నీ పరోక్షంలో … షెర్నాజ్ వాడియా, భారతీయ కవయిత్రి
ఇకనుండీ నన్ను వివశను చేసే నీ బుంగమూతీ,
నవ్వితే సొట్టలుపడే నీ చిరునవ్వూ కనరావు కదా!
చుట్టూ ఉన్న రణగొణధ్వనినిసైతం ఛేదించుకుని
దాని ప్రతిధ్వనులు రహస్యంగా నా చెవుల్లో ఊసులాడుతూ
నా ఒంటరి విషాదాశ్రులు తుడిచి నన్నూరడించే
నీ కమనీయ కంఠధ్వని… ఉహూఁ, వినిపించదు.
నీ కరస్పర్శలోని ఇంద్రజాలం నేను పోగొట్టుకున్నాను.
నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే
అది నాలో ఇంకా జీవితేచ్ఛని రగిలించేది.
ఉద్వేగభరితమైన నా జీవిత గమకాన్ని
అలవోకగా అర్థంచేసుకుని నన్నలరించే
నీ కనుల దయార్ద్రరుచి … ఇక ఎన్నటికీ కరువే.
అన్నిటినీ మించి, నే నొంటరిగా దిగులుతో పొగులునపుడు
ప్రియాతిప్రియ నేస్తమా!చెంత నీ సాన్నిధ్యం లభించదుకదా!
.
షెర్నాజ్ వాడియా
సమకాలీన భారతీయ కవయిత్రి