[లిండా పాస్టన్ నైతికత విలువలకి సంబంధించి ఒక చక్కని ప్రశ్న తీసుకుని, బాల్యంలో నైతిక విలువలు అర్థంచేసుకోవడం ఎంత సంక్లిష్టమో, నైతికతమీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం ఎంత కష్టమో సూచిస్తుంది. అంతే కాదు, ఆ వయసులో కళాత్మకత కంటే, జీవితంవైపే ఎక్కువ మొగ్గు ఉంటుందని సూచిస్తుంది. పాఠకులు దీన్ని ఇంకా నిశితంగా విశ్లేషించుకోవచ్చు.]
చిన్నప్పుడు మాకు నైతికశాస్త్రం పాఠాలు చెబుతున్నప్పుడు
ప్రతి ఏడూ శరత్తులో మా ఉపాధ్యాయురాలు ఈ ప్రశ్న అడుగుతుండేవారు:
ఒకవేళ ఏదైనా ఒక మ్యూజియంలో అగ్నిప్రమాదం సంభవిస్తే
మీరు ఏది ముందు కాపాడతారు? రెంబ్రాంట్ చిత్రాన్నా?
లేదా ఇక అట్టే రోజులు బ్రతకదని తెలిసిన
ఒక వృద్ధురాల్నా?అని. కూచున్న కుర్చీల్లో అసహనంగా కదుల్తూ
చిత్రానికీ, వృద్ధాప్యానికీ ఏ రకమైన విలువ ఇవ్వకుండా
ఒక ఏడు చిత్రాన్ని అని చెబితే మరోసారి ముసిలిదాన్ని అనే వాళ్లం.
ఎప్పుడుచెప్పినా అయిష్టంగానే చెప్పేవాళ్లం. ఒక్కోసారి
ఆ మిసిల్ది మా అమ్మమ్మ ముఖకవళికల్ని దొరకబుచ్చుకుని
అలవాటైన వంటగది విడిచిపెట్టి గాలిలో తేలుతూ
ఊహాప్రపంచంలోని మ్యూజియంలోకి వస్తుండేది.
ఒక ఏడు, చాలా తెలివిగా, ఇలా అన్నాన్నేను:
ఆ ముసిలిదాన్నే నిర్ణయించుకోనియ్యకూడదా? అని.
లిండా, మా ఉపాధ్యాయురాలు అంది:అది సమాధానం చెప్పే
బాధ్యతనుండి పలాయనంచిత్తగించే పద్ధతి అని.
ఈ ఏడు శరత్తులో నేను నిజమైన మ్యూజియంలో
నిజమైన రెంబ్రాంట్ చిత్రం ముందు, ముసిలిదాన్ని,
లేదా వయసుపైబడ్డ నేను, నిలుచున్నాను. ఆ చిత్రంలోని
రంగులు ఆకురాలుకాలం కన్నా చిక్కగా ఉన్నాయి,
అంతేనా, చలికాలంకన్నా గాఢంగా ఉన్నాయి… ఆ నేల రంగులు
నేలతో సహా మిరిమిట్లుగొలిపే పంచభూతాలూ
ఆ చిత్తరువులోంచి ఉబుకుతున్నట్టున్నాయి. నాకిపుడు
ఆ మిసిలిదీ, ఆ వర్ణచిత్రం, ఆ ఋతువులూ అన్నీ ఒక్కలా కనిపించి
అది రక్షించుకోదగిన చిత్రమని బాల్యం గుర్తిస్తుందని అనుకోను.
.
లిండా పాస్టన్
(Born May 27, 1932)
అమెరికను కవయిత్రి
Linda Pastan
Ethics
.
స్పందించండి