చిన్నప్పుడు మొదటిసారి ఆ బాదం చెట్టుక్రింద
ఆడుకోవడం మొదలుపెట్టినదగ్గరనుండి
బాగున్ననాడూ, బోగున్ననాడూ
మనిద్దరం ఎప్పటినుండో స్నేహితులం.
ఎందుకో నీ మనసులో ఉదాసీనత చోటుచేసుకుంది.
నీ కళ్లలో ఏదో అనుమానం పొడచూపుతోంది.
మనిద్దరం ఎన్నాళ్ళనుండో స్నేహితులం కదా
ఒక చిన్న మాట ఇపుడు ఇద్దరినీ విడదీయనివ్వవచ్చా?
ఇద్దరం కలిసి ఆనందంగా గడిపేం,
నవ్వుకుంటూ పరాచికాలాడుకున్నాం,
మనిద్దరి మనసుల్లో ఎన్నో ఆశలూ
ప్రేమగా పెల్లుబుకజొచ్చేవి
నీ పెదవి మీద ఇపుడు చిరునవ్వు మాయమైంది
నీ కన్నుల విషాదం కమ్ముకుంటోంది.
మనిద్దరం కలిసి ఎన్నాళ్ళో ఆనందంగా ఉన్నాం కదా
ఒక చిన్న మాట ఇపుడు ఇద్దరినీ విడదీయనివ్వవచ్చా?
మనిద్దరం కలిసి కష్టాలు పంచుకున్నాం
మనిద్దరం కళ్ళు అవిసేలా రోదించాం
మన చిన్ననాటి ఆశలు గడ్దిమొలిచిన
సమాధుల క్రింద నిద్రిస్తున్నాయి.
అప్పుడు మౌనంగా ఉన్న గొంతుకలు
ఇప్పుడు ఉల్లాసంగా ఉండమని నిను కోరుకుంటున్నాయి;
ఇద్దరం కలిసి దుఃఖాన్ని పంచుకున్నాము కదా,
ఒక చిన్న మాట ఇపుడు ఇద్దరినీ విడదీయనివ్వవచ్చా?
.
కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్
(22 March 1808 – 15 June 1877)
ఇంగ్లీషు కవయిత్రి .

.
స్పందించండి