తొలి ఇరవై ఏళ్ళవరకూ నువ్వు ఎదుగుతుంటావు;
శారీరకంగా; అంటే, కవిగానే అనుకో, కానీ
అప్పటికింకా నువ్వు కవిగా జన్మించవు. తర్వాతి పదేళ్ళలో
ఉచితానుచితాలు తెలీకుండా కవిత్వంతో ఆతురంగా చేసే సహవాసంతో
మెల్లమెల్లగా నీకు జ్ఞానదంతాలు మొలవడం ప్రారంభిస్తాయి.
కవిత్వంతో నీ తొలిప్రేమకలాపాన్ని గంభీరంగా తీసుకుంటావు
కానీ, ఆ కవితలతో నీకు అనుబంధాలు పెనవేసుకోవు
తీరా నీ ప్రేమంతా స్పందనలేని హృదయరాణి గూర్చి
వేదన వెలిబుచ్చడానికి పరిమితమైనపుడు, సిగ్గుపడిపోతావు.
నలభైల్లోకి ప్రవేశించగానే
అక్కడక్కడ రాతల్లో వెలిబుచ్చిన అందమైన భావాలూ,
పదునైన మాటలబట్టి, అక్కడోముక్కా, ఇక్కడోముక్కా ఏరుకుంటూ
ఒక భావకవితగానో, ఒక పద్యంగానో, మాత్రలూ
గణాలూ పేర్చి ఎలా అల్లాలో చూచాయగా నేర్చుకుంటావు.
మరొక ప్రక్క కాలం, తననుండీ, దొంగచూపులుచూస్తూ
నీ రహస్యాలు తెలుసుకోవాలనుకునే ప్రజలనుండి
నీ గాయాల్ని దాచుకుందికి సరికొత్తగా ప్రోత్సహిస్తుంటుంది.
వయసు పైబడుతుంది.
ఎన్నాళ్లబట్టి రాస్తున్నావన్నది లెక్కలోకొస్తుంది. కానీ,
నెమ్మదిగా సాగే కవితాప్రపంచంలో, దురదృష్టవశాత్తూ
అప్పుడే ఇంకా నువ్వు యవ్వనంలోకి ప్రవేశిస్తుంటావు
గర్వంతో తొణికిసలాడే కవితాకన్య వదనం మీద
మెరిసే దరహాసం … నీకోసం కాదని తెలుస్తుంది.
.