గడ్డకట్టే చలికాలంలో… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! మనిద్దరం రెండు పువ్వులాంటి వాళ్ళం
వాడిపోతున్న తోటలో చివరగా పూచిన వాళ్ళం,
ఊదారంగు పొద్దుతిరుగుడుపువ్వొకటీ, ఎర్రదొకటీ
ఒంటరిగా నిస్సహాయంగా పాడుబడిన ప్రకృతిలో.
తోటలోని చెట్లన్నీ వయసుడిగి, ఆకులురాలుస్తున్నాయి.
ఒక బిరుసైన ఆకు మరో ఆకుతో రాసుకుంటోంది.
నినదిస్తున్న రాలుతున్న పూరేకుల సవ్వడి
ఇక నువ్వూ నేనే తలూచుకుంటూ మిగిలాం.
ఒకప్పుడు మనతో చాలామంది ఉండేవారు; అందరూ వాడిపోయేరు.
మనిద్దరమే ఎర్రగానూ, బచ్చలిపండు రంగులోనూ మిగిలున్నాం.
మనిద్దరమే మంచుకురవని సుప్రభాతాలలో
సూర్యుడు పైకెదుగుతుంటే, రంగుతో కళకళలాడుతున్నాం.
పాలిపోయిన చంద్రకాంతిలో నేను నిన్ను అరకొరగా చూస్తున్నప్పుడూ,
తర్వాత చలికి నా పాదాలు కొంకర్లుపోతున్నప్పుడూ
నేను మళ్ళీ సూర్యోదయం చూడగలనా అని అనుమానమేస్తుంది
ఏం జరుగుతుందో అన్న భయంతో నిద్ర పట్టకుండా పోతుంది.
నువ్వో… నేనో. నేను చాలా పిరికిని.
తప్పకుండా చలి ఎరుపునే తీసుకుపోతుంది.
ఊదా చాలా మంచి రంగు
ఏకాంతంలో చాలా అందంగా కనిపిస్తుంది.
వాడి శిధిలమైపోయిన పూలకొమ్మలమీద
మనిద్దరం గాలికి ఊగుతున్నాం.
ఇక ఎన్నో రోజులు మిగిలి లేవు మనిద్దరికీ.
ప్రియతమా! నువ్వంటే నాకిష్టం!
.
ఏమీ లోవెల్
(February 9, 1874 – May 12, 1925)
అమెరికను కవయిత్రి