ఈ కవితలో సౌందర్యం గాలివానని గెద్దలావాలడం అన్న ఊహలో ఉంది. సహజంగా సంగీతజ్ఞురాలైన ఈ కవయిత్రి అంత సంగీతభరితంగానూ ఈ కవితను వ్రాసింది. ప్రతి పదచిత్రం వెనుకా ఆ భావాన్ని ప్రతిబింబించే శబ్దం వెనుక శబ్దాన్ని గమనించండి.
***
నల్లని రెక్కలతో కనుమరుగైన కోండలమీదకి వాలుతుంది
భయపడిన పిల్లయేరు, దానికి ముందు దౌడుతీస్తుంది;
అడవిలోంచి ఎక్కడనుండో ఆకుల గలగల వినిపిస్తుంటుంది
రెమ్మల్ని హత్తుకుంటూ
కొమ్మలమీంచి జారుతూ
ఒక్కసారిగా పిట్టలన్నీ గప్ చుప్ అయిపోతాయి.
ఒక ఉరుము ఆకాశాన్ని పిడికిట్లో నలిపేస్తుంది
మెరుపు దాన్ని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది.
ఇప్పుడిక వర్షం మొదలు!
నిర్దాక్షిణ్యంగా కుప్పకురుస్తుంటుంది
ఆ ‘పైన్’ చెట్ల గజిబిజికి అల్లరిగాలి మహా సరదా పడుతుంది.
మెల్లిగా వెండి వెలుతురు వడకట్టబడుతుంది
ఆహ్లాదకరమైన చల్లదనం!
వేసవి ఆగ్రహం తొలగిన అనుభూతి
సమీపిస్తున్న గ్రీష్మపు సాధుత్వం
పశ్చాత్తాపంతో… కన్నీళ్ళతో
మన్నింపుతో.
.
లెనోరా స్పేయర్
(7 November 1872 – 10 February 1956)
అమెరికను కవయిత్రి
.
Leonara Speyer
Photo courtesy: Wikipedia
స్పందించండి