అనుకోని సంఘటన… గెరీ కేంబ్రిడ్జ్, స్కాటిష్ కవి
మనోహరమైన రాత్రి. నేను ఆరుబయటకి నడిచి
శిశిర నిశీధిని తలెత్తి ఆకాశాన్ని పరికిస్తాను
అక్కడ మేఘాలమధ్య తారకలు దివ్యంగా మెరుస్తుంటాయి
అప్పుడు మనసుకి ఏ ఆలోచనతడితే అది ఆలోచించవచ్చు.
నెత్తిన మెరుస్తున్న కృత్తిక దిగువ గొప్ప ఆలోచనలు
గిలకొడుతోంది. నలుప్రక్కలా దట్టంగా పరుచుకున్న ఈ రాతిరి
కిటికీ వెలుతురులోంచి వెతికే కనులకు అందని,
శుష్కమైన పశ్చాత్తాపాలనీ, వీడ్కోళ్ళనీ సులభంగా గుర్తుచేస్తోంది.
కానీ, ఇదేమిటి అకస్మాత్తుగా నా కాళ్ళదగ్గర
పాదాలను నాకుతూ? ఓహ్! ఎప్పుడూ మచ్చికగా ఉండే
బలిష్ఠమైన నా ముసిలి పెంపుడు పిల్లి; నిద్రలో
జడుసుకున్నట్టుంది, చెవులు వేలేసుకుని అరుస్తోంది.
దానికి ఆకలేస్తోందా? లేక నేను దాన్ని చేరదియ్యడం కావాలా?
ఏదయితేనేం, దాని రాకతో ఈ రాత్రి పరిపూర్ణమయింది.
.
గెరీ కేంబ్రిడ్జ్
జననం 1959
స్కాటిష్ కవి.

Photo Courtesy:
courtesy Scottishpoetrylibrary