ఈ సజీవ హస్తం… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఇది చాలా చిత్రమైన కవిత. నిజానికి ఇది అసంపూర్ణ కవిత. కీట్స్ దీనిని తన అసంపూర్ణ కవితల రాతప్రతులలో రాసుకున్నాడు. ఈ కవిత కాలం సుమారుగా అక్టోబరు 1819. నిజానికి 18 అక్టోబరు 1819 న కీట్స్ కీ అతని ప్రేయసి ఫానీ బ్రౌన్ కీ నిశ్చితార్థం జరిగింది. వారిద్దరు వివాహం చేసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. కీట్స్ కి తను ఎక్కువకాలం బ్రతకనని అప్పటికే తెలుసు. భయపడినట్టుగానే, రెండేళ్ళలో కీట్స్ చనిపోతాడు. అతనిమీద ఉన్న ప్రేమకొద్దీ ఆమె కీట్స్ చనిపోయిన 12 సంవత్సరాలవరకూ వివాహం చేసుకోలేదు.
ఈ కవిత అర్థాంతరంగా ముగుస్తుంది. బహుశా ఆమెకు అతని మరణం వేదన మిగిల్చినపుడు ఉపశాంతినివ్వడానికి తన కవిత పనికొస్తుందని చెప్పదలుచుకున్నాడేమో! (?)
*
ఇప్పుడు వెచ్చగా, సజీవంగా దేన్నైనా
సుళువుగా పట్టుకోగలిగిన ఈ చెయ్యి, రేపు, చల్లబడిపోయి
సమాధిలోని నిశ్శబ్ద ఏకాంతతకు గురయితే,
నీ పగళ్ళూ, కలలుగనే రాత్రులూ వెంటాడుతూంటే,
నా శరీరంలో తిరిగి జీవం ప్రవహించడానికీ,
“అరే, నేను చనిపోయినా బాగుండేది,” అని అనిపించవచ్చు
నీ మనసుకి ప్రశాంతత నివ్వడానికి; ఇదిగో చూడు
ఇది నీ కోసమే, నీకోసమే దీన్ని పట్టుకుంది.
.
జాన్ కీట్స్
31 October 1795 – 23 February 1821
ఇంగ్లీషు కవి.
