జీవితంలో అతిముఖ్యమైన విషయం… గ్రెన్ విల్ క్లీజర్, కెనేడియన్ అమెరికను కవి
నీకు ఏదో ఒక విషయం చెబుదామనిపించి
అది చెబితే విచారించవలసి వస్తుందనీ తెలిసి,
లేదా, ఒక అవమానం తీవ్రంగా పరిగణించి,
అది అంత త్వరగా మరిచిపోలేననుకున్నప్పుడు
అదే సరియైన తరుణం, నీ విచారాన్ని అణుచుకుని
మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యడానికి,
ఎందుకంటే, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే
మన చెడు ఆలోచనలన్నీ అణగారిపోతాయి.
కోపం తెచ్చుకోవడం చాలా సుళువు
ఒకరు మనని మోసగించినపుడూ, ఎదిరించినపుడూ;
మనం కోరిన కోరికలు నెరవేర్చనపుడు
చిటపటలాడుతూ, నిరుత్సాహపడడం సహజం;
కానీ, మన స్వార్థం మీదా, ఈర్ష్యమీదా
అర్థవంతమైన విజయం సాధించాలంటే
మనం రాజీలేని మౌనాన్ని పాటించడం నేర్చుకోవాలి
తప్పు మనలో లేదని తెలిసినప్పటికీ.
కనుక, శత్రువు నిన్ను ప్రతిఘటించినపుడు
నీ సంయమనాన్ని కోల్పోకూడదు.
అది దొంగచాటుదెబ్బ తీసే శత్రువైనా
లేదా, మీకు తెలిసిన ఏ ప్రమాదమైనా సరే!
మీ చుట్టూ ఎంత కలకలం రేగుతున్నా
మీరు నిగ్రహంతో ప్రశాంతంగా ఉండగలిగినంతసేపూ
మీ జీవితంలో అతిముఖ్యమైన విషయంలో
మీరు పట్టు సాధించేరన్న విషయం మరిచిపోవద్దు.
.
గ్రెన్ విల్ క్లీజర్
1868– 27th August 1953
కెనేడియన్ అమెరికను కవి