుకుమారమైన భావనలూ, నాణ్యమైన ప్రవర్తనగలిగిన వ్యక్తి వెనుక, ఇంత ఆటవిక, బాధామయమైన బాల్యమూ ఉండడం ఊహకు అందని విషయం. అతని మనోఫలకంమీద సౌందర్యవంతమైన చిత్రాలు నిరంతరం పెల్లుబుకుతూనే ఉంటాయి; అవి ఎంత సున్నితంగా స్పష్టంగా ఉంటాయంటే, లేత ఎండపడుతున్న గోడమీద కదలాడుతున్న రావి ఆకు నీడకూడా అక్కడ శాశ్వతంగా ముద్రించబడుతుంది. ఎవరిచేతిలోనైనా మంత్రదండం ఉండడం నిజమైతే, ఆ వ్యక్తి ఖచ్చితంగా మెరిక్ మాత్రమే. అతను దేనిమీద చెయ్యివేస్తే, దాని నిగూఢరహస్యాలన్నీ బహిర్గతం చెయ్యగలిగేవాడు. గుప్తసౌందర్యపు బందిఖానానుండి తప్పించి, అరేబియన్ కథలోని యువరాజు మంత్రగత్తె మాయలకు ప్రతిమాయ కల్పించి గెలిచినట్టు, వాటికి తిరుగులేని సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించేవాడు; అతనికి ఏ వస్తువుతో, వ్యక్తితో పరిచయమైనా, వాటిపై అతని సుందరమైన అనుభూతిని మిగిల్చేవాడు. తనదైన అగోచరమైన సంతకాన్ని, సువాసనని, మాటని, రంగుని విడిచిపెట్టేవాడు.
స్టీవెన్స్ కి తన గురువు జీవితంలోని సిసలైన విషాదం అవగతమైంది. అందరూ అపోహపడుతున్నట్టు దానికి త్రాగుడూ, భగ్నప్రేమా కారణం కావు. వాటికంటే లోతుగా చిన్నప్పుడు అతని మనసుమీద పడ్డ అనుభూతులు చేసిన గాయాలు కారణం. వాటికి కారణం తను కాకపోయినా, సిగ్గుపడవలసినపని లేకపోయినా, అతను తప్పించుకోలేక, బాల్యంనుండీ గుండెలో దాచున్నాడు. ఉత్సాహంతో ఉరకలేసే కుర్రాడిని, సంప్రదాయంగా వస్తున్న ఉదాత్తమైన శిక్షణ, తనని తాను రక్షించుకోలేని నిరాయుధిడిని చేసి, ఎన్నడూ కని విని ఎరగని నికృష్టమైన సౌందర్య రహితమైన ఎడారిలో విడిచిపెట్టింది!
పదకొండుగంటలకి పొడవుగా లావుగా నల్లని దుస్తుల్లో ఉన్నామె గదిలోకి ప్రవేశించి పరామర్శించడానికి ఊరివాళ్లు వస్తున్నందున భోజనాలగదిలోకి రమ్మని పిలిచింది. స్టీవెన్స్ లేవడానికి ప్రయత్నిస్తుంటే, లాయరు నిర్వికారంగా ఇలా అన్నాడు, “మీరు వెళ్ళండి. నిస్సందేహంగా మీకొక మరపురాని అనుభూతి మిగులుతుంది. నామట్టుకు నాకు, వాళ్లని తట్టుకోలేను. ఇరవై ఏళ్లబట్టి భరిస్తూనేన్నాను వాళ్ళని.”
స్టీవెన్స్ తనవెనుకనే తలుపు మూస్తూ, గడ్డం చేతుల్లోపెట్టుకుని, సన్నని దీపం వెలుగులో శవం ప్రక్క కూర్చున్న లాయరువంక ఒకసారి చూశాడు.
ఇంతకుముందు రైలుపెట్టె దగ్గర గుమిగూడిన మూకే మళ్ళీ ఇక్కడకూడా గుమిగూడింది. కిరసనాయిలుబుడ్డి దీపం వెలుగులో వాళ్ళు ఇప్పుడు వేరువేరు వ్యక్తులుగా కనిపిస్తున్నారు. పిల్లిగడ్డం, పండిపోయిన జుత్తుతో పాలిపోయి నీరసంగాఉన్న మతాధికారి, శవం ప్రక్కన ఉన్న మేజాబల్లకి ఆనుకుని, దానిమీద బైబిలు ఉంచాడు. ఆర్మీలో ఉన్నతపదవిలో పనిచేసి వచ్చిన వ్యక్తి, రూం హీటర్ దగ్గరకి తన కుర్చీ జరుపుకుని అనువుగా గోడకి చేరవేసేడు,జేబులోపెట్టుకున్న పన్నుకుట్టుకునే పుల్లకోసం వెతుకుతూ. ఫెల్ప్స్, ఎల్డర్ అన్న బ్యాంకు ఉద్యోగస్థులిద్దరూ భోజనాలబల్ల వెనకనున్న ఒక మూల కూచుని వడ్డీలమీద ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంగురించీ, గృహోపకరణాలకి ఇచ్చే అప్పులమీద దాని ప్రభావం గురించి అప్పటివరకువరకు తాము చేస్తున్న చర్చ ముగించేరు. నయవంచకుడి ముఖంకలిగిన స్థిరాస్థి వ్యాపారం ప్రతినిధి ఒకడు నవ్వుతూ వాళ్ళతో జతకలిసేడు. రాక్షసిబొగ్గుతో మండుతున్న పొయ్యిముందు రక్షణకోసం ఉంచిన ఇనపచక్కీకి దగ్గరగా తమకాళ్ళు జాపుకుని, ఒకప్రక్క బొగ్గూ, కలప, అమ్మే వ్యక్తీ, రెండోప్రక్క పశువులు రవాణాచేసే వ్యక్తీ కూచున్నారు. స్టీవెన్స్ తన జేబులోంచి ఒక పుస్తకం తీసి చదువుకో సాగేడు. ఇంట్లో రోదనలు తగ్గుముఖం పడుతుంటే, అతని చుట్టూ జరుగుతున్న సంభాషణ వాళ్ళకి కుతూహలం ఉన్న అన్ని విషయాల గురించీ నడుస్తోంది. ఇంట్లోవాళ్లందరూ నిద్రపోయారని రూఢిచేసుకున్న తర్వాత, ఆర్మీలో పనిచేసి వచ్చిన వ్యక్తి తన భుజాలు విదుల్చుకుని, ఎదురుగాఉన్న కుర్చీమీద మడమలు ఆన్చి కాళ్ళు రెండూ బారజాపుకున్నాడు.
“ఫెల్ప్స్, విల్లు ఉందేమోననుకుంటున్నాను,” అన్నాడు కీచుగొంతుకతో.
బ్యాంకరు నవ్వుతూ లేదన్నట్లు తలూపి, ముత్యం పొదిగిన పిడికత్తితో గోళ్ళు కత్తిరించుకుంటున్నాడు.
“విల్లు ఉండవలసిన పనేముంది ఇక్కడ?” అని, తనే మళ్ళీ, “ఉందంటావా?” అని ఎదురుప్రశ్న వేసేడు.
ఆర్మీ వ్యక్తి అసౌకర్యంగా తన కుర్చీలో అటూ ఇటూ కదిలేడు. ఇప్పుడు తన కాళ్ళను తనగడ్డానికి మరింత దగ్గరగా లాక్కుంటూ. “లేకపోడానికేం? ఆ ముసలాయన హార్వే ఈ మధ్య బాగానే సంపాదించాడని అన్నాడు?” అని అన్నాడు.
అప్పుడు రెండో బ్యాంకరు అందుకున్నాడు,”దానర్థం నా ఉద్దేశ్యంలో, హార్వే మరే పొలాలూ తనఖా పెట్టమని అడగలేదనీ; అంటే, తన చదువు సంగతి తను చూసుకోగలుగుతున్నాడనీ.”
“నా జ్ఞాపకశక్తి హార్వే చదువుకోనప్పటిరోజులదాకా పోతుందని అనుకోను,” అన్నాడు ఆర్మీ వ్యక్తి.
