తెలుగు కథలు పద్యాలు
కలలు చాలా పెంకివి… చిన్నపిల్లల్లా…
కథలోని రాజకుమారుడు
అన్ని వీధులూ వదిలి ఏడో వీధికే నడిచినట్టు
ఎప్పుడూ వద్దన్నవైపుకే పరిగెడతాయి…
అలసి మేనువాల్చాలని ఇలా కుర్చీలో చేరబడతానా
మనవరాల్లా ఒళ్ళోవాలి మెడ బిగించి,
ఎలామూస్తాయో గాని, ఇట్టే కళ్ళుమూస్తాయి.
రెండు రెప్పల్నీ రెక్కల్లాజాచి
చెప్పలేనిలోకాలకు తీసుకుపోతాయి.
మయుణ్ణి మించినమాయలాడులు కలలు.
వాటికిలొంగని వాళ్ళూ, భంగపడనివాళ్ళూ ఉండరు.
జీవితపు ఎడారిలో నిరాశాలదాహార్తి తీర్చే ఒయాసిస్సులు
అసాధ్యమైన పనులు సుసాధ్యమయేది ఈ ఎరీనాలోనే.
కలలు అతీంద్రియ గూఢచారులు.
లోలోపలపదిలంగా దాచుకున్న ఆలోచనలని
పసిగట్టి ప్రాణంపోసి దగ్గరకు తీసుకువస్తాయి.
గిజిగాడిని మించిన జిగిబిగితో
మూడుకాలాలనీ ముప్పేటలా అల్లుతాయి.
కలలు అపర విశ్వామిత్రులు. విజ్ఞాన ఖనులు.
‘కేకులే’కు బెంజీన్ నిర్మాణాన్ని చెప్పినా
‘ఆర్కిమిడీస్ ‘ కి బరువుల రహస్యం చెప్పినా చెల్లుతుంది.
తొమ్మిదినెలల సావాసపు తీపి గుర్తేమో
ఏడడుగుల తోడుకంటె, జీవితాంతం సహచరిస్తాయి.
రెప్పలముందు మనతో ఆడుకునే ప్రపంచంకంటే
రెప్పలవెనక మనం ఆడుకుందికో ప్రపంచాన్ని దాస్తాయి.
1.9.2004
అసలు టపాను చూడండి
స్పందించండి