వివేకం అంది,”చూస్తుండు, అతన్ని నా వాదనతో వంచిస్తాను;”అని.
ప్రేమ అంది, “ఊరుకో! నేనతన్ని మనసుతో వంచిస్తాను.” అని
మనసు హృదయంతో అంది, “ఫో!నన్ను చూసీ,
నిన్ను చూసీ నవ్వకు. అతనిది కానిదేముందని
అది చూపి అతన్ని మోసగించడానికి?
అతనికి విచారంలేదు, ఆందోళన లేదు, అజ్ఞాతమే కొరుకుంటున్నాడు
పోనీ అతనికి మద్యాన్నీ, అధికమొత్తంలో ధనాన్నీ చూపి వంచిద్దామన్నా.
అతని చూపులతూపులు ఏ వింటినుండీ వెలువడటంలేదు
ప్రతిగా మరొక వింటినుండి చూపుల అమ్ములతో ఖండించడానికి.
అతనీ ప్రపంచానికి ఖైదీ కాడు, ఈ నేలకి ఏ సంకెళ్లతో
అతుక్కుపోలేదు అతనికి బంగారునిధులూ, రాజ్యాలూ ఇచ్చి వశపరచుకుందికి.
మనిషి రూపంలో కనిపిస్తున్నప్పటికీ, అతనొక దేవదూత.
అతనికి ఏవ్యామోహమూ లేదు, స్త్రీలను ఎరవేసి మోసపుచ్చడానికి.
ఇటువంటి ఆకారం ఎక్కడ వసిస్తే, అది దేవదూతలకు స్థావరమౌతుంది
కనుక అతన్ని అటువంటి ఆకారాలూ రూపాలూ చూపి ఏం లోబరచుకోగలను?
అతను ఏ గుర్రాలమీదా స్వారీ చెయ్యడు అతను ఊహల్లో విహరిస్తాడు గనుక;
అతను తినేదే తక్కువ, ఇక ఏ విందుభోజనం ఆశపెట్టను?
ఈ ప్రపంచ విఫణుల్లో అతను బేహారీకాడు, వర్తకుడూ కాదు
పోనీ అతనికి లాభనష్టాల బేరీజు వేసి మోసగిద్దామన్నా.
అతనికి ఏ కపటవేషాలూ లేవు, నేను రోగిలా నటిస్తూ,
నిట్టూరుస్తూ, అతన్ని రోదనతో వంచించడానికి.
నేను నా తలని దగ్గరాకట్టుకుని ప్రణమిల్లుతాను దోవతప్పినందుకు;
అతని అనుకంపని రోగమనీ, మనోవ్యాధనీ మోసగించను
అతను నా వక్రబుద్ధిని, నటననీ ఒక్కొక్కకేశాన్నీ విడదీసి చూడగలడు.
అతనికి ఏది అందుబాటులోలేదని దాన్ని చూపి అతన్ని మోసపుచ్చడానికి?
అతనికి కీర్తి కాంక్షలేదు, కవులంటే వ్యామోహమున్న రాజూ కాదు,
పోనీ గీతాలతో, అద్భుతమైన కవిత్వంతో వశపరచుకుందికి.
ఆ నిరాకారస్వరూపపు తేజోమహిమ మరీ గొప్పది
వరమనుగ్రహించో, స్వర్గాన్ని ఎరచూపించో వంచించడానికి.
అయితే ఒక్కటి, షామె తబ్రీజ్(Shams-e Tabriz), అతనికి ఇష్టుడూ, గురువూ
అతని వేషం ధరించి మాత్రం నేను వంచించడానికి ప్రయత్నిస్తాను.
.
రూమీ
పెర్షియను సూఫీ కవి

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి