ఒకప్పుడతన్ని ప్రేమించలేదు; ఇప్పుడతను లేడు
నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను.
అతను మాటాడుతుంటే మందలించాను; అతను మాటాడగలిగితే
ఎంత బాగుండును. అయ్యో!ఇపుడు నేను మందలించను కదా!
ఒకప్పుడు అతన్ని ప్రేమించకపోవడానికి కారణాలు వెతికేను
అలసిపోయేదాకా నా ఆలోచనలన్నీ గిలకొడుతూ
అతన్నీ విసిగించేను,నేనూ వేసారేను;
నిన్నటి వరకు నా కోసం జీవించిన
అతనే గనుక బ్రతికి రాగలిగితే ఇపుడు నా ప్రేమని
అతనికి ఇవ్వడానికి సుముఖమే; ఎప్పుడైతే
అతను వృధాశ్రమ అనుకున్నాడో, అతని ముఖాన్ని
పవిత్రప్రదేశంలో మృత్యుచాయలో చాటుచేసుకున్నాడు.
తన శ్వాసని నాకోసం వృధాచేసినతనికి,
ఇపుడు నా ఊపిరి వృధాచేస్తున్నాను. నా ఊపిరి తిరిగొచ్చి,
ఈ ముక్కలైన హృదయం దహిస్తోంది
ఉక్కిరిబిక్కిరిచేసే మంటతో; నిద్రలో నను తట్టిలేపి
అతని హృదయాన్ని ద్రవింపజేసిన కన్నీళ్ళను
నన్నిపుడు మెలకువలో రోదించమని శాసిస్తోంది;
పాపం! తను ఎన్నాళ్ళు నాకై కన్నీళ్ళు కార్చేడో!
“దయామయుడవైన ప్రభువా!” అదే అతని కడసారి ప్రార్థన
“ఆమె వీటినెన్నటికీ అనుభవించుగాక!” అని.
అతని శ్వాస విశ్రాంతి తీసుకుంది. మట్టిపాలైన
కుసుమాలకన్నా, అతని గుండే చల్లగా ఉంది.
ఇప్పుడు చర్చికి అటూ ఇటూ, పిల్లలందరూ
అతని పేరునీ, సంక్షిప్త జీవితాన్నీ తలుచుకుంటున్నారు.
చిన్నారి హృదయాల్లారా! మీరెక్కడున్నా
అతనికోసం ప్రార్థించండి! అతనితోపాటు నా కోసమూ!
.
వాల్టర్ సావేజ్ లాండర్
(30 January 1775 – 17 September 1864)
ఇంగ్లీషు కవి
స్పందించండి