చేతికి అంటిన ఆనవాళ్ళు … లెన్ క్రిసాక్, అమెరికను కవి
ఇది మనకి బాగా పరిచయమైన సాయంసంధ్యా చిత్రంతో పాటు, ప్రకృతిలోని ఒక సంఘటనని చమత్కారంగా కవితలోకి మలుచుకోవడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. మా మిత్రుడు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు (సమవర్తి పేరుతో ఈమాటలో పద్యాలు వ్రాస్తుంటారు) ఒక సందర్భంలో రాత్రి ప్రకృతిని వర్ణించి వర్ణించి, ముగింపుగా, దానికి “ప్రాతః సూర్యదీపాంజలి” సమర్పిస్తున్నానని సూర్యోదయాన్ని పేర్కొంటూ ముగిస్తారు. అది గుర్తొచ్చింది ఈ కవిత చదవగానే.
***
నేల చదునుచెయ్యడం పూర్తయి, కోసినగడ్డి బస్తాకెత్తి గట్టుమీదపెట్టి, నొప్పెడుతున్న వీపుని చేరవెయ్యడానికి అతను అనువైన ప్రదేశమూ, వాలుకుర్చీకోసం వెతుకుతున్నాడు. వేసవిపొద్దు సంధ్యచీకట్లు నెమ్మదిగా కమ్ముకుంటుంటే అతని దృష్టి ఆ రోజు తన శ్రమకి మంగళం పాడడానికి పశ్చిమ ఆకాశాన, ఎర్రగా మండుతున్న సూర్యుడివైపు మళ్ళింది ఆ రోజుకి అతను పని ముగించి విశ్రాంతి తీసుకుంటున్నా అతని చేతులకి పనిముట్ల స్పర్శ ఇంకా అంటుకునే ఉంది. అతను తన పానీయాన్ని ఇంకా ‘పార’ను పట్టుకున్నట్టే పట్టుకుంటూ ఆ చెయ్యి చేసిన పనిని గుర్తు చేసుకుంటున్నాడు. సూర్యాస్తమయం అవుతూంటే, అతను తాగుతున్న లెమనేడ్ గ్లాసుచుట్టూ నీటిబిందువులు పేరుకున్నాయి. ఒక్క తియ్యని గుక్క మిగిలి ఉంది. ఆ రేయికీ, తను తప్పిన శ్రమకీ శుభాకాంక్షా పూర్వకంగా దాన్ని మద్యం గ్లాసులా పైకి ఎత్తి సేవించాడు. .