ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి నా ప్రార్థనలు చొరబడలేనపుడు; నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై, నా గుండెనిండా భయాలు నిండి అంతా అస్తవ్యస్తమైపోయింది.
వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా, రెండుగా చీలిపోయాయి; వేటిత్రోవన అవిపోయాయి; కొన్ని సుఖాలవేటలో పోతే కొన్ని పోరాటాలకీ, ప్రమాదకరమైన ప్రయత్నాలవైపు మరలాయి.
ఎక్కడికెళితేనేమిటి, అని అవి అంటుండేవి, రేయింబవళ్ళు చేసే వాడికోళ్లకు హృదయమూ, కాళ్ళూ చచ్చుబడిన తర్వాత? ఓ ప్రభూ! కనికరించి కనిపించు, కనిపించు, అయినా నువ్వు కనిపించవు.
చిత్రమేమిటంటే, నువ్వు మట్టికి నిన్ను వేడగలిగే నాలుకని ప్రసాదించి, తీరా అది వేడుకున్నపుడు నువ్వు వినిపించుకోవు! రోజల్లా రోజల్లా నా హృదయం మోకాళ్లమీదే ఉంది అయినా నువ్వు కనిపించవు.
కనుక నా ఆత్మ కనుమరుగైపోయింది శృతిచేయకా, మీటబడకా; బలహీనమైన నా మనసు, తృంచబడినగుండెలా సవ్యమైనమార్గంలో చూడలేకున్నది వేరుపడి, వేలాడుతోంది.
ఓ ప్రభూ! గుండెలేని హృదయానికి ధైర్యం చెప్పి, శృతి చెయ్యి, ఆలస్యం చెయ్యవద్దు; దాని వల్ల నా ప్రార్థనలకు నువ్వు చూపిన అనుగ్రహానికి అవీ నా మనసూ జంటగా గణగణమ్రోగుతూ నా కవితను సరిదిద్దగలుగు గాక!
.
జార్జి హెర్బర్ట్ (3 April 1593 – 1 March 1633) వెల్ష్ కవి .