తుదిశ్వాస విడిచిన తర్వాత… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
(జెమీమా హార్డీ (1813 – 1904) స్మృతిలో )
.
ఇక చెయ్యడానికీ, భయపడడానికీ, ఆశించడానికీ ఏమీ లేదు; ఇక ఎవ్వరూ
కనిపెట్టుకుని ఉండనక్కరలేదు;చిన్నగొంతుతో మాటాడడాలూ, విసిగి వేసారడాలూ ఉండవు;
దుప్పటిమీద ఇబ్బందిగా కనిపించే ముడతలు సరిదిద్దనక్కరలేదు,
తలగడ ఆమెకు వాలులో పెట్టనక్కరలేదు.
మేము శూన్యదృక్కులతో చూస్తున్నాం. ఉండడం, వెళ్ళిపోవడం ఇక మా ఇష్టమే;
ఆతృతతో వేసుకున్న రేపటి మా పథకాలు వాటి లక్ష్యం తప్పాయి;
ఇక ఈ రాత్రికి ఊరు వదిలినా, రేపు ఉదయందాకా నిరీక్షించినా
పెద్ద తేడా పడదు.
అక్కడ స్పష్టంగా రాసి ఉన్న మందుల సీసాలు
‘మమ్మల్ని ఇక్కడ ఎందుకుంచారు?” అని అడుగుతున్నట్టున్నాయి;
ప్రతి నొప్పి నివారణమందూ తమ నిరుపయోగానికి
వెర్రిమొహం వేస్తున్నాయి.
అయినా ఇందులో ఏదో మేలు జరిగిన అనుభూతి మాకు కలుగుతోంది.
ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న అచేతనకి ఉపశమనం దొరికినట్టుంది;
స్వల్ప కాల మాళిగలో బందీ అయిన మా ప్రేమాస్పదురాలు
ఇక లేదు.
ఒక్కటొక్కటిగా, తప్పుచేసిన మమ్మల్నందరినీ
ఆమె ఎంత నేర్పుగా తప్పించుకుందో తెలియవస్తోంది.
దానితో సరిపోల్చినపుడు క్షణికమైన ఈ వియోగము
చాలా చిన్నదిగా కనబడుతోంది.
స్పందించండి