సానెట్ 04 … ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
(ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే 66వ వర్ధంతి సందర్భంగా)
*
నీ రూపాన్నీ, దాని గురించి నే కన్నకలలతో సహా
నా జ్ఞాపకాలు పరిభ్రమించడానికి అనుమతించేది
ఈ సిగరెట్టు కాల్చడం పూర్తయీదాకా మాత్రమే.
నేలమీద నుసి నిశ్శబ్దంగా రాలుతుంటే
నేపథ్యంలోని జాజ్ సంగీతంతో కలిసి
చలిమంట వెలుగులో ముక్కలు ముక్కలుగా క్రీనీడలు
గోడమీద వంకరలుపోతూ కత్తిలా పొడవుగా సాగేవరకే.
ఒక లిప్త కాలం, ఆ తర్వాత అంతా ముగిసిపోతుంది.
ఆ తర్వాత శలవు. వీడ్కోలు. కల కనుమరుగౌతుంది.
నీ ముఖాన్నీ, దాని రంగునీ, అందులోని
ప్రతి కవళికనీ నేను సులభంగా మరిచిపోగలను.
మాటలు, ఎన్నడూ మరువలేను; చిరునవ్వు, సాధ్యపడట్లేదింకా;
కానీ నీ జీవితంలో నువ్వు గర్వపడే ఈ క్షణం మాత్రం
సూర్యాస్తమయం తర్వాత కొండమీది వెలుగులాటిది.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి, నాటక కర్త
పులిట్జరు బహుమతి గ్రహీత
