ప్రేమే సర్వస్వం కాదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
గమ్మత్తైన శిల్పంతో ప్రేమ సర్వస్వం కాదంటూనే, దాన్ని సర్వస్వంగా వాచ్యం చెయ్యకుండా నిరూపిస్తుంది ఎడ్నా ఈ కవితలో.
***
ప్రేమే సర్వస్వం కాదు; అది తిండిపెట్టదు, దాహం తీర్చదు
నిద్రపుచ్చదు, కనీసం వర్షాన్నుండి రక్షించదు;
అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొయ్యకూడా కాదు
దాన్ని ఆసరాగా చేసుకుని మునుగుతూ, తేలుతూ, ఒడ్డుచేరుకోడానికి;
గట్టిపడిన ఊపిరితిత్తుల్ని అది గాలితో నింపలేదు,
రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకని అతకనూలేదు;
అయినప్పటికీ, మనిషి మృత్యువుని కాగలించుకుంటూనే ఉన్నాడు
నేను మాటాడుతున్న ఈ క్షణంలో కూడా, కేవలం ప్రేమ దొరకనందువల్ల.
కష్టకాలం సమీపించినపుడు, బాధలు ఒక్కుమ్మడిగా మీదబడి
నేలకి కృంగిపోయి, ఊపిరాడక సతమతమౌతున్నప్పుడు, లేదా,
బ్రతకాలన్న ఆశనుకూడా దిగమింగిన లేమిలో అలా అనిపించవచ్చు
నేను నీ ప్రేమకు బదులు ప్రశాంతతని ఆహ్వానించ వచ్చు;
లేదా, ఈ రేయి నీ జ్ఞాపకాన్ని ఆహారానికి వినిమయం చేసుకోవచ్చు.
ఏమో అలా జరిగినా జరుగవచ్చు. కానీ, అలా జరుగుతుందని అనుకోను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
స్పందించండి