పదచిత్రాలు… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి
1
బాగా ముగ్గి ఘుమఘుమలాడుతున్న పళ్ళునింపుకుని
వెనిస్ నగర కాలువల్లో తీరిగ్గా సాగుతున్న గూటిపడవలా
ప్రియతమా! సమ్మోహపరుస్తూ నువ్వు,
నిరాదరణకుగురైన నా మనోనగరంలో ప్రవేశించావు.
2
అటూ ఇటూ తిరిగి మాయమయే పక్షుల గుంపుల్లా
నీలినీలి పొగ అంచెలంచెలుగా పైకిలేస్తోంది.
నా ప్రేమ కూడా నీ వంకకు గంతులేస్తోంది …
భయంతో వెనుకంజవేస్తూ, మళ్ళీ కొత్తగా చిగురులేస్తోంది
3
చెట్లలో చిక్కుకున్న పొగమంచులో
లేతకుంకుమరంగులో సూర్యుడు అస్తమిస్తుంటే
పాలిపోయిన ఆకాశంమీద పసుపుగులాబివన్నె
చందురునిచందం కనిపిస్తున్నావు నువ్వు నాకు.
4
అడవి అంచున ఒక లేత బీచ్ చెట్టు
సాయంవేళ ఒంటరిగా నిలుచుని,
నక్షత్రాలను చూసి జడుసుకునట్టు
చిరుగాలి తరగలకి ఆకులూ కొమ్మలతో వణుకుతున్నట్టు
నువ్వుకూడా ఒంటరిగా నిలుచుని, కంపిస్తున్నావు.
5
ఎర్రని దుప్పులు పర్వతాగ్రాలకి చేరుకున్నాయి
చివరి వరుస పైన్ చెట్లనుకూడా దాటిపోయాయి.
నా కోరికలుకూడా వాటితోపాటే పరుగుతీస్తున్నాయి.
6.
గాలితాకిడికి ఊగిసలాడిన పువ్వు
కొద్దిసేపటిలోనే వర్షంతో తడిసింది;
నా మనసుకూడా భయాలతో నిండుకుంటోంది
నువ్వు తిరిగివచ్చేవరకూ.
.
రిచర్డ్ ఆల్డింగ్టన్,
8 July 1892 – 27 July 1962
ఇంగ్లీషు కవి, రచయిత
