(ఇది చాలా అపురూపమైన కవిత. మనకి కొందరు వ్యక్తులపట్ల, కొన్ని జాతులూ, మతాలపట్లా నిష్కారణమైన ద్వేషం ఉంటుంది. ముందు మనం వాటిని ద్వేషించడం ప్రారంభిస్తాం గనుక ద్వేషించడానికి తగిన కారణాలు ఎంత అల్పమైనవైనా, అర్థంలేనివైనా వెతుక్కోజూస్తాం. ప్రభుత్వాలైనా అంతే. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసేది ప్రతీదీ తప్పు అనడం తప్ప ప్రభుత్వనిర్ణయాలను దేశప్రయోజనాల దృష్టిలో వివేచించే ప్రసక్తి ఉండదు. ఎదుటవ్యక్తిమీద మనతీర్పులన్నీ అతనిచర్యలవల్ల మనకి కలిగే లాభనష్టాలమీద ఆధారపడి ఉంటాయి తప్ప, ఎదుటివ్యక్తికి మనం కోరుకున్నట్టుగానే, అతనికి ప్రయోజనకరమైనవి అతను ఎంపికచేసుకునే హక్కు ఉందని మనం అంగీకరించలేకపోవడం వల్ల కలిగే పర్యవసానం ఇది. ఈ మానసిక స్థితిని ఈ కవిత బాగా ప్రతిబింబిస్తుంది.)
***
ఇక పిల్లులు బ్రతికుండడానికి వీల్లేదు.
వాటివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి,
అవి వాతావరణం కలుషితం చేస్తాయి,
పిల్లులు వారానికి వాటి బరువుకు
ఏడురెట్లు తినెస్తుంటాయి
ఈజిప్టు, ప్రాచీన రోము వంటి
భ్రష్టుపట్టిన సమాజాల్లోనే
పిల్లుల్ని పూజించడం జరిగింది;
గ్రీకులకి పిల్లుల్తో పనిలేదు.
పిల్లులు కూచుని మూత్రవిసర్జనచేస్తాయని
(అని మన శాస్త్రజ్ఞులు ఋజువుచేశారు.)
వాటిని మైధునంకూడా ఘోరంగా ఉంటుంది;
వాటికి చంద్రుడంటే వల్లమాలిన వ్యామోహం.
వాటిరాజ్యంలో అయితే అవి ఫర్వాలేదేమో గాని
మనదేశంలో మాత్రం వాటి అలవాట్లు బొత్తిగా కొత్త.
పిల్లులు గొప్ప కంపుకొడతాయి, మరోలా ఉండలేవు,
పిల్లులు మెట్లెక్కుతుంటాయి,
టీవీ ఎక్కువ చూస్తుంటాయి,
తుఫానొచ్చినా కదలకుండా పడుక్కుంటాయి,
క్రిందటిసారి అవి మనకి వెన్నుపోటు పొడిచాయి,
గుర్తుందా. పిల్లుల్లో ఎక్కడా గొప్ప
కళాకారుడు పుట్టలేదు. అందరికీ తెలిసిందే.
పిల్లల అచ్చుపుస్తకాల్లో తప్ప పిల్లిలో “పి”
అన్న అక్షరాన్ని అంత ప్రశస్తంగా చూపెట్టనక్కరలేదు;
నాకు తరచు తలనొప్పిరావడానికీ
మా ఇంట్లో చెట్లు చచ్చిపోడానికీ కారణం ఎవరనుకున్నారు?
మా జిల్లానిండా అవే,
వాటివల్లే, స్థిరాస్థి విలువలు పడిపోతున్నాయి.
నాకు దేముడు కల్లోకొచ్చినపుడు
లోకంలో పిల్లుల్ని లేకుండా చూడమని కోరుకుంటాను.
నోరుమూసుకుని చెప్పినట్టు విని నడుచుకోవలసినదానికి
వాటికి వాటి భాషే మాటాడాలనీ, వాటి మతమే
ఆనుసరించాలనీ అంతమంకుపట్టు ఎందుకు?
పిల్లులు సర్వనాశనం అయిపో గాక!
కుక్కల పరిపాలన వెయ్యేళ్ళు వర్థిల్లుగాక!
.