ఆగష్టులో కాలిఫోర్నియా కొండలు… డేనా జోయ్ యె, అమెరికను కవి
మంచి ఎండవేళ ఎవరైనా ఈ కొండల్ని ఎక్కుతూ
కాలిక్రింద నలుగుతున్న కలుపుమొక్కల్నీ,
ధూళినీ తిట్టుకుంటూ చిరాకుపడుతున్నారంటే,
నీడనివ్వడానికి మరినాలుగు చెట్లుంటే బాగుణ్ణని
కోరుకుంటారంటే నేను అర్థం చేసుకోగలను.
ముఖ్యంగా తూరుపువైపు వాళ్ళు
వేసవిలో పల్చబడిపోయిన ప్రకృతినీ
ఎండి వంకరతిరిగిన నల్ల ఎల్మ్ చెట్లూ, ఓక్ పొదలూ
తుప్పలతో ఆగష్టునెలకే హరించుకుపోయిన
హరితాన్ని చూసి అసహ్యించుకుంటారు
ఒంటికీ, బట్టలకీ తగులుకొంటున్న
ముళ్ళ చెట్లూ, పొదలూ, ఏట్రింతలూ తప్పించుకు
నడిచే వాళ్ళకి, అవి కలుపుమొక్కలే అని తెలిసినా
ఈ మొక్కలకీ, అక్కడక్కడ కనిపించే ఎండుతుప్పలకీ
ఇంకా జీవం మిగిలి ఉందంటే నమ్మశక్యం కాదు.
వాళ్ళు ఎక్కడా కదలిక గాని, గాలి రివటగానీ లేక
నిశ్చలంగా ఉన్న మిరిమిట్లుగొలిపే ఎండని చూస్తే చిరాకుపడతారు;
తోడుగా మరొక్కటే ప్రాణి కనిపిస్తుంది:
ఎరకోసం వెతుకుతూ, దినకరుడి ప్రతాపంతో
రగిలిపోతున్న వినీలాకాశంలో ఎగురుతున్న డేగ.
ఐనప్పటికీ, వర్షాభావపు ప్రకృతిలో పుట్టి పెరిగినవారికి
నింగిని తాకుతున్న కొండలవరుసను చూడడానికి
వేళ్ళమీద లెక్కపెట్టగలచెట్లూ, గడ్డీతప్ప
ఏ అడ్డూ లేకుండా నిర్మలమైన ఆకాశమూ,
వర్షంకోసం ఎదురుచూపూ ఎంత బాగుంటాయి.
.