ఈ కవిత మయూర మహాకవి వ్రాసిన సూర్య శతకంలో మొట్టమొదటిశ్లోకాన్ని గుర్తుకు తెస్తోంది:
జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్ర సింధూర రేణుమ్
రక్తాస్సిక్తా ఇవౌఘైరుదయగిరితటీ ధాతుధారా ద్రవస్య
ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై
భూయాసుర్భాసయంతో భువన మభినవా భానవో భానవీయాః
(ప్రాన్నగమునుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఇంద్రుడి ఐరావతం నుండి వస్తున్న సింధూర రేణువుల్లాగా, ఉదయగిరులపైనున్న గైరికాది ధాతువుల ప్రవాహంచే తడిసి ఎర్రనైనట్టుగానూ, అదే సమయంలో పూర్తిగా విచ్చుకుంటున్న ఎర్రకలువలనుండి ఎగసి వస్తున్న పుప్పొడికాంతులతోనూ కలిసి మనోహరంగా ఉన్నవి).
సౌందర్యాన్ని సౌందర్యంగానే చూడాలితప్ప … మాయాబజారు సినిమాలో చెప్పినట్టు.. “రసపట్టులో తర్కం కూడ”దని చెబుతున్న కవిత. మన జ్ఞానం ఎంతగొప్పదైనప్పటికీ, దానికి తెలుసుకోగలపరిమితులున్నాయి. అంతమాత్రం చేత దాని పరిధికి ఆవల ఉన్నది గొప్పదని గానీ, ఏమీ లేదని గానీ చెప్పలేము. రెండూ నమ్మకాన్నీ ఆశ్రయించినవే.
***
.
ఈశ్వరానుగ్రహంగా కనిపించే ప్రకృతి లీలగా కలిగించిన అలజడికి
ఒక నాస్తికుడి ప్రతిస్పందనలు ఈ ప్రభాత సమయపుటాలోచనలు
రంగులు నిరాకారములై, ఏ పరిణామాన్నీ కలిగిలేకపోయినా
సాపేక్షంగా తప్ప, వాటంతట వాటికి అస్తిత్వం అంటూ లేకపోయినా,
ఈ ప్రభాతవస్త్రపు అపురూపమైన వర్ణాలు శాంటా క్లాజ్ వంటి
అద్భుతమైన చిత్రవిచిత్రమైన కాల్పనిక రూపాల్ని సృష్టిస్తున్నాయి,
(హెన్రీ) మాటిస్ రంగులకి అనుకరణలుగా ఉన్న ఈ వర్ణమిశ్రమాలు
తెలివైన శాస్త్రజ్ఞులు మనమీద రుద్దిన సిద్ధాంతాల మాయ.
మనం చూస్తున్న ఈ దృశ్యాన్ని శాస్త్రదృష్టితో విశ్లేషిస్తే
అటు ఫావిజమూ, ఇటు “ఎస్ ఫహాన్” సంప్రదాయమూ నిలబడవు.
అయినప్పటికీ మనం అందులో లీనమై, ఇష్టపూర్వకంగా ఉపేక్షించి
మన అస్తిత్వానికి అవాస్తవిక సర్దుబాట్లు చేసుకుంటూనే ఉంటాము.
కనుక ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో
మనకి మనం నచ్చజెప్పుకునే పేలవమైన మాటలు,
అర్థంలేని ఆశావాదం మీదా, మనం సృష్టించుకునే
భయంకర చిత్రాలమీదా ఆధారపడక తప్పదు
అవి మనం ఎవరిమో విశదీకరించడానికి ఉపయోగించినా,
వాటి అంతరార్థం మన మనసు తెలుసుకోగలిగిన దానికి
అతీతంగా, మన మనసు నిరంతరం మనకి విడమరిచే
వివరణల పరిధికి చెందుతుందని చెప్పడానికి వెనకాడుతాం.
ఇంద్రియాలు చేసే మాయాద్వీపాలకి అతీతంగా
మనం తెలుసుకోవలసిన ధర్మసుక్ష్మాలు లేవని తెలిసేక
(మన మెదడులో “మయుడు” చేసే ఇంద్రజాల కల్పనలు)
మన అనుభూతుల్ని మిధ్యా-భ్రాంతులుగా ఆవిష్కరిస్తాయి.
అయినప్పటికీ, మనం ఇంకా ఇంకా వెలుతురుతో సంసర్గాన్ని కోరుకుంటాము
మన ఒంటరి, ఏకాంత దుఃఖాలను చీల్చి వెలుగులు విరజిమ్మాలని:
నేను ఉదయిస్తున్న సూర్యుడికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను
నా గదిలో దట్టమైన రంగులు నింపడానికి ఎంచుకున్నందుకు.
.
డిక్ డేవిస్
జననం ఏప్రిల్ 18 1945
సమకాలీన ఇంగ్లీషు కవి
స్పందించండి