ఆ రోజుల్లో అయితే ప్లాస్టిక్ మెనూ కార్డులమీద కెచప్ మరకలూ, నలిగిపోయిన పేపర్ మ్యాట్ లమీద ఇంకిపోయిన నీటి డాగులూ బాధపెట్టి ఉండేవి కావు. కానీ అదెప్పటి మాట. పదేళ్ళు గడిచిపోయాయి మేం పెదాలు తుడుచుకుంటూ మాటాడుకుంటున్నాం. మా జీవితాల్ని సంగ్రహంగా, గానుగెద్దుజీవితాలని తేల్చుకుని, వెర్రి నవ్వులవెనుక దాచుకున్నాం. లిప్ స్టిక్ అంటుకున్న అతని కాఫీ కప్పు మార్చాలి. అతనికి అర్థం కాని జోకు చెప్పలేక నేను సతమతమౌతున్నాను, అతను తన కారు గురించి చెబుతున్న గొప్పలు సగం వింటాను. అతను నాకో సిగరెట్ ఇవ్వబోతాడు నేను మానేసానని చెబుతాను. ఇంతలో మా బర్గర్లు వస్తాయి. విసిగెత్తిస్తున్న పెద్దవాళ్ళ కబుర్లు వినలేక అసహంతో పారిపోడానికి ప్రయత్నించే పిల్లల్లా తినడం ప్రారంభిస్తాము. బిల్లుకోసం మరో ఐదు నిముషాలు నిరీక్షించవలసి వస్తుంది. దానితో సరి, మేం ఎవరి త్రోవన వాళ్ళం వెళ్ళి పోడానికి సిద్ధం. ఇంతకీ, మేము ఏమిటి పునరుద్ధరించుకుందికి ప్రయత్నించేమో అంతుపట్టదు. .