సూర్యరశ్మిని పొగమంచు కప్పేసింది
నాలుగుప్రక్కలనుండీ పొగలు ఎగస్తున్న
పొట్టి గుడిశెలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి;
ఏదో చెప్పలేని నిరాశ
నా మనసుని కృంగదీస్తోంది.
కానీ, నే నొకవంక దిగులుతో అలమటిస్తుంటే
ప్రతి దిక్కునా లెక్కలేనన్ని అవకాశాలు
ఒకదానివెంట ఒకటి పరచుకుంటున్నాయి
గణించలేనంత మంది మనుషులు
చెప్పలేనన్ని మానసిక అవస్థలలో గడుపుతున్నారు.
ఇక్కడనుండి దూరంగా, ఆసియాలో
చదునుగా ఉన్న బిక్షువుల ఆశ్రమగోపురాలపైనా
బంగారు రంగులో మెరిసే
లాసా (టిబెట్) లోని మిద్దెలపైనా
సూర్యుడు మిలమిల మెరుస్తున్నాడు.
పసుపుపచ్చని టైబరు నదీ తీరాన
కాలంతోపాటు అరిగి నలుపెక్కిన పాలరాతి
విగ్రహాలలోని నవరసాధిదేవతలు
ఆ మ్యూజియంలో ఇప్పటికీ
అందంగానే కనిపిస్తున్నారు.
ఆ కోట సింహద్వారాల ముంగిలి
చిత్రమైన కేకలు మిన్నుముడుతున్నాయి
అదే (గ్రీసులోని) హెలికాన్ పర్వతాగ్రాలపై
ఎంత నిర్మలమైన ప్రశాంతత ఉందంటే
ఆ దాపున ఒక మబ్బుతునకకూడా లేదు.
ఇసుకతిన్నెలమధ్య కప్పబడి ఉన్న
ఒక ఒంటరి ఆఫ్రికను నగరపు
ఎండచొరరాని వీధులగుండా
వయసు పైబడిన ఒక అంధ భిక్షువు
ఎవరో నడిపిస్తుంటే బిచ్చమెత్తుకుంటున్నాడు.
వ్యయమైన ఈ ఎడారి అంతర్భాగంలోకి
ఇంతవరకు ఏ దోపిడిదారుడూ
ఇళ్ళు దోచుకోలేదు;
ఇక్కడి చూపును మించిన ఏ నిశితమైన చూపూ
దూరంనుండే తమ ఎరని ఇట్టే పసిగట్టనూ లేదు.
ఈ సహారా ఇసుక తుఫానులు
అతని రెండు కనుగుడ్లనూ చీల్చేసింది.
అతని గెలుచుకున్న దోపిడీ సొమ్ము ఖర్చయిపోయింది
అతనికిప్పుడు వర్తమానమంతా
కేవలం బాధతో కూడినదే.
అందమైన ఇద్దరు యువ ప్రేమికులు,
నులివెచ్చని జూన్ గాలి మాటున
తొలివేసవి పొలాలవెంబడి తిరిగివచ్చి
ఒకరితో ఒకరు సరసాలాడుకుంటూ
ఆనందంతో మైమరచి నిలబడ్డారు.
ఇద్దరూ జంటగా తీయని గొంతుతో,
కళ్ళలో మెరుపు తొణికిసలాడుతుంటే,
ఇలా అభ్యర్త్ధిస్తున్నారు: ” ఓ విధీ!
ఈ వర్తమానాన్ని కొంచెం పొడిగించవూ!
కాలమా! అక్కడే అలా ఆగిపోవా!”
వెనువెంటనే ఆ దేవత నిర్దాక్షిణ్యంగా
కనుబొమలు ముడిచి, తల అడ్డంగా తిప్పింది.
కాలం దాని ఇసుక గడియారాన్ని
ఎప్పుడు తిప్పాలో అప్పుడు తలక్రిందులు చేస్తుంది.
అంతే! వాళ్ళ తరుణం మించిపోయింది.
ఒకవేళ జాలి ప్రదర్శించి
ఆ న్యాయదేవత
వాళ్ళ ఆనందాన్ని పొడిగించి ఉంటే
మరొక చోట ఎక్కడో
మరొకరి దుస్థితిని పొడిగించి ఉండేది.
నిష్కల్మషమైన
ఏ క్షణపు ఆనందాన్ని నేను
శాశ్వతం చెయ్యడానికి ప్రయత్నిస్తానో
పదివేలమంది దుఃఖితులు
అది ముగియాలని ఎదురుచూస్తుంటారు.
నిర్దాక్షిణ్యమైన
ఆ “కాల”పు ఏ చీకటి సమయాలని
నేను నశింపజెయ్యడానికి ప్రయత్నిస్తానో
అవే క్షణాలని కొందరు గడుపుతారు
హాయిగా, ఆనందంగా, సంతోషంగా.
అందరూ అసంతృప్తినిచ్చే కాలం
అది ఏ ఒక్క మనిషిపట్లా
పక్షపాతం చూపించదు,
అందరు మనుషులకీ
వాళ్ల కష్టకాలం వాళ్ళకి తెస్తుంది.
.
మాత్యూ ఆర్నాల్డ్
(24 December 1822 – 15 April 1888)
ఇంగ్లీషు కవి

Image Courtesy: Project Gutenberg
స్పందించండి