ఫ్రాన్సిస్ మహారాజు సరసుడూ, వినోదప్రియుడూ. ఒకరోజు, పరివారంతో
క్రీడామైదానంలో సింహాలపోరాటం కుతూహలంగా చూస్తున్నాడు.
స్త్రీలు ప్రత్యేకస్థానాలలో, పురుషులు ఎదురుగా ఉన్నతాసనాలు అధిరోహించారు.
వారిలో లోర్జ్ యువరాజూ, అతని మనోహరి కూడా ఉన్నారు;
అప్పుడొక అద్భుతమైన ప్రదర్శన జరిగింది, సాహసానికీ ప్రేమకీ ప్రతీకగా
పైనుండి మహరాజూ, క్రిందనున్న మృగరాజులూ చూస్తుండగా.
సింహాలు అరుచుకుంటూ, దవడలు భయంకరంగా చాచి కరుచుకుంటూ;
ఒకదాన్నికటి చరుచుకుంటూ, తేరిపారి చూసుకుంటూ పోట్లాడుతున్నాయి; పంజా విసురుకి
గాలి ఒక్కసారి గట్టిగా వీచింది; ఒకదానిపై ఒకటి పడి బలంగా పొర్లుతూ,ఊపిరాడకుండా
తొక్కిపెడుతుంటే, ఆ గోతిలోని ఇసక వాటి వంటికీ,జూలుకీ అలుక్కుపోయింది.
రక్షణకోసం ఉంచిన కడ్డీలమీది మెత్తని తొడుగు గాలిలోకి దూదిలా ఎగురుతోంది;
అప్పుడు ఫ్రాన్సిస్ అన్నాడు,”దొరలారా! అదృష్టంబాగుండి మనం అక్కడలేము, ఇక్కడున్నాం”.
రాజుగారి మాట యువరాజు లోర్జ్ ప్రియురాలు చెవినపడింది. ఆమె చాలా అందాల రాశి.
ఎప్పుడూ నిలకడగా ఉండే పెదవులపై చిరునవ్వుతో, కళ్ళలోని మెరుపుతో,
ఆమె తనలో ఇలా అనుకుంది:”నా ప్రియుడు, యువరాజు లోర్జ్ సాహసానికి మారుపేరు.
నా మీద తన ప్రేమ ప్రకటించడానికి ఎంతటి సాహసానికైనా వెనుదీయడు.
మహరాజు, స్త్రీలూ, ప్రేమికులూ అందరూ చూస్తున్నారు; ఆ సందర్భం దైవదత్తం;
నేనిపుడు నా చెయితొడుగును విసురుతాను అతని ప్రేమనిరూపణకి; ఇక కీర్తి అంతా నా సొత్తే!”
ఆమె తన చెయితొడుగును విసిరింది; తన ప్రేమని నిరూపించమని అతని వంకచూసి నవ్వింది;
అతను వంగి అభివాదంచేసి, భీకరంగా పోరాడుతున్న సింహాలమధ్యకు ఉరికాడు,
ఉరకడం, వెనుదిరగడం రెప్పపాటులో జరిగింది; వచ్చి తన ఆసనంపై కూచున్నాడు.
ఆ చెయ్యితొడుగుని ఇప్పుడు ప్రేమగా కాకుండా కోపంతో ఆమె ముఖాన కొట్టాడు.
రాజు తన ఆసనంనుండి లేచి,”దేవుని సాక్షిగా నువ్వు మంచిపని చేశావని చెప్పగలను!
అటువంటి పరీక్షలో ప్రేమ ఏ కోశానా లేదు, కేవలం అహమిక తప్ప,” అని అన్నాడు.
.
లే హంట్
(19 October 1784 – 28 August 1859)
ఇంగ్లీషు కవి
స్పందించండి