జానపదగీతిక … ఎజ్రా పౌండ్, అమెరికను కవి
వెలుగు ఆమె హేలగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ
మనుషాకృతుల్లో ఎన్నో క్రీనీడలను ప్రాకిస్తోంది.
చూడు, వెలుగు మనసు దోచి మనచే ఎలా కూనిరాగాలు తీయిస్తోందో!
ఆమె క్షణకాలం సూర్యుడి వెలుగుని ధరిస్తుంది
నా మనసు ఎన్నడో ఆమె అధీనమైపోయింది .
కీకారణ్యాల్లో ఏ జింకపిల్లలూ, దుప్పులూ సంచరించవు
అంత నిశ్శబ్దంగా ప్రాకుతోంది సూర్యరశ్మి;
ఆమె నడుస్తున్నంత మేరా, తలవాల్చిన పచ్చిక మీద
మెరుస్తున్న పచ్చలు ఎక్కడ త్వరగా ఇగిరిపోతాయోనని సూరీడు
వాటిని క్రిందకి తరుముతున్నాడు; సాలీడు సైతం
ఆమె అంత నాజూకుగా, సన్నగా తన పట్టునెయ్యలేదు.
.
ఎజ్రా పౌండ్
(30 October 1885 – 1 November 1972)
అమెరికను కవి .
