ఈ వనాళి అతి పురాతనమైనది; ముళ్ళపొదల్లోంచి పైకిలేచే లేతీవెలపై కుసుమిస్తున్న మొగ్గలు, వసంతాగమన సూచీ వీచికలకు, ఎంత అందంతో ఇనుమడిస్తున్నాయో— ! ఈ గులాబి ఎన్ని అజ్ఞాత శతాబ్దులుగా నలుచెరగులా విరబూస్తున్నాదో ఏ మనిషీ చెప్పలేడు.
ఈ సెలయేళ్ళూ పురాతనమైనవే; నీలాలనింగి క్రింద చల్లగా నిద్రించే హిమపాతాలనుండి ఉద్భవించే కొండవాగులు గతంలోకి జారుకున్న చరిత్రని ఎంతగా ఆలపిస్తాయంటే సాలమన్ చక్రవర్తికంటే వివేకవంతంగా వాటి ప్రతి పదమూ పలుకుతుంది.
మనుషులం మనందరం పురాతనులమే; ఈవ్ కి చెలికత్తెలైన నైటింగేల్ పిట్టలు ఈడెన్ లోని చీకటితోటలలో చెప్పిన కథలే మనందరం కలగనే కలలు; మనం కాసేపు మేలుకుని గుసగుసలాడతాం కానీ, ఈ లోపు రోజు గడిచిపోతుంది, ఇక చెంగలువలా శాశ్వతంగా మిగిలేది నిద్రా, నిశ్శబ్దమూ మాత్రమే… . వాల్టర్ డి లా మేర్ 25 April 1873 – 22 June 1956 ఇంగ్లీషు కవి.