మొత్తానికి రోజు గడిచింది, రేయి రెక్కలనుండి చీకటి జాలువారుతోంది, ఎగురుతున్న గ్రద్ద ఈక ఒకటి ఊడి క్రిందకి తేలియాడుతూ రాలుతున్నట్టు.
ఈ పొగమంచులోంచీ, రాలుతున్న తుంపరలోంచీ ఆ పల్లెలోని దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి; నన్ను ముసురుకుంటున్న దుఃఖాన్ని నా మనసు నిగ్రహించలేకపొతోంది ఒక ఆవేదన, ఒక విషాద భావన అది పొగమంచుకీ తుంపరకి ఉన్న సామ్యంలా అది బాధ అని అనలేను గాని ఒక విషాదకరమైన మానసిక స్థితి.
రండి, ఎవరైనా ఒక పద్యాన్ని వినిపించండి మనసుని హత్తుకునే ఒక గీతాన్ని ఆలపించండి అది ఈ తెలియని వేదననుండి ఊరటకలిగించాలి ఈ రోజు గూర్చిన ఆలోచనలు పటాపంచలు చేయాలి. అలనాటి గొప్ప సంగీతకారులవీ పేరుపడ్డ గొప్ప కవులవీ వద్దు, దూరాననున్నా వారి అడుగుజాడలు ఎప్పుడూ కాలం వసారాలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఎందుకంటే, యుద్ధ గీతికలలా అందులోని గొప్ప ఆలోచనలన్నీ జీవితంలోని అనంత వేదనల్ని కీర్తిస్తాయి. నాకు ఈ రాత్రికి విశ్రాంతి కావాలి. ఒక పేరులేని కవి కవిత చదవండి అవి అతని మనసుచించుకుని వచ్చి ఉండాలి వేసవిలో మబ్బునుండి రాలే చినుకుల్లా కనుకొలకులనుండి జారే కన్నీటిలా
అతను కొన్ని రాత్రులు ఆశాంతితో ఎన్నో రోజులు కష్టపడి కష్టపడి అతని ఆత్మరాగాన్ని, అద్భుతమైన ఆర్ద్రగీతాల్ని విని ఉండాలి. అటువంటి గీతాలకే ఆవేదనలని ప్రేమతో ఊరడించగల శక్తి ఉంటుంది అవి ప్రార్థనానంతరం మనమీద వర్షించే దేవుని కృపలా ప్రసరిస్తాయి. కనుక మీరు పదిలంగా దాచుకున్న సంకలనంనుండి నచ్చిన కవిత చదవండి ఆ కవి సబ్దార్థ విన్యాసాలకి అణ్దమైన మీ స్వరాన్ని ఎరువియ్యండి.
ఈ రాత్రి సంగీతఝరిలో నిండిపోతుంది పగలల్లా పట్టిపీడించే వేదనలన్నీ వాటి నెలవులు ఎత్తివేసుకుని, అరబ్బులలా ఎక్కడికో చెప్పకుండా జారుకుంటాయి. .