రూబీ బ్రౌన్… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
ఆమె యవ్వనవతి, అందగత్తె
ఆమె శరీరాన్ని నులివెచ్చన చేసే సూర్యరశ్మిలా
కొద్దిగా బంగారు మెరుపు ఉంది ఆమెలో.
కానీ, ఆమె నల్లజాతి యువతి కావడంతో
‘మేవిల్లే ‘ లో ఆమెకి చోటు లేదు
ఆమె మనసులో జ్వలిస్తూ స్వచ్ఛమైన జ్వాలలా
పైకి ఎగసిపడే ఆనందానికి అవకాశాలూ లేవు.
ఒక రోజు
మిసెస్ లాథామ్ ఇంటి వెనక పెరట్లో
గిన్నెలు తోముకుంటూ,
తనని తాను రెండు ప్రశ్నలు వేసుకుంది
ఆ రెండింటి సారాంశమూ సుమారుగా ఇది:
తెల్లజాతి స్త్రీ వంటింట్లో పనిచేసే
నల్లజాతి పిల్ల ఆ డబ్బు ఏంచేసుకుంటుంది?
ఈ ఊర్లో ఆనందించడానికి ఏమైనా ఉందా?
ఇప్పుడు నది దిగువగా ఉన్న వీధులన్నిటికీ
ఈ అందమైన పిల్ల రూబీ బ్రౌన్ గురించి ఎక్కువ తెలుసు
అక్కడ ఎప్పుడూ కిటికీలు మూసి చీకటిగా
ఉండే గదుల్లో ఈ పసుపుపచ్చని పిల్ల
తన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బ్రతుకుతోంది.
చర్చికి వెళ్ళే నీతిమంతులైన ప్రజలు
ఆ పిల్ల పేరు ఇప్పుడు ఉచ్ఛరించరు.
కానీ, ఆ చీకటిగదుల ఇంటికి వెళ్లడానికి
అలవాటుపడ్డ తెల్లజాతి పురుషులందరూ
వాళ్ళ వంటిళ్ళల్లో ఆమె పనిచేస్తున్నపుడు
ఇంతకుముందు ఎన్నడూ ఇవ్వనంతగా
డబ్బు ముట్టజెప్ప సాగేరు.
.
లాంగ్స్టన్ హ్యూజ్
(February 1, 1902 – May 22, 1967)
అమెరికను కవి
.
