ఒకటే వాన, అర్థరాత్రి కురుస్తున్న వాన, ఈ పాకమీద
కుండపోతగా కురుస్తున్న వాన; నాకు మళ్ళీ
దగ్గరలోనే చనిపోతానేమోనని అనిపిస్తోంది, బహుశా
నేను మరోసారి వాన చప్పుడు వినలేకపోవచ్చు,
నేను ఒంటరిగా పుట్టినప్పటికంటే నిష్కల్మషంగా
నన్ను శుభ్రపరచినందుకు దానికి ఉచితరీతిలో
కృతజ్ఞతలు చెప్పుకోలేకపోవచ్చు. అద్భుతమైన ఈ వాన
తమమీద కురిసే విగతజీవులు ఎంతధన్యులో!
కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ప్రేమించినవారితో సహా
ఎవరూ ఈ రాత్రి మరణించకూడదనీ, ఒంటరిగా
వానపడటం వింటూ గాని, బాధతో గాని
ఎండిపోయిన చెట్లమధ్య ప్రవహించే నీరులా,
ఇంకా మేలుకోకూడదనీ, నిస్సహాయంగా సజీవులమధ్యగాని,
నిర్జీవుల మధ్యగాని ఉండకూడదని ప్రార్థిస్తున్నాను.
ఇక్కడ నిశ్చలంగా, శిధిలమై, బిర్రబిగిసిన కట్టెలు చాలా ఉన్నాయి.
ప్రేమ ఎరుగని నాలాగే, ఈ అదుపులేని వాన, అన్ని ప్రేమలనీ
తుడిచిపెట్టేసింది… ఒక్క మృత్యువుమీద ప్రేమతప్ప.
పరిపూర్ణమైన దానిని మనం ప్రేమించవలసీ మనం ప్రేమించ
లేమంటే, తుఫాను హెచ్చరిస్తోంది, నా నమ్మకం వమ్మవుతుందని.
.
ఎడ్వర్డ్ థామస్,
(3 March 1878 – 9 April 1917)
ఇంగ్లీషు కవి
( మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న బ్రిటిషు సైనికుడూ కవీ ఐన ఎడ్వర్డ్ థామస్ యుద్ధం నిష్ప్రయోజనమని చెబుతూ 1916 లో యుద్ధభూమిలో వ్రాసిన కవిత. అతను భయపడినట్టుగానే, ఈ కవిత రాసిన ఏడాదిలోనే, Battle of Arras లో ఎడ్వర్డ్ చనిపోతాడు. )

(3 March 1878 – 9 April 1917) British Poet photo courtesy: Wikipedia
స్పందించండి