కొండవాలంతా చలిగాలులు వీస్తున్నాయి త్రోవకనరాని ఆ ఆరుబయలు బావురుమంటోంది, సమయం ఎంతయిందో తెలియరాని ఆ చీకటి రాత్రి పాపం, ఒక తల్లి తన బిడ్డతో దారితప్పి తిరుగుతోంది. తేలిపోతున్న మంచుని కాగలించిందా అన్నట్టుగా ఆమె గుండెను పొదువుకుని బిడ్డ నిద్రిస్తోంది.
గాలి ఇంకా చల్లగానే విసిరికొడుతోంది. నడి రాత్రి అప్పుడే గడిచిపోయింది తేలివస్తున్న మంచు బాగా ముసురుకుంటోంది: ఆమె అవయవాలు చచ్చుబడి, శక్తిసన్నగిలింది. “భగవంతుడా!” అంటూ ఆమె గట్టిగా మొరపెట్టుకుంది, “నేను చనిపోవలసి వస్తే, నా బిడ్డను కాపాడు తండ్రీ!” అంటూ.
తనుగుండెచుట్టూ కప్పుకున్న దుప్పటి తీసింది, మంచుతుఫానుకి తన గుండెని ఎరచేసింది, తనబిడ్డ చుట్టూ రక్షణగా కప్పింది, బిడ్డ వెచ్చగా ఉందన్న ఆలోచనకే సంతసించింది. చల్లబడ్డ పెదాలతో ఓ ముద్దుపెట్టుకుని, అశ్రువొకటి జార్చి, ఆ మంచు పానుపుపై నిలువునా కూలబడిపోయింది.
వేకువనే ఒక బాటసారి అటు వెళ్ళాడు మంచులోకప్పబడిఉన్న ఆమెని కనుగొన్నాడు ఆమెకళ్ళలో మృత్యువు గడ్డకట్టింది, బుగ్గలు కళతప్పి, చల్లబడి బిరుసెక్కాయి. అతను బిడ్డచుట్టూ ఉన్న దుప్పటి తొలగించాడు బిడ్డ తలపైకెత్తి తియ్యని ఒక నవ్వు నవ్వింది. . సెబా స్మిత్
స్పందించండి