ఈ రోజు (ఏప్రిల్ 23, 2016) షేక్స్పియర్ 400వ వర్ధంతి.
ఏప్రిల్ 26 1564న బాప్టిజం జరిగినట్టు రికార్డులు చెపుతున్నాయి. అప్పటి అచారాలను బట్టి 23 ఏప్రిల్ అతని పుట్టిన రోజుకూడా అవడానికి అవకాశం ఉంది.
సాహిత్యంలో కీర్తిప్రతిష్టలు ఎప్పుడూ దేశ, కాల, భాషాపరిమితులకు లోబడి ఉంటాయి. ఒకవేళ కొందరు ఇతరభాషలలోకి అనువదించబడినా, వాళ్ల రచనల విషయం గాని, రీతి గాని కాలపరీక్షకు నిలిచిన సందర్భాలు చాలా అరుదు. బహుశా ప్రపంచసాహిత్యంలో అటువంటి అరుదైన గుర్తింపుకి నోచుకున్నది షేక్స్పియర్, కాళిదాసులు మాత్రమే కావచ్చు.
చరిత్రలో ఒక భాగం అవడం చాలా అదృష్టం. మనం షేక్స్పియర్ కి సమకాలికులం కాలేకపోయినా, అతను గతించిన 400 సంవత్సరాలకు కూడా అతన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుంటున్న సందర్భంలో, అతని సాహిత్యాన్నీ, అతని పాత్రలనీ, వాటి ఆవేశ కావేషాలనీ, బలహీనతల్నీ, ఉదాత్తతనీ, మానవనైజంలో ఎన్ని కోణాలుండగలవో అన్ని కోణాలనూ సాహిత్య సృష్టిలో చూపించిన అతని పాఠకులుగా, విద్యార్థులుగా అతనికి నివాళి అర్పించగల ఒక కాలశకలంలో భాగం పంచుకోగలిన అదృష్టవంతులం మనం.
ఈ సందర్భంలో అతని సానెట్లలో అతిప్రముఖమైన సానెట్ 18 మీకు సమర్పిస్తున్నాను. అతనికి నివాళిగా నేను రాసిన ‘నాటిక’ నా వేరే బ్లాగులో చూడొచ్చు (incidentalmuses.wordpress.com ). ఈ సానెట్లో అతను వ్యక్తపరచిన అభిప్రాయాలు కవితలో ప్రస్తుతించిన వ్యక్తికి ఎంతగా వర్తిస్తాయో, చిత్రంగా షేక్స్పియర్ కి కూడా నూటికి నూరుపాళ్ళూ వర్తిస్తాయి.
చిత్తగించండి.
.
నిను వేసవి తొలివేకువతో సరిపోల్తునా?
ఉహూ. నువ్వు అంతకంటే సుందరంగానూ, శాంతంగానూ ఉంటావు:
వడగాలులు పూలకన్నియల లేత హృదయాలను కలతపెడతాయి,
అయినా గ్రీష్మఋతువనగా ఎంతపాటిది? మూణ్ణెల్ల ముచ్చట.
ఒకోసారి దివిచక్షువు మరీ తీవ్రంగా ప్రజ్జ్వలిస్తాడు,
అంత తరచుగానూ అతని పసిమి మైచాయ క్షీణిస్తుంది.
ప్రతి అందమూ తన అందాన్ని ఎప్పుడో ఒకప్పుడు కోల్పోవలసిందే,
యాదృఛ్ఛికంగానో, ప్రకృతి తన సహజ పరివర్తనశైలిలో త్రుంచినపుడో.
కానీ, అనశ్వరమైన నీ శోభ ఎన్నటికీ జిగి తూలదు
నీకే స్వంతమైన సౌందర్యాన్ని ఎప్పటికీ కోల్పోదు;
శాశ్వతమైన కవితలో కాలంతో పాటు నువ్వు ఎదుగుతుంటే,
తన పంచన నీ వున్నట్టు మృత్యువు ప్రగల్భాలు పలుక లేదు
భూమిమీద మనిషి బ్రతికినంతకాలం, కనులు చూడగలిగినంతకాలం
ఈ కవిత చిరస్థాయిగా ఉంటుంది, దానితోపాటే నువ్వూ చిరంజీవిగా ఉంటావు.
.
షేక్స్పియర్
.
SONNET 18
Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance, or nature’s changing course, untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou ow’st;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou grow’st;
So long as men can breathe or eyes can see,
So long lives this, and this gives life to thee.
.
Shakespeare
Notes
temperate (1): i.e., evenly-tempered; not overcome by passion.
the eye of heaven (5): i.e., the sun.
every fair from fair sometime declines (7): i.e., the beauty (fair) of everything beautiful (fair) will fade (declines). Compare to Sonnet 116: “rosy lips and cheeks/Within his bending sickle’s compass come.”
nature’s changing course (8): i.e., the natural changes age brings.
Sonnet and Notes Courtesy:
http://www.shakespeare-online.com/sonnets/18detail.html
స్పందించండి