మనిషి ఆశాజీవి. వర్తమానం ఎంత కష్టంగా గడుస్తున్నా, భవిష్యత్తు బాగుంటుందనే ఆశలేకపోతే, మనిషి బ్రతకలేడు. తన బలహీనతలు అర్థం చేసుకుని, వర్తమానంలో భవిష్యత్తుకోసం తగిన ప్రణాళికలు వేసుకోకుండా కూడా బ్రతకలేడు. ఈ చిన్న కవిత కష్టాల్లో ఒక రైతు ఇంటిపోరునీ, వర్షాభావాన్నీ, కవివాక్కులు తలుచుకుని తన జీవితానికీ రాజీ పడడాన్నీ కవయిత్రి ఎంతో అందంగా ఏ వ్యాఖ్యలూ లేకుండా చిత్రించింది.
***
రోడ్డుమీద మందంగా దుమ్ము పేరుకుపోయింది
పొలాలు ఎండకి మాడిపోతున్నాయి
రోజుపని పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేక
మా ఆవిడకి అనడానికి కటువుమాట సిద్ధంగా ఉంటుంది.
మా పక్కింటివాళ్ళు ద్వారం ఆనుకునే సేదదీర్చుకుంటున్నారు
వాళ్ళ మాటలు గట్టిగా కీచుగా సగం వినిపిస్తున్నాయి
నా కొడుకు నాకు సాయం చెయ్యడానికి మరీ చిన్నవాడు
పొలం దున్నడం రోజురోజుకీ కష్టమయిపోతోంది.
అస్తమయవేళ ఆకాశంలోకి కళ్ళేత్తి చూస్తుంటే
ఎవరో కవి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి:
చంద్రుడిలో తెల్లని చంద్రకాంతశిలా వేదిక ఉన్నది
దానికి చల్లని నీడనిస్తూ మల్లెతీగల పందిరి ఉంది.”
.