సొగసైన తీరానికి వీడ్కోలు చెప్పి, చుక్కాని నిలకడజేసి జోరుగా తెప్ప వెళుతుంటే, అందులో అటూ ఇటూ తిరగడం ఇష్టంగా ఉండేది. తక్కిన ఓడసరంగులకు హుషారుగా చెయ్యి ఊపుతుండే వాడిని. అన్నిటిలోకీ నాది ఎప్పుడూ వేగంగా పోయేదని గర్వించే వాడిని.
దాని పక్కలని చిన్నచిన్న అలలు తడుతూ పాడే జోలపాటలు వినడానికి అనువుగా “చుక్కలబల్ల” దగ్గర ఒదిగి పడుకోడం ఇష్టం; పెను గాలికో, వడి అలలకో అది దిశమారుతున్నప్పుడు వాడ కిటికీల్లోంచి చూడడం, సముద్రకాకుల అరుపులు వినడం ఇష్టం.
అన్ని ఖర్చులూ భరించుకుని, మిత్రుల్ని తీసుకుపోయే దక్షిణాదిలోని ఏ విలాసవంతమైన తీరంలో నిలబెట్టడమన్నా ఇష్టంగా ఉండేది. తెగిపోయిన బెల్టూ, విరిగిపోయిన ప్రొపెల్లరు బ్లేడు వంటి విడిభాగాలకోసం ఎదురుచూడడమూ సరదాగానే ఉండేది.
కానీ ఇప్పుడు మరొకరిసేవకుడు దాని త్రికోణపు తెరచాపనెగరేస్తున్నాడు బాగా సంపదగలిగిన ఓడ కేప్టెన్ దాన్ని సముద్రంలోకి తీసుకుపోతున్నాడు మాటలు తియ్యగా పలకినంత సుళువుగా ఋణదాత దగ్గరనుండి డబ్బులు రాలవన్న నిజం గ్రహించలేనందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను.
అయితేనేం, నాలుగు అంచుల తెరచాపతో ఒక మోస్తరు ఆ చక్కని పడవని యువకుడిగా ఎంత నేర్పుగా, తనివితో నడపాలో అలా నడిపాను. దురదృష్టవశాత్తూ ఉన్నదానితో సంతృప్తి పడలేకపోయాను. అందుకే ఇప్పుడు అందమైన నా పడవ నను విడిచిపోతుంటే ఊరికే చూస్తున్నాను. . ఏలన్ సల్లివాన్