నా దుఃఖాన్ని అమూల్యంగా భావించి సంబరం చేసుకుంటూ నా వ్యథని నేను గర్వంగా ప్రదర్శించుకుంటున్నాను. నా అశ్రుకణాలు సిగలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి నా మౌనం ఇంద్రనీలమణిపొదిగిన ఉంగరంలా దిగ్భ్రాంతి గొలుపుతోంది. ఏ వెలుగులకన్నా చీకటే తన నీలివస్త్రం కప్పి ఇంద్రజాలంతో నన్నొక అపురూపమైన వస్తువుగా చెయ్య్యగలదు, నేను ధరించే ఏ ఇతర రంగులుకన్నా ఎక్కువగా నాపై ప్రసరించే నీడల ముత్యాలకాంతులు శోభనిస్తాయి. నాలాంటి వ్యక్తికి ఆనందాన్నివ్వడానికి ఏమి మిగిలింది? సూర్యాస్తమయమే దివ్యంగా మహత్తరంగా కనిపించినవాడికి కొత్తగా ఏ ప్రాభాతసంధ్యాసింహాసనాలు ఉదయించగలవు? నవ్వులు ఆకాశాన చక్రవాతాలై తిరుగుతూ ఈలవేస్తుంటాయి. ఈ ఉపద్రవానికి దూరంగా రాజ్యచ్యుతుడనై నలుగురిలో ఒకడిగా నగ్నంగా, బహిష్కృతుడనై సర్వంకోల్పోయి ఎండలో నిలబడతాను.