రాయిలాంటి మట్టికూడా కొద్దిగా మెత్తబడింది,
రెండుప్రక్కలా ప్రవహిస్తున్న పిల్లకాలువలతో
కంచెల్లో కదలాడుతున్న పూలతో రోడ్డు తళతళలాడుతోంది.
ఎండకాస్తున్నప్పటికీ నేల తనమానాన తాను నిద్ర తీస్తోంది.
ఏనాటిదో ఈ జమీందారు తోటనీ, చర్చినీ, దానికి ఎదురుగా
వయసులో, ఎత్తులో సమానంగా ఉన్న యూ-చెట్టునీ చూసేదాకా
వాలుగా పడుతున్న కిరణాల్ని మామూలుగా అయితే లెక్కపెట్టేవాడిని కాదు
అవి ఫిబ్రవరి నెల సౌందర్యంలో ఒక భాగంగా అనుకుని ఉండే వాడిని.
ఆ చర్చీ, ఆ యూ-చెట్టూ, జమీందారు తోటా ఆదివారం
మధ్యాహ్నపు నిశ్శబ్దానికి నిద్రలో జోగుతూ జోగుతూ ఉన్నాయి.
ఎక్కడా గడ్డిపరకైనా కదులుతున్న గాలి జాడలేదు.
బాగా ఏటవాలుగా ఉన్న తోటబంగళా కప్పుమీద పెంకులు
మధ్యాహ్నపు ఎండవేడికి లీలగా మెరుస్తున్నాయి; దానిమీద క్రిందకీ
మీదకీ పావురాలు ఎగురుతూ వెచ్చగా కుదురుకుంటున్నాయి.
ఒక్క చిన్న శబ్దం మినహా మరే చప్పుడూ వినిపించడం లేదు.
బగ్గీకి కట్టే 3 గుర్రాలు వాటిని హింసిస్తున్న ఒకే ఒక్క ఈగను
తోకతో చెదరగొడుతూ, వాటి ముంగురుల సందులోంచి
అర్థనిమీలిత నేత్రాలతో ద్వారం వంక చూస్తున్నాయి.
శీతకాలం వసంత, గ్రీష్మ, శిశిరాది ఋతువుల్ని ఒక్క గుటకలో
త్రాగేసిందా అన్నట్టు దాని బుగ్గలు మెరుస్తూ ప్రశాంతంగా
నవ్వుతున్నట్టుంది. కానీ నిజానికి అది హేమంతానికే పరిమితమైన దృశ్యంకాదు…
అదొక మార్పుకు ఎరగాని బ్రహ్మానంద ఋతుస్థితి.
ఎంతో పురాతనమై, సంతోషానికి మారుపేరుగా పిలవబడే
ఈ ఇంగ్లండు నేలమిద ఆ తోటల్లో, చర్చిలో యుగయుగాలుగా
వాటి పెంకుల కప్పులక్రిందా,గడ్డికప్పులక్రిందా
భద్రంగా నిక్షిప్తమై ఉండి, ఇపుడు మళ్ళీ మేలుకొంది.
.
ఎడ్వర్ద్ థామస్
(3 March 1878 – 9 April 1917)
ఇంగ్లీషు కవి

(3 March 1878 – 9 April 1917)
స్పందించండి