ఇన్ని జరిగినప్పటికీ, అది నీలోంచి విస్ఫోటనం చెందుతూరాకపోతే నువ్వు రాయకు. నువ్వు అడక్కుండనే నీ గుండెలోంచీ, మనసులోంచీ, నోటిలోంచీ నీ గొంతులోంచీ రాకపోతే, నా మాటవిని రాయకు! దానికోసం నువ్వు గంటలతరబడి నీ కంప్యూటరు తెరవంక తేరిపారచూస్తూనో, లేక, నీ టైపురైటరు మీద వాలిపోయో మాటలకోసం వెతుక్కుంటూ కూచోవలసి వస్తే రాయకు! నువ్వు డబ్బు కోసమో, కీర్తికోసమో రాస్తుంటే దయచేసి ఆ పని చెయ్యకు. స్త్రీల పొందు దొరుకుందని ఆశించి నువ్వు రాద్దామనుకుంటే, రాయొద్దు. నువ్వు అక్కడ కూచుని పదే పదే చెరిపిరాయవలసి వస్తే నా మాటవిని రాయొద్దు. దాని గురించి ఆలోచించడమే పెద్ద శ్రమ అనుకుంటే రాయవద్దు. నువ్వు మరొకరిలా రాద్దామని ప్రయత్నిస్తుంటే ఆ విషయం మరిచిపోవడం మంచిది. అది నీలోంచి ఉరుముతున్నట్టు రావడానికి నిరీక్షించాల్సి వస్తే, దానికోసం ఎంతకాలమైనా నిరీక్షించు. అదెప్పటికీ నీలోంచి ఉరుముతూ రాకపొతే మరోపని మొదలెట్టు. నువ్వు రాసింది ముందుగా నీ భార్యకో ప్రేయసికో, నీప్రియుడికో, తల్లిదండ్రులకో, అసలెవరికో ఒకరికి చూపించడం తప్పనిసరి అయితే నువ్వు రాయడానికి ఇంకా సిద్ధంగా లేవు. నువ్వుకూడా అందరు రచయితల్లాగే ఉండకు నువ్వుకూడా తాము రచయితలమని చెప్పుకునే వేలాదిమందిలో ఒకడివి కావద్దు నీరసంగా, విసిగెత్తిస్తూనో లేనిది ఉన్నట్టు నటిస్తూనో, నీమీద నువ్వు జాలిపడుతూనో ఉండకు. ఇప్పటికే ప్రపంచంలోని గ్రంధాలయాలన్నీ ఇలాంటి రాతలతో నిండి ఆవులిస్తూ నిద్దరోతున్నాయి. వాటికి మరొకటి జోడించకు. అది నీ చైతన్యంలోంచి రాకెట్టులా దూసుకుంటూ రాకపోతే, రాయకుండా ఉండడం నీకు పిచ్చెక్కించడమో ఆత్మహత్యకో, హత్యకో నిన్ను పురికొల్పేలా లేకపోతే రాయొద్దు. నీలోని అగ్నిజ్వాలలు నీ గొంతు దహిస్తూ ఉండకపోతే, రాయకు. ఆ సమయం నిజంగా వచ్చినపుడు అది నిన్ను ఎంచుకున్నపుడు, దానంతట అదే వస్తుంది. అంతే కాదు, అది నువ్వు మరణించేదాకానో అది నీలో మరణించేదాకానో వస్తూనే ఉంటుంది.