అందరూ నవ్వుకున్నారు. మతగురువు జేబులోంచి రుమాలు తీసి గట్టిగా ముక్కు చీదేడు. ఫెల్ప్స్ తన చురకత్తి “టక్” మని చప్పుడుచేస్తూ మడతపెట్టేడు. తనలో గొణుక్కున్నట్టుగా, “పాపం! ఆ ముసలాయనకి పిల్లలెవ్వరూ చేతికి అందిరాకపోవడం చాలా విచారకరం,” అన్నాడు. “వాళ్ళెప్పుడూ అందిరాలేదు. హార్వే మీద అతను ఒక డజను పశువుల ఫారంలు నడపడానికి పనికొచ్చేంత డబ్బు తగలేశాడు. అంతకంటే, శాండ్ క్రీక్ లో ఖర్చుపెట్టి ఉంటే ఫలితం దక్కేది. హార్వే ఇంటిపట్టున ఉండి ఉన్నదేదో జాగ్రత్తగా చూసుకుని, పశువుల్నీ, వ్యవసాయం, కౌలు లెక్కల్నీ చూసుకున్నా వాళ్ళపని బాగుండేది. ముసలాయన పాపం అన్నిటికీ కౌలుకిచ్చిన రైతులనే నమ్ముకోవలసి రావడంతో, వాళ్ళు అతన్ని ఎడాపెడా మోసం చేసేరు.”
“హార్వే పనికొచ్చేపని ఏదీ చెయ్యలేడు. అతనికి పని అంటే శ్రద్ధలేదు,” అన్నాడు అడితి నడిపే వ్యక్తి. నే చెబుతున్నది అతను క్రిందటిసారి ఇంటికి వచ్చినప్పటి సంగతి. అతను తిరిగి వెళ్ళే రోజు, పాపం ముసలాయన హార్వేని రైలుకు పంపడానికని డబ్బులు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాల్ మూట్స్ వీధిదడికి ఉన్న కన్నాలు కప్పున్నాడు. అప్పుడు హార్వే మెట్లమీదకి వచ్చి, “కాల్ మూట్స్, కాల్ మూట్స్, త్వరగా రా! నా పెట్టె తాడుతో బిగించికట్టు,” అంటూ పురమాయిస్తున్నాడు.
“హార్వే సంగతే అంత,” తల ఊఁ కొట్టాడు ఆర్మీ వ్యక్తి, “అతను ఎలా అరుస్తాడో ఊహించగలను. అతను పెద్దవాడై పేంట్లు తొడుక్కుంటున్న రోజుల్లో, అతను పశువులమంద సాయంత్రం ఇంటికి తోలుకొస్తూ, అవి వరిపొలంలోకి పోయినా పట్టించుకోనందుకు వాళ్ళమ్మ కమ్చీతో కొట్టడం నాకు బాగా గుర్తు. ఓ సారి అలాగే నా ఆవునొకదాన్ని చంపేసేడు. అది మా లావు జెర్సీ ఆవు. నా దగ్గర ఉన్న పశువులన్నిటిలోకీ ఎక్కువ పాలు ఇచ్చేది అదే. పాపం ఆ నష్టం ముసలాయన భరించవలసి వచ్చింది. కారణం ఓ పక్క ఆవు ఎటో పోతుంటే, హార్వే సూర్యాస్తమయాన్ని చూసి మైమరచిపోయాడట. ఎదురు తిరిగి, సూర్యాస్తమయం ఎన్నడూ లేనంతగా బాగుందని వాదిస్తాడు.”
“అసలా ముసలాయన హార్వేని చదువుకి తూర్పుకి పంపించి పెద్ద తప్పుచేశాడు” అని జడ్జీగారిలా తీర్మానించేడు ఫెల్ప్స్, మేక గెడ్డంలాంటి తన గడ్డం సవరించుకుంటూ. “అక్కడే అతనికిపారిస్ కి వెళ్ళడం, ఈ పనికిమాలినవన్నీ నేర్చుకోవడం అలవాటయింది. నిజానికి హార్వేకి కావలసింది కాన్సాస్ లాంటి ఏ మంచి ఊర్లోనో ఉన్న బిజినెస్ కాలేజీనుండి వ్యాపారదక్షతలో శిక్షణ.”
స్టీవెన్స్ కి వాళ్ల మాటలు కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ మనుషులికి అతని శవపేటికమీద ఉన్న తాటాకుకి అర్థం తెలియదనుకోవాలా? హార్వే మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపొతే వాళ్ళ ఊరు పేరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులో సమాధి అయిపోయి ఉండేది. రెండు ఊపిరితిత్తులలోనూ రక్తం పేరుకుని కోలుకోవడం అసాధ్యమని తెలిసిన తర్వాత, చనిపోయినరోజు తన శవాన్ని పుట్టిన ఊరు తీసుకుపొమ్మని చెబుతూ తన గురువు అన్నమాటలు అతనికి గుర్తొచ్చేయి. “ప్రపంచమంతా కష్టపడిపనిచేసి, ప్రగతి సాధిస్తున్నప్పుడు, ఆ ఊళ్ళో పరుండడం అంత గొప్పవిషయం కాదు,” అని నిర్వికారంగా నవ్వుతూ, “కానీ, చివరికి మనమంతా వచ్చినచోటుకే పోవలసి వస్తుందేమో! ఊర్లో వాళ్లందరూ నన్ను చూడడానికి వస్తారు; వాళ్ళందరూ నా గురించి చెప్పుకోవడం పూర్తయ్యేక, భగవంతుడు ఇచ్చే తీర్పు నన్నిక భయపెట్టదు,” అని, తన చిత్రాలన్నిటివంకా నీరసంగా చెయ్యితిప్పి చూపిస్తూ, “ఇక్కడి అద్భుతమైన చిత్రాలేవీ నన్ను కాపాడవు,” అన్నాడు.
పశువుల వ్యాపారి అందుకున్నాడు, “నలభై ఏళ్ళకే మెరిక్ చనిపోయాడంటే చాలా చిన్నవయసులో పోయినట్లే. మామూలుగా అయితే వాళ్లు చాలా కాలమే బ్రతకాలి. కానీ, తాగుడే దానికి కారణం అయి ఉంటుంది.”
“వాళ్ళ అమ్మవైపు వాళ్ళు ఎక్కువకాలం బ్రతకలేదు. హార్వే ఆరోగ్యంకూడా ఎప్పుడూ అంతంత మాత్రమే,” అన్నాడు మతగురువు మెల్లగా. అతనికి హార్వే గురించి ఇంకా చెప్పాలని ఉంది. ఒకప్పుడు ఆ కుర్రాడికి ఆదివారాలు పాఠం చెప్పేవాడు. తనకి అతనంటే చాలా ఇష్టం కూడా. కానీ అతను అవి చెప్పగలిగే పరిస్థితిలో లేనని గ్రహించాడు. అతనికొడుకులిద్దరూ బాగుపడలేదు. అందులో ఒకడు క్రితంసారి రైల్లో ఇంటికివచ్చి ఏడాది తిరగకముందే, బ్లాక్ హిల్స్ లో జూదగృహంలో హత్యచెయ్యబడ్డాడు.
“అయినా సరే, సారాయి మంచి రంగుల్లో ఉన్నప్పుడు హార్వే దాని రుచికి అలవాటుపడ్డాడని చెప్పక తప్పదు,” అంటూ నీతులు వల్లించేడు పశువుల వ్యాపారి.
సరిగ్గా అదే సమయంలో చావడిలోకి తెరుచుకున్న తలుపు గట్టిగా చప్పుడవడంతో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. జిమ్ లైర్డ్ ఒక్కడే రావడంతో అందరికీ మనసు కుదుటపడింది. అసలే ఎర్రగా ఉన్న అతని ముఖం కోపంతో మరింత ఎర్రబడింది. అతని నీలికళ్లలో కోపపు ఎర్రటిచార చూడగానే ఆర్మీ వ్యక్తి తన తల కాళ్లమధ్య దాచుకున్నాడు. వాళ్ళందరికీ జిమ్ అంటే హడలు. అతను తాగుబోతే కాని, పడమటి కాన్సాస్ లో ఏ లాయరుకీ చాతకానంతగా చట్టాన్ని తన కక్షిదారుకి అనుకూలంగా మార్చి వాదించగలడు; చాలామంది ప్రయత్నించేరు కూడా. లాయరు తనవెనుకే తలుపు నెమ్మదిగా మూసి, దానికి వీపు చేరవేసి, చేతులు నమస్కరిస్తూ, ఒకప్రక్కకి తల వాల్చేడు. అదే కోర్టుగదిలో ఇలా చేసేడంటే, అందరూ చెవులు రిక్కించి వినేవారు. సాధారణంగా అలాంటప్పుడు సునిశితమైన వ్యంగ్యంతో ప్రత్యర్ధుల మాడువాయగొట్టేవాడు.
చాలా పొడిపొడిగా ఇలా ప్రారంభించేడు, “ఓయ్ పెద్దమనుషులూ! ఈ ఊర్లో పుట్టి పెరిగిన చాలామంది కుర్రాళ్ల శవపేటికల దగ్గర మీరు కూర్చున్నప్పుడు మీ ప్రక్కన నేను కూడా ఉన్నాను. నాకు సరిగా గుర్తున్నంతవరకు, మీరెన్నడూ వాళ్లగురించి ఒక్క మంచిమాట మాటాడిన పాపాన పోలేదు. ఇంతకీ, ఏమిటి కారణం? ఈ శాండ్ సిటీలో మిలియనీర్లు కనిపించనట్టు, గౌరవప్రదంగా మాటాడదామంటే ఒక్క యువకుడూ కనిపించడేం? కొత్తవాడికెవడికైనా దానికి లోపం ఈ ఊరిలోనే ఏదో ఉందనిపిస్తుంది. ఈ ఊర్లో ఇప్పటివరకు అంత తెలివైన లాయరు లేడని పెరుపడ్డ రూబెన్ సేయర్ సైతం, విసిరేసిన పాచికలా యూనివర్శిటీనుండి తిన్నగా ఈ ఊళ్ళో పడగానే మద్యానికి బానిసై, చెక్కుమీద దొంగసంతకంచేసి, ఆత్మహత్యచేసుకున్నాడు? బిల్ మెరిట్ కొడుకెందుకు ఒమాహాలో రైలుపెట్టెలో మూర్ఛతో చనిపోయాడు? థామస్ కొడుకెందుకు జూదగృహంలో చంపబడ్డాడు? ఇన్సురెన్సు కంపెనీలని మోసం చెయ్యడానికి ఏడమ్స్ కొడుకు ఎందుకు మిల్లు తగలబెట్టి జైలుపాలయ్యేడు?
లాయరు ఒక్కక్షణం ఆగి చేతులు వదులుచేసి, ఒక పిడికిలి నెమ్మదిగా మేజాబల్లమీద ఉంచుతూ ఇలా అందుకున్నాడు, “ఎందుకో నేను చెబుతాను వినండి. ఎందుకంటే, వాళ్ళకి చెడ్డీలు తొడుక్కోవడం వచ్చిన వయసునుండీ, మీరు డబ్బూ, వంచన, మోసం గురించి వాళ్ల చెవుల్లో హోరెత్తేలా నూరిపోసేరు. మన తాతలు అబ్రహామ్ లింకన్ నీ, జాన్ ఏడమ్స్ నీ ఎలా ఆదర్శంగా తీసుకుని మాటాడేవారో, ఈ రోజు మాటాడుతున్నట్టుగా,మీరు ఫెల్ప్స్ నీ, ఎల్డర్ నీ వాళ్లకి ఆదర్శపురుషులుగా మాటాడేరు. పాపం కుర్రాళ్ళు! మరీ చిన్నవాళ్ళు! అదృష్టం కలిసిరాలేదు! మీరు పెట్టిన వ్యాపారంలో వాళ్లకి నైపుణ్యం లేదు; వాళ్ళు ఫెల్ప్స్, ఎల్డర్ లాంటి కళాకారులకి పోటీగా డబ్బు ఎలా ముట్టజెప్పగలరు? మీరు వాళ్ళని గజదొంగలుగా తయారు చెయ్యాలనుకున్నారు; వాళ్లు కాలేకపోయారు. అంతే తేడా! సంస్కారానికీ, దుర్మార్గానికీ మధ్యపెరుగుతూ, వ్యసనాలబారిన పడకుండా ఉన్న కుర్రాడు ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నాడంటే అతను మెరిక్ ఒక్కడే. తక్కిన కుర్రాళ్ళు సఫలురుకాలేనందుకు ద్వేషించినదానికంటే ఎక్కువగా, మెరిక్ సఫలుడైనందుకు ద్వేషిస్తున్నారు. దేవుడా! దేవుడా! ఎంత ఘోరంగా ద్వేషిస్తున్నారతన్ని! ఫెల్ప్స్ కి ఎంత పొగరంటే తలుచుకుంటే మనల్నందర్నీ కొనెయ్యగలడట! కానీ హార్వే అతని బాంకన్నా, పశువుల ఫారాలన్నా గుడ్డిగవ్వ విలువివ్వడని తెలుసు. ఆ రకంగా అతనికి మెరిక్ అంటే ద్వేషం ఉండడం సహజం.
“ఇక్కడున్న వృద్ధుడు నిమ్రాడ్ తాగుడువల్ల మెరిక్ చనిపోయాడని అనుకుంటున్నాడు; ఆ మాట నిమ్రాడ్ లాంటి వ్యక్తీ, నేనూ అనడం హాస్యాస్పదంగా ఉంటుంది.
“సోదరుడు ఎల్డర్ ముసలాయన పంపిన డబ్బులు మెరిక్ విచ్చలవిడిగా ఖర్చుపెట్టేడని అంటున్నాడు. తండ్రికి తిరిగి ఇవ్వడంలో ఒక మేరకు మెరిక్ విఫలమయి ఉండొచ్చు. కానీ, మనందరికీ తెలుసు ఎల్డర్ ఎలా వాళ్ళ నాన్న ఒక అబద్ధాలకోరని కోర్టులో ప్రమాణం చేసేడో; వాళ్ళ భాగస్వామ్య వ్యాపారంలో తండ్రి ఉన్ని గొరిగిన గొర్రెలా, కట్టుబట్టలతో ఎలా బయటకు వచ్చేడో. నేను మరీ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నానేమో గాని, విషయం మీకు సూటిగా చెప్పదలుచుకున్నాను.”
లాయరు ఒక క్షణం ఆగేడు. భుజాలు సవరించుకుని మళ్ళీ మొదలుపెట్టేడు, “హార్వే మెరిక్ నేనూ ఇద్దరం ఒక బడిలో కలిసే చదువుకున్నాం. మమ్మల్ని చూసి అందరూ గర్వపడాలని చాలా గంభీరంగా ఆలోచించిన వాళ్ళం. మే మిద్దరం గొప్పవాళ్ళం కావాలని కలలుగన్నాం. నేను కూడా కలగన్నాను, ఇది పరిహాసానికి చెబుతున్నది కాదు, నిజంగా గొప్పవాణ్ణవుదామనుకున్నాను. నే నిక్కడికి వచ్చి ప్రాక్టీసు ప్రారంభించేక తెలుసుకున్నది మీకు గొప్ప లాయరు అవసరంలేదు; మీకు మీ వ్యవహారాలని నడిపించగల లాయరు కావాలి; ఇక్కడ ఒక వృద్ధుడికి పింఛను ఎక్కువయ్యేట్టు చూడాలి ఎందుకంటే అతనికి అజీర్తి ఉంది గనుక; ఫెల్ప్స్ కి భూమి కొలతలు మళ్ళీ జరపాలి ఎందుకంటే, మృతుడు విల్సను భార్యకి చెందిన భూమి ఎలాగైనా అతని దక్షిణంవైపు కొలతలోకి వచ్చెయ్యాలివెచ్చేట్టు చెయ్యాలి; నెలకి 5 శాతం వడ్డీకి అప్పు ఇచ్చి, ఎలాగైనా వడ్డీ రాబట్టుకోవడం కావాలి ఎల్డర్ కి; ముసలాయన స్టార్క్ కి ఇక్కడున్న ఆడవాళ్లకి ఏటా వచ్చే వడ్డీ డబ్బులు ప్రామిసరీనోటు కాగితం విలువకూడా చెయ్యని భూములమీద ఎలాగైనా మదుపుచేసేలా నమ్మించాలి. మీ కందరికీ నేను తప్పనిసరిగా కావాలసి వచ్చింది, ఇకముందుకూడా కావాలి. అందుకే నేను నిజం నిర్భయంగా చెప్పదలుచుకున్నాను.
“ఏదయితేనేం, మీరనుకున్నట్లుగా నేను వెనక్కి వచ్చి, మీరుకోరుకున్నట్టుగా నిజాయితీ లేని వ్యక్తిగా మారిపోయేను. మీరు నా మీద ఏదో గౌరవం ఉన్నట్టు నటిస్తారు; కానీ హార్వే విషయానికి వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా అతనిమీద బురదజల్లుతారు; ఎందుకంటే అతని చేతుల్ని కట్టిపడేసి వాటిని మీరు మురికిచెయ్యలేకపొయేరు గనుక. ఓహ్! చెప్పకేం, మీరందరూ వివేకవంతులైన క్రిస్టియన్స్!
“ఎప్పుడైనా మెరిక్ పేరు తూర్పువైపునుండి వచ్చే పేపర్లలో పెద్ద అక్షరలతో కనిపిస్తే, కమ్చీ దెబ్బలు తిన్న కుక్కలా సిగ్గుతో కుంచించుకుపోయేవాడిని; అప్పుడప్పుడు ఈ దిక్కుమాలిన బురదప్రపంచంలో పొర్లాడకుండా, అతని ప్రపంచంలో అతను, తను పెట్టుకున్న ఉన్నతమైన ఆదర్శాన్ని చేరుకుంటున్నట్టు ఊహించుకునే వాడిని.
“మరి మన సంగతి? ఈ నిర్జీవమైన చిన్న పడమటి నగరంలో మనందరం ఆశోపహతులమై అసూయతో చాతనైనంతవరకు పోట్లాడుకుని, అబద్ధాలడుకుని, కష్టపడి ఒకరిదొకరు దోచుకుందికి ప్రయత్నించి, ఒకర్నొకరు ద్వేషించుకుని మనం సాధించిందేమిటి? మీకందరికీ తెలుసును, మనమందరం సమిష్టిగా సాధించినదంతా ఇచ్చినా, దానికి సూర్యాస్తమయం చూడడానికి అతనిచ్చినపాటి విలువకూడా మెరిక్ ఇవ్వడని. ఇంత పగలూ, ద్వేషాలతో మండిపోయే ఊరునుండి అంతటి అద్భుతమైన మేధావి ఎలా పుట్టేడని అడిగితే దానికి కారణం నేను చెప్పలేను, మనమెవ్వరం అర్థంచేసుకోలేని ఆ లీల భగవంతుడుకి మాత్రమే ఎరుక. కానీ బోస్టనునుండి వచ్చిన ఈ వ్యక్తికి విన్నవించేదేమంటే, ఈ రాత్రి తను విన్న చొల్లుకబుర్లన్నీ ఏ గొప్పవ్యక్తి గురించైనా, ఈ సాండ్ సిటీ లాంటి ఏ దిగజారిపోయిన ఊరుకిచెందిన, దారితప్పిన, ఒళ్ళు కాల్చుకున్న, భూమిలేని వాళ్ళూ, వడ్డీవ్యాపారం చేసుకునే తిమింగలాలూ చెప్పేవేనని. ఈ ఊరిని ఆ భగవంతుడు రక్షించు గాక!”
ఆర్మీవ్యక్తి తల ఎత్తి మెడజాచి నాలుగుపక్కలా చూసి ఏమవుతోందో గ్రహించే లోపే, లాయరు బయటకి వెళుతూ స్టీవెన్స్ ని దాటినప్పుడు అతని చేతిలో అభినందనపూర్వకంగా చెయ్యివేసి, కోటుభుజంమీద తట్టి హాల్లోంచి నిష్క్రమించాడు.
మరుచటిరోజు జిమ్ లైర్డ్ బాగా త్రాగి అంత్యక్రియలకి హాజరుకాలేకపోయాడు. స్టీవెన్స్ అతని ఆఫీసుకి రెండుసార్లు వెళ్ళేడు కాని ప్రయోజనం లేక అతనికి వీడ్కోలు చెప్పకుండానే తూర్పున ఉన్న తన ఊరికి బయలుదేరవలసి వచ్చింది. అతని కెందుకో మనసులో అతనిదగ్గరనుండి మళ్ళీ ఏదో కబురు వస్తుందని అనిపించి తన చిరునామా అతని టేబిలుమీద ఉంచి వెళ్ళేడు. లైర్డ్ ఒకవేళ దాన్ని చూసి ఉంటే ఉండొచ్చునేమో గాని, సమాధానం ఇవ్వలేదు. హార్వే మెరిక్ శవపేటికతోపాటే పాటే, అతను తనని బాగా ప్రేమించేవాడన్న భావనకూడా సమాధి అయిపోయి ఉండవచ్చు. ఎందుకంటే, అతను మళ్ళీ ఎన్నడూ అతని గురించి మాటాడలేదు. ఫెల్ప్స్ కొడుకుల్లో ఒకడు కొలరాడోలో ప్రభుత్వానికి చెందిన కలప కొట్టినందుకు ఎదుర్కొంటున్న వ్యాజ్యంలోలో అతని తరఫున వాదించడానికి వెళుతూ దారిలో చలి ఒంటికి బాగా పట్టి చనిపోయాడు.
.
Willa Cather
December 7, 1873 – April 24, 1947
American
.
Original : https://cather.unl.edu/ss008.html
స్పందించండి