సివిల్ ఇంజనీర్లు… ఫీబీ హాఫ్ మన్, జర్మను-అమెరికను కవయిత్రి
వాళ్ళు ప్రకృతి కోటగోడలపై దాడి చేశారు
మందుగుండు, రంధ్రాలువేసే యంత్రాలతో కదిలారు
ఆమె కొండ బురుజులపైకి, చిత్తడి నేలల్లోకి
ఆమె శక్తికి దీటుగా వాళ్ళ నైపుణ్యంతో.
కొండగొర్రె కొమ్ములు మెలితిరిగినట్టు
వాళ్ళ వంతెనలను ఎగసిపడే కెరటాలతో మెలితిప్పినా
వాళ్ళ జలాశయాల దన్ను గోడలమీద
ఆకలిగొన్న పులిలా ఆమె లంఘించినా
వాళ్ళు బీవర్ (Beaver) కళను అనుకరిస్తూ
అడ్డుగోడల్ని సాలెపురుగుల్లా అల్లేరు
గుండెతడిలేని ఏడారిలో పూలు విరబూయించి
ఎడారి నిద్రమత్తుని వదలగొట్టేరు
ప్రకృతి హైమహస్తాల్లోంచి సొరంగాలు తవ్వో
లేక పాములా వంపులు పోయో
దాన్ని ఇనుప దూలాలమధ్య బంధించారు
త్యాగధనుడైన వీరుణ్ణి శిలువకి కట్టినట్టు.
వెన్నెముకలాంటి ఆమె శిఖరాల్ని
భూసంధుల్లో ఒడ్డునుండి ఒడ్డుదాకా విడదీసి
ఆమె కొందచరియలతో ముంచెత్తుతుంటే
వాళ్ళ శక్తిమంతమైన త్రవ్వోడలతో శ్రమించేరు.
నిలకడలేని ప్రియురాల్లా ఆమె కఠినం
ఆగ్రహించిన దేవతలా కర్కశం
అంతలోనే తల్లి ఒడిలా మెత్తన
కొత్త ప్రదేశాలని ఒక్కొక్కటీ వాళ్ళు జయిస్తుంటే.
ఆర్కిటిక్ వృత్త ప్రదేశాలు మొదలుకుని
కర్కటక మకరరేఖల వరకూ
చైనాలోని Yellow Sea ప్రవాహాలనుండి
స్విట్జర్ లాండ్ లోని Matterhorn పర్వతం దాకా
ఇంతవరకు మచ్చికచేయని భూమాతని జయించారు;
ఆమె అప్పుడప్పుడు అగ్నిపర్వత ఫిరంగులు ఎక్కుపెట్టినా
వాళ్ళు ఆమెను తాము చెప్పినట్టు నడుచుకునేలా చేస్తారు
తిరుగుబాటు చేసే నేర్పరులైన కొడుకుల్లా